
కన్నీరు మున్నీరవుతున్న బాధిత దంపతులు
అనంతపురం, పరిగి: పేదోడి ఇంట్లో చోరీ జరిగింది. పింఛన్ సొమ్ము అపహరణకు గురవడంతో బాధిత వృద్ధ దంపతులు లబోదిబోమంటున్నారు. శ్రీరంగరాజుపల్లి ఎస్సీ కాలనీలో ముత్యాలప్ప గారి నరసింహప్ప తన భార్యతో కలిసి ఓ ఇంట్లో నివాసముంటున్నారు. వీరి ఏకైక కుమార్తెకు పెళ్లి చేశారు. ఇక నరసింహప్ప దంపతులు కూలి పనులు చేయడం చేతకాకపోవడంతో ప్రభుత్వం ఇచ్చే పింఛన్ సొమ్ముతో జీవనం సాగిస్తున్నారు. ఒక పూట భోజనం చేస్తే మరో పూట పస్తులుండి కాలం నెట్టుకొస్తున్నారు.
పింఛన్ డబ్బులో నెలనెలా కొంత పొదుపు చేసుకుంటూ బీరువాలో భద్రంగా దాచుకున్నారు. ఈ క్రమంలో గత సోమవారం రాత్రి గ్రామంలోనే ఉంటున్న కూతురి ఇంటికి వెళ్లారు. అక్కడే పడుకుని మంగళవారం ఉదయాన్నే ఇంటికి వచ్చేశారు. అప్పటికే తాళం పగులగొట్టి ఉండటంతో ఆత్రుతగా లోనికి వెళ్లారు. బీరువా తెరిచి.. వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉండటం గమనించారు. దాచుకున్న డబ్బు కనపడకపోయే సరికి కన్నీరుమున్నీరయ్యారు. దాదాపు రూ.12వేలు చోరీ అయ్యిందని వాపోయారు. ముసలివయసులో తమ అవసరాలకు ఉపయోగపడుతుందని ఒక పూట తిని.. మరొక పూట పస్తులుండి దాచుకుంటే ఇలా అయ్యిందే అంటూ విలపించారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాయంత్రం పోలీసులు గ్రామానికి వచ్చి వివరాలు సేకరించారు.
Comments
Please login to add a commentAdd a comment