అమడగూరు: ఏ ఆధారం లేని ఒంటరి మహిళలకు ఆసరాగా నిలుస్తామని.. ప్రతి నెల పింఛన్ కింద రూ 1,000 ఇచ్చి ఆదుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది.ఈ ప్రకటనతో చాలా మంది ఒంటరి స్త్రీలంతా ఎంతగానో సంతోషపడ్డారు. టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు అన్నీ మేమే చేసేస్తున్నట్లుగా ఫొటోలకు సైతం ఎగబడి ఫోజులిచ్చారు. అయితే పింఛన్లు మంజూరు చేసిన రెండో నెలకే పరిస్థితి తారుమారైంది. మొదటి నెల మంజూరు చేసిన పింఛన్లలో సుమారు 25 శాతం మందికి పింఛన్లను తొలగించేశారు. వయసు నిబంధనలు మార్చడంతో పింఛన్లు ఆగిపోయాయి. దీంతో ప్రభుత్వంపై ఒంటరి స్త్రీలంతా మండిపడుతున్నారు.
కొత్త నిబంధనతో మెలిక
ఎన్టీఆర్ భరోసా పథకం మొదట్లోనే ఒంటరి మహిళలను దగాకు గురి చేసింది. ఈ పథకం కింద ప్రభుత్వం జూలై నెలలో ఒంటరి స్త్రీలకు పింఛన్లను మంజూరు చేసింది. జీవనం కోసం ఎలాంటి ఆసరా లేని వారిని, పోషించే వారు దగ్గర లేని వారిని, భర్త వదిలేసిన మహిళలను పింఛన్లకు దరఖాస్తు చేసుకోమని ప్రభుత్వం జోరుగా ప్రచారం చేసింది. ఈ విధంగా ఉండి 21 సంవత్సరాలకు పైబడిన మహిళలు దరఖాస్తు చేసుకుంటే ప్రతినెలా పింఛన్ కింద రూ 1,000 ఇచ్చి ఆదుకుంటామని భరోసా కల్పించింది. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న 63 మండలాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల నుండి వేల సంఖ్యలో ఈ పింఛన్లకు దరఖాస్తులు చేసుకున్నారు. అయితే జన్మభూమి కమిటీ సభ్యులు, రాజకీయ నాయకుల సిఫారసులు, తదితర కుంటిసాకులతో అనేక ఒడపోతల తర్వాత పుట్టపర్తి నియోజకవర్గానికి పింఛన్లు మంజూరు చేశారు. ఒంటరి మహిళ పింఛన్‌కు మొదట్లో వయసు 21 అని చెప్పి తర్వాత 35కు సడలింపు చేస్తూ మార్పులు చేసింది. ప్రజాసాధికార సర్వే, ఆధార్ సీడింగ్ ఆధారాలతో ఆన్‌లైన్ విధానంలో వయస్సు తక్కువ ఉన్న వారిని అనర్హులుగా ప్రకటించింది. ఈ విధంగా చేసిన ప్రభుత్వ తీరుతో నియోజకవర్గ వ్యాప్తంగా 67 మంది అనర్హులయ్యారు. ఇకనుండి ప్రతి నెలా రూ 1,000 చేతికందుతుందిలే అనుకుని ఆశపడిన మహిళలకు అది ఎన్నో రోజులు నిలబడలేదు. మొదటి నెల పింఛన్ అందుకుని మళ్లీ సెప్టెంబర్‌లో తీసుకుందామని వెళ్లిన మహిళలకు నిరాశ ఎదురైంది. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలాగా ఒంటరి స్త్రీ పింఛన్లలో కూడా మహిళలకు అన్యాయం చేస్తోందంటూ వారంతా కంటతడి పెడుతున్నారు.
నమ్మించి మోసం చేశారు
పన్నెండేళ్ల క్రితమే నా భర్త నన్ను వదిలేశాడు. నాకు ఇద్దరు చిన్న పిల్లలున్నారు. బడికెళ్లి వారు చదువుకుంటున్నారు. జీవనోపాధి బరువైపోయింది. నెలానెలా రూ 1,000 ఇస్తామంటే ఇంటి అవసరాలకు ఉపయోగపడుతుందనుకున్నాను. ఇచ్చిన నెలకే ఆపేశారు. నాలాంటి ఎంతో మంది మహిళలకు అన్యాయం చేశారు. సరిపడే వయసున్నా ఆధార్‌లో తక్కువగా ఉందని పింఛన్ తొలగించారు. – మణి, ఒంటరి మహిళ, అమడగూరు
Comments
Please login to add a commentAdd a comment