పాడేరు/నాతవరం, న్యూస్‌లైన్: జిల్లాను విషజ్వరాలు వణికిస్తున్నాయి. వందలాది మంది మంచాన పడి అల్లాడుతున్నారు. వాతావరణంలో మార్పులతో ఈ ఏడాది మలేరియా జ్వరాల కన్నా విషజ్వరాల తీవ్రతే అధికంగా ఉంది. రోజుల తరబడి ఇవి అదుపులోకి రావడం లేదు. కొన్ని గ్రామాల్లో ప్రతి ఇంటా మంచానపడి మూలుగుతున్నవారు కనిపిస్తున్నారు. కొరవడిన పారిశుద్ధ్యం, కలుషిత తాగునీటి కారణంగా దయనీయ దుస్థితి నెలకొంటోంది. ఏజెన్సీవాసులు ఇటీవల తడుస్తూనే వ్యవసాయ పనులు చేపట్టారు. వీరు ఉపయోగించే తాగునీటి వనరులు కలుషితమయ్యాయి. గ్రామాల్లో పారిశుధ్య సమస్య కూడా తీవ్రంగా ఉంది. ఇవన్నీ గిరిజనుల ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం చూపాయి. అరకులోయ, పాడేరు ఏరియా ఆస్పత్రుల్లో రోజు వారి ఓపీ కూడా అధికంగా ఉంటోంది. విషజ్వరాల బాధితులే అధికంగా వస్తున్నారు. పాడేరు ప్రాంతీయ ఆస్పత్రికి ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 566 మంది వచ్చి
విషజ్వరాలకు వైద్యం పొందారు. జూలైలో 619 మందికి రక్త పరీక్షలు నిర్వహించగా 89 మందికి,ఆగస్టులో 690 మందికి ర క్తపరీక్షలు చేపట్టగా 86 మందికి టైఫాయిడ్‌గా గుర్తించారు. రెండు రోజుల్లో ఆరుగురు టైఫాయిడ్ బాధితులు పాడేరు ఆస్పత్రిలో చేరారు. చింతపల్లి, ముంచంగిపుట్టు కమ్యూనిటీ ఆస్పత్రుల్లోలకు కూడా మలేరియా కన్నా విషజ్వరాల పీడితులే ఎక్కువగా వస్తున్నారు. పాడేరు మండలం లింగాపుట్టు, ముంచంగిపుట్టు మండలం జబడ ల్లో పలువురు జ్వరాలతో బాధపడుతున్నారు. కొయ్యూరు మండలం డూనూరులో పలువురు మలేరియాతో బాధపడతున్నారు. మారుమూల తండాల్లో జ్వరాల తీవ్రత కారణంగా వైద్య ఆరోగ్యశాఖ ఏజెన్సీ అంతటా ప్రత్యేక వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. నాతవరం మండలం ఊటమళ్ల, మాధవనగరం గ్రామాలను వారం రోజులుగా జ్వరాలు పీడిస్తున్నాయి.
ఏటా సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో ఇక్కడ మలేరియా జ్వరాలు విజృంభించడం పరిపాటి. ఊటమళ్లలో పి.సాయి (13) తీవ్ర జ్వరంతో బాధపడుతూ సోమవారం సాయంత్రం చనిపోయింది. ప్రస్తుతం పల్లా నూకాలమ్మ, వి.వెంకటేశ్వర్లు, జంపా సింహాద్రి, జంపా భీమయ్య, కె.మల్లేశ్వరి, పి.కన్నయ్యమ్మ తీవ్ర జ్వరంతో ఇంటి వద్దే మంచాన పడి ఉన్నారు. మాధవనగరంలో నాలుగు రోజుల క్రింతం కె.లక్ష్మి (26)జ్వరంతో మృతి చెందింది. స్థానిక ఏఎన్‌ఎం, హెల్త్ అసిస్టెంట్‌లు రోగులకు వైద్య సేవలు అందిస్తున్నా తగ్గుముఖం పట్టడం లేదు. నాతవరం పీహెచ్‌సీకి రెండేళ్లుగా వైద్యాధికారి లేరు. ఇన్‌చార్జియే దిక్కు. ఈ గ్రామాల్లో వైద్యులు పర్యటించిన సందర్భం నామమాత్రం. రెండు గ్రామాల్లోని దుస్థితిని తాండవ నిర్వాసిత కమిటీ అధ్యక్షుడు సిద్దాబత్తుల వెంకటరమణ మంగళవారం డీఎంహెచ్‌వో దృష్టికి తెచ్చారు. ప్రత్యేక వైద్యశిబిరం నిర్వహించాలని కోరారు
జ్వరాలతో విలవిల
Published Wed, Sep 4 2013 5:26 AM | Last Updated on Fri, Sep 1 2017 10:26 PM
Advertisement