హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన అంశంపై ప్రస్తుతం సమైక్యవాదాన్ని వల్లిస్తున్న పార్టీలు స్పష్టమైన వైఖరి తెలపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు డిమాండ్ చేశారు. ‘వేగంగా మారుతున్న రాజకీయ పరిస్థితులు- సీపీఎం వైఖరి’ అనే అంశంపై ఆదివారమిక్కడి కూకట్‌పల్లిలో గ్రేటర్ హైదరాబాద్ నార్త్ జోన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అఖిలపక్షంలో విభజనకు అంగీకరించిన పార్టీలు జూలై 31 తరువాత నుంచి సమైక్య ఉద్యమంలో పాల్గొనడం ప్రజలను మోసం చేయడమేనన్నారు.
రాజకీయ అవకాశవాదం కోసమే సీమాంధ్ర ప్రజలను మోసం చేస్తూ సమైక్యవాదం ఎత్తుకున్నారని విమర్శించారు. సీమాంధ్ర ఉద్యమానికి డబ్బులు ఇస్తున్నారని అనడం సబబు కాదన్నారు. తెలంగాణ ప్రాంతంలో కూడా ఉద్యమం జరిగిందని ఇక్కడ డబ్బులు ఇచ్చి ఉంటే అక్కడా ఇస్తున్నట్టేనన్నారు. వెనుకబడిన ప్రాంతాలు తెలంగాణతోపాటు ఉత్తరాంధ్రలోనూ ఉన్నాయన్నారు. నాలుగేళ్లుగా జరుగుతున్న ఉద్యమాలతో పరిపాలన పతనమై పక్షవాతం వచ్చిన రాష్ట్రంలా కనిపిస్తోందని పేర్కొన్నారు.