♦ వరుస వివాదాలు ఎదురవుతున్నా కలెక్టర్ తీరులో కన్పించని మార్పు
♦ అఖిలపక్షం గళమెత్తినా స్పందించని అధికార పక్షం
♦ టీడీపీ నేతలకు శృంగభంగం కావడంతో ఉలిక్కిపడిన వైనం
♦ రేపు కలెక్టరేట్ ముట్టడికి సిద్ధమైన అఖిలపక్షం
సాక్షి ప్రతినిధి, కడప : ప్రజాస్వామ్యంలో నియంతృత్వానికి తావు లేదు. ఎంతటి ఉన్నత స్థాయి అధికారైనా ప్రజాభిప్రాయాన్ని గౌరవించాల్సి ఉంది. కొంతకాలంగా జిల్లాలో యంత్రాంగం చర్యలు తద్భిన్నంగా ఉంటున్నాయి. కలెక్టర్ కెవి రమణ జిల్లా ప్రజల గౌరవానికి భంగం కలిగేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైంది. వైఖరి మార్చుకోవాలని ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నేతలు సూచించినప్పటికీ తరచూ వివాదస్పద ఘటనలు చోటుచేసుకుంటేనే ఉన్నాయి.తాజాగా అధికార తెలుగుదేశం పార్టీ నేతలు సైతం కలెక్టర్ తీరును వ్యతిరేకిస్తూ పత్రికలకెక్కారు. ఈనేపథ్యంలో జిల్లాలోని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కలెక్టరేట్ ముట్టడికి సిద్ధమయ్యాయి.
జిల్లా క లెక్టర్‌గా కెవి రమణ జూలైలో పదవీ బాధ్యతలు చేపట్టారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అనతి కాలంలోనే ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్నారు. రాజంపేట మండలం బోయినపల్లెలో టీచర్ ఆర్థర్ బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని గ్రామస్తులు దాడి చేశారు. ఈఘటనలో గ్రామస్తులు తీవ్ర కోపోద్రిక్తులు కావడంతో స్థానిక పోలీసులు బాధ్యులైన ఉపాధ్యాయులపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. తదనంతరం హైస్కూల్‌ను సందర్శించిన కలెక్టర్ కెవీ రమణ.. ఉపాధ్యాయులు గిచ్చడం, గిల్లడం చదువు చెప్పడంలో భాగమేనని పేర్కొని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఆ వ్యవహారంలో కలెక్టర్ వైఖరిని తప్పుబట్టుతూ.. ఇలాంటి కలెక్టర్‌ను మునుపెన్నడూ చూడలేదని విద్యార్థి సంఘాలు, మానవ హక్కుల వేదిక ఆరోపించింది. తొందరపాటుగా వ్యాఖ్యానించారు కాబోలు అనుకుని, పలువురు తొలి ఘటనగా భావించారు. అంతలోనే స్పోర్ట్స్ స్కూల్ అవకతవకలపై విద్యార్థులు ఆ పాఠశాల నుంచి కలెక్టరేట్ వరకూ రెండు పర్యాయాలు ర్యాలీ నిర్వహించి, ఆందోళనకు దిగారు. ఈ వ్యవహారంలో వాస్తవ పరిస్థితుల కోసం కలెక్టర్ ఇద్దరు అధికారులతో క మిటీని నియమించారు.
ఆ కమీటీ విచారణ చేస్తుండగానే.. కమీటీ సభ్యులతోపాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న స్పెషల్ ఆఫీసర్ పక్కలో కూర్చొని విద్యార్థుల ఆరోపణలల్లో ఆధారాలు లేవని స్వయంగా కలెక్టరే పాత్రికేయుల సమావేశంలో ప్రకటించారు. విద్యార్థుల ఆందోళనకు కారుకులుగా గుర్తించి ఇద్దరు ఉపాధ్యాయులను తప్పించారు. వాస్తవానికి నివేదిక ఇవ్వడంలో మాత్రం స్పెషల్ ఆఫీసర్ రామచంద్రారెడ్డి అవినీతికి పాల్పడ్డట్లు పేర్కొంటూ సిఫార్సులను ప్రభుత్వానికి పంపారు. ఇవన్నీ గ్రహించిన తర్వాత విశ్లేషకులు సైతం వాపోయారు.
రైతుల పట్ల సైతం ఆదే ధోరణి....
మైదుకూరు నియోజకవర్గంలో పలు గ్రామాల పసుపు పంట రైతులకు కొందరు పురుగు మందుల వ్యాపారులు నకిలీ మందులు విక్రయించారు. ఫలితంగా పసుపు పూర్తిగా పాడైంది. వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలు పరిశీలించి, పసుపు పంటకు వాడకూడని మందులు పిచికారి చేయడంతోనే పంట నష్టపోయారని నివేదిక అందించారు. జిల్లా సర్వోన్నతాధికారిగా రైతుల పక్షాన నిలిచి కంపెనీతో చర్చలు నిర్వహించి ఆదుకోవాల్సిన బాధ్యత కలెక్టర్‌పై ఉంది.
రైతులు అనేక పర్యాయాలు కలెక్టర్‌ను కలిస్తే.. తుదకు ఫోరంను ఆశ్రయించండంటూ ఉచిత సలహా ఇచ్చారని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. బద్వేలు ఆస్పత్రిని సీమాంక్ ఆస్పత్రిలోకి తరలించరాదని స్థానిక ప్రజలు ఆందోళన చేపట్టారు. వారి ఆందోళన సమంజసమేనని ఎమ్మెల్యే జయరాములు, మాజీ ఎమ్మెల్యే గోవిందురెడ్డి సైతం నిరహార దీక్షలకు సంఘీభావం ప్రకటించారు. ఇవేవి పట్టించుకోకుండా సీమాంక్ ఆస్పత్రిలోకి మార్పు చేస్తూ స్వయంగా కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు.ప్రజలు, ప్రజాప్రతినిధులు వ్యతిరేకించినా పెడచెవిన పెట్టడాన్ని పలువురు తీవ్రం గా తప్పుబట్టారు. అంతటితో ఆగకుండా సీమాంక్ ఆస్పత్రికి దారి ఉన్నా, వందేళ్ల క్రితం నుంచి ఉన్న చర్చిలో నుంచి 60 అడుగుల దారి ఇవ్వాలని ఆదేశించడం మరో వివాదంగా మారింది.
తనదాకా వచ్చేంత వరకూ....
అధికార తెలుగుదేశం పార్టీ.. తనదాకా వచ్చేంత వరకూ కలెక్టర్ వైఖరిపై స్పందించలేదు. జిల్లాలో ముఖ్యమంత్రి అధికారిక పర్యటనకు ఆహ్వానం పంపి, తీరా ఏడుగురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, జడ్పీ చెర్మైన్‌లను అడ్డుకున్నారు. ప్రజాస్వామ్యం లో నియంతృత్వానికి తావు లేదని, కలెక్టర్ అప్రజాస్వామ్యక చర్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసినా అధికార పక్షం పెడచెవిన పెట్టింది. జిల్లా ప్రజలు ఆవేశపరులు, పరిశ్రమలు స్థాపించేందుకు పారిశ్రామికవేత్తలు బయపడుతున్నారని మరోమారు కలెక్టర్ వివాదానికి ఆస్కారం అయ్యారు.
అప్పట్లో కూడ అధికార పార్టీ నేతలు ఖండించ లేదని పలువురు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఒంటిమిట్ట ఉత్సవాలల్లో యంత్రాంగం ఫ్రోటోకాల్ ఉల్లఘించారని ఏకంగా విప్ పదవికి రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి రాజీనామా చేశారు. దాంతో కలెక్టర్‌పై చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ నేతలు పత్రికలకెక్కారు. తాజాగా ఓ పత్రిక ఏకపక్షంగా వార్తలు రాస్తోందని మీడియా ఆత్మీయ సమావేశంలో మరోమారు కలెక్టర్ వివాదస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
మరోపత్రిక (సాక్షి కాదు) నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్.. మిగతా పత్రికలను కించపరిచేలా వ్యాఖ్యానించడం ఆశ్చర్యపరిచింది. జిల్లా కలెక్టర్ తీరు ఇంత వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్ ముట్టడికి అఖిలపక్షం పిలుపునిచ్చింది. ఒక జిల్లా కలెక్టర్‌ను వెనక్కు పిలిపించుకోండని ఉద్యమించిన చరిత్ర మునుపెన్నడూ లేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ప్రజాస్వామ్యం పరిహాసం!
Published Sun, Apr 5 2015 3:26 AM | Last Updated on Thu, Mar 21 2019 7:27 PM
Advertisement
Advertisement