'సమైక్య ప్రకటన చేయాల్సిందే'
హైదరాబాద్, న్యూస్‌లైన్: ‘‘ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగానే ఉంచాలంటూ రాజకీయ పార్టీలన్నీ తక్షణం స్పష్టమైన ప్రకటన చేయాల్సిందే. ఇరు ప్రాంతాలకూ న్యాయం అనే కపట వైఖరిని విడనాడి, మారువేషాలు తొలగించుకుని.. ఆయా రాజకీయ పార్టీల అధ్యక్షులు సమైక్య రాష్ట్రానికి కట్టుబడి ఉన్నామనే ప్రకటన చేయూలి. శాసనసభలో ఆ పార్టీల సభ్యులు తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలి. ఈ తరహా వైఖరి తీసుకున్న పార్టీలకే తెలుగు ప్రజల మద్దతు ఉంటుంది..’’ అని తెలుగు ప్రజావేదిక స్పష్టం చేసింది.
రాష్ట్ర సమైక్యత, తెలుగుజాతి అభ్యున్నతి కోరుతూ తెలుగు ప్రజావేదిక చైర్మన్ ఆంజనేయరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఇందిరాపార్కు వద్ద సామూహిక దీక్ష చేపట్టారు. వేదిక వైస్ చైర్మన్ డాక్టర్ పుచ్చలపల్లి మిత్రా ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏ ప్రాంతానికి ఆ ప్రాంత వైఖరిని అవలంబిస్తూ అవకాశవాద రాజకీయాలను చేస్తున్న పార్టీలను అంతం చేయాలని, అలాంటి పార్టీల నేతలను శాశ్వతంగా రాజకీయ సమాధి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజనకు సహకరిస్తున్న తెలుగు జాతి ద్రోహుల అవకాశవాద రాజకీయాలను ఓడించాలన్నారు. ఇప్పటివరకు ఒకటిగా ఉన్న తెలుగు వారిని విభజిస్తే ఇరు ప్రాంతాల్లో అభివృద్ధి కుంటుపడుతుందని చెప్పారు. రాష్ట్ర విభజన అనివార్యమన్న లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ విభజన ఎందుకు అవసరమో చెప్పాలన్నారు.
విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మాట్లాడుతూ తమిళనాడు, కర్ణాటక, బెంగాల్ వంటి రాష్ట్రాలను విభజించడానికి సాహసించని నేతలు మన రాష్ట్రాన్నే ఎందుకు విభజించాల్సి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. జీహెచ్‌ఎంసీలోని 150 డివిజన్లలో ఎన్ని డివిజన్లు గెలుచుకుంటారో చెప్పాలని కేసీఆర్‌ను ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేదన్నారు. అసెంబ్లీలో తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చించి ఓడించాలని ఈ సందర్భంగా వేదిక తీర్మానం చేసింది. ఈ దీక్షలో తెలుగు ప్రజా వేదిక కన్వీనర్ డాక్టర్ జి. గంగాధర్, వివిధ జేఏసీల నాయకులు పాల్గొన్నారు.