
నూతన సంవత్సరాదికి టీటీడీ సర్వం సిద్ధం
తిరుమల: నూతన సంవత్సరాదిన శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తుల కోసం టీటీడీ సర్వం సిద్ధం చేసింది. ఇటు సామాన్య భక్తులతోపాటు అటు వీఐపీలకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వైకుంఠ ఏకాదశి పర్వదినం తరహాలోనే కొత్త సంవత్సరం తొలిరోజున భక్తులు అధిక సంఖ్యలో వస్తారని భావించిన టీటీడీ అందుకు తగ్గట్టుగా భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసింది. మొదటి, రెండో ైవైకుంఠం క్యూకాంప్లెక్స్‌లతోపాటు నారాయణగిరి ఉద్యానవనంలోనూ అదనంగా క్యూలు ఏర్పాటు చేశారు. భద్రతలో భాగంగా తాత్కాలికంగా సీసీ కెమెరా వ్యవస్థ ఏర్పాటు చేశారు.
ఉదయం 6 గంటలకే సర్వదర్శనం ప్రారంభం
తిరుమలలో శుక్రవారం ఉదయం 6 గంటలకే సర్వదర్శనం ప్రారంభించనున్నారు. వేకువజాము 3 గంటలకు గర్భాలయమూలమూర్తికి అభిషేకం, విశేష అలంకరణ తర్వాత ఉదయం 5 గంటలకు వీఐపీ దర్శనం ప్రార ంభించనున్నారు. అందరికీ లఘుదర్శనం అమలు చేయాలని నిర్ణయించారు. గంటలోపే వీఐపీలకు దర్శనం పూర్తిచేసి ,తర్వాత సర్వదర్శనం, కాలిబాట భక్తులను దర్శనం కల్పించనున్నారు. రూ.300 టికెట్లు పొందిన భక్తులకు మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 7గంటల వరకు 10వేల మంది భక్తులను దర్శనానికి అనుమతించేలా ఏర్పాట్లు చేశారు. ఆంగ్ల నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని తిరుమల ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయ ప్రాకారాలు, గోపురాలకు రంగురంగుల విద్యుద్దీపాలతో చేసిన అలంకరణలు భక్తులను ఆకట్టుకున్నాయి. సువాసనలు వెదజల్లే పుష్పాలతో ధ్వజస్తంభం, బలిపీఠం, సన్నిధి వరకు అలంకరించారు. మహద్వార గోపురానికి శ్రీవారు, అమ్మవార్ల ఫ్లెక్సీ చిత్రాలు, పుష్పాలు, చెరకు గడలు, కొబ్బరికాయలు, కొబ్బరిపూతతో అలంకరించారు.