కర్నూలు, న్యూస్‌లైన్: ఎన్నికల వేడి ముగిసింది. విజేతలు సంబరాల్లో మునిగితేలుతుండగా.. పరాజితుల్లో నైరాశ్యం అలుముకుంది. ఇక వీరినే నమ్ముకున్న పందెంరాయుళ్లు మాత్రం చేతులు కాల్చుకుని రోడ్డునపడ్డారు. పంతానికి పోయిన ఇలాంటి వారెందరికో బూడిదే మిగిలింది. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల తరఫున వారి అనుచరులు, ద్వితీయ శ్రేణి నాయకులు భారీ మొత్తంలో పందెం కాసి నిండా మునిగారు. పురపాలక ఓట్ల లెక్కింపులో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి అనుకూల ఫలితాలు రావడంతో ఆ పార్టీ అభ్యర్థులపై పందెంరాయుళ్లు స్థోమతకు మించి పందెం పెట్టారు. ఇతర పార్టీల వర్గీయులను రెచ్చగొట్టి మరీ పందేలకు ఊసిగొలిపారు. జిల్లాలోని కర్నూలు, నంద్యాల, ఆలూరు, శ్రీశైలం, డోన్, నందికొట్కూరు, బనగానపల్లె నియోజకవర్గాల్లో టీడీపీ, వైఎస్సార్సీపీ అభ్యర్థులే లక్ష్యంగా బెట్టింగ్ సాగింది. టీడీపీ అధినేత చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించడంతో బెట్టింగ్ ‘కట్ట’లు తెంచుకుంది.
ముఖ్యంగా భీమవరం, ప్రొద్దుటూరు, హైదరాబాద్ ప్రాంతాలకు చెందిన టీడీపీ ప్రముఖులు జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో చెలరేగిపోయారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో టీజీ వెంకటేష్ గెలుస్తాడని ఆయన అనుచరులు భారీగా పందేలు కాశారు. పంతానికి పోయి గుడ్డిగా పందేలు కాసి భారీగా నష్టపోయి బావురుమంటున్నారు. ఓటర్లకు పంపిణీ చేసేందుకు అప్పగించిన డబ్బును బెట్టింగ్‌లో పోగొట్టుకున్నట్లు ఆ పార్టీ నాయకులే బహిరంగంగా చర్చించుకుంటున్నారు. గతంలో మెజార్టీపై పందేలు కాసిన నాయకులు ఈసారి గెలుపుపై బెట్టింగ్ పెట్టడం గమనార్హం.
వైఎస్సార్సీపీ నుంచి ఎస్వీ మోహన్‌రెడ్డి విజయఢంకా మోగించడంతో పందెం డబ్బు పోగొట్టుకున్న వ్యక్తులు తేలుకుట్టిన దొంగల్లా తిరుగుతున్నారు. టీజీకి ముఖ్య అనుచరుడైన సీతారామనగర్ వాసి ఒకరు రూ.15 లక్షలు, పాతబస్తీకి చెందిన మాజీ కార్పొరేటర్ల బృందం రూ.5 లక్షలు, ఎన్‌ఆర్.పేటలో నివాసముంటున్న కేబుల్ నిర్వాహకుడు రూ.5 లక్షలు, అమృత అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న ఓ వ్యక్తి రూ.2 లక్షలు, ఆర్‌ఆర్ హాస్టల్ ప్రాంతానికి చెందిన మరో వ్యక్తి రూ.12 లక్షలు, ఉస్మానియా కళాశాల సమీపంలోని మాజీ కార్పొరేటర్ ఒకరు రూ.5 లక్షలు బెట్టింగ్‌లో కోల్పోయినట్లు నగరంలో చర్చ జరుగుతోంది.
కర్నూలు కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బంగారు వ్యాపారస్తులతో సిండికేట్‌గా ఏర్పడి రూ.6 లక్షలు, వక్ఫ్‌బోర్డు నాయకుడు ఒకరు రూ.7 లక్షలు, వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో నివాసముంటున్న మాజీ కార్పొరేటర్లు రూ.15 లక్షలు పోగొట్టుకుని ముఖం బయటకు చూపలేకపోతున్నారు. హైదరాబాద్ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న ఓ వ్యక్తి రూ.2 లక్షలు టీజీ తరఫున పందెం పెట్టి నష్టపోయాడు. అయితే కోడుమూరు నియోజకవర్గం నుంచి మణిగాంధీ, కర్నూలు పార్లమెంట్ నుంచి బుట్టా రేణుక గెలుపొందుతారని రూ.3 లక్షలు పందెం కాసి పోగొట్టుకున్న డబ్బును తిరిగి రాబట్టుకున్నట్లు సమాచారం.
అలాగే బళ్లారి చౌరస్తాలోని నిర్మల్ నగర్‌లో నివాసముంటున్న ప్లాట్ల వ్యాపారి కొత్త బస్టాండ్ సమీపంలోని ఓ బార్‌లో పని చేసేవాడు. ఈయన కూడా టీజీ తరఫున రూ.3 లక్షలు కోల్పోయాడు. డోన్ నుంచి కేఈ ప్రతాప్ గెలుపొందుతాడని ఆ పార్టీ శ్రేణులు దాదాపు రూ.కోటి దాకా బెట్టింగ్‌లో పోగొట్టుకున్నారు. కొండపేట నివాసి ఒకరు రూ.25 లక్షలు, 40 సెంట్ల స్థలం బెట్టింగ్‌లో కోల్పోయినట్లు సమాచారం. గోసానిపల్లె గ్రామానికి చెందిన టీడీపీ అభిమాని రూ.20 లక్షలు పందెం కాసి ఇప్పుడు లబోదిబోమంటున్నాడు.
ప్యాపిలి జెడ్పీటీసీ మాజీ సభ్యునితో పాటు ఆ పార్టీ శ్రేణులంతా సిండికేట్‌గా ఏర్పడి దాదాపు రూ.50 లక్షల దాకా బెట్టింగ్ కాసి చేతులు కాల్చుకున్నారు. నంద్యాలలో శిల్పా మోహన్‌రెడ్డి గెలుపొందుతాడని ఆయన సమీప బంధువులతో పాటు టీడీపీ శ్రేణులు 50 మంది దాకా సిండికేట్‌గా ఏర్పడ్డారు. ఇందులో మాజీ కౌన్సిలర్లు, వ్యాపారులు, న్యాయవాదులు కూడా ఉన్నారు. వీరంతా దాదాపు రూ.5 కోట్ల దాకా బెట్టింగ్‌లో కోల్పోయినట్లు చర్చ జరుగుతోంది.
నిండా మునిగారు!
Published Wed, May 21 2014 2:13 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM
Advertisement
Advertisement