సమావేశంలో మాట్లాడుతున్న ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని.. చిత్రంలో జేసీ రమణారెడ్డి తదితరులు
సాక్షి, ఏలూరు : కరోనా ప్రభావిత రెడ్‌జోన్‌లుగా ప్రకటించిన ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి.. ఆ ప్రాంతాలకు వైద్య అధికారులను నియమించాలని ఉపముఖ్యమంత్రి, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని ఆదేశించారు. కరోనా కట్టడి చర్యలపై శనివారం ఏలూరు నగరపాలకసంస్థ కార్యాలయం కౌన్సిల్ హాలులో సమీక్షించారు. నగరంలోని వాస్తవ పరిస్థితులు చెప్పాలని, తర్వాత తాను తనిఖీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు. విదేశాల నుంచి వచ్చిన వారు, ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, పాజిటివ్ వచ్చిన వ్యక్తులు నివసించే ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు శానిటేషన్ పనులు చేపట్టాలన్నారు.
రెడ్‌జోన్ ప్రాంతాల్లో ప్రతి రోజు సర్వే చేయాలని, ఏవరికైనా ఆరోగ్యం సరిగా లేకపోతే వెంటనే వైద్య సేవలందించేలా చర్యలు తీసుకోవాలని నాని ఆదేశించారు. ఏలూరు మొత్తం మరోసారి సర్వే చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని.. దానిపై అధికారులు దృష్టి పెట్టాలన్నారు. ర్యాపిడ్ యాక్షన్ టీం సభ్యులకు కలి్పంచాల్సిన సదుపాయాలపై మంత్రి ఆరా తీశారు.
త్వరలోనే ఆస్పత్రులకు కోవిడ్ కిట్‌లు
కోవిడ్ ఆసుపత్రుల్లో వెంటిలేటర్లు, అవసరమైన మందులు సిద్ధం చేసుకోవాలని సూచించారు. కోవిడ్ చికిత్స పరికరాలు, ఇతర కిట్‌లు త్వరలోనే అన్నీ ఆసుపత్రులకు వస్తాయని చెప్పారు. పోణంగి ప్రాంతంలోని రెడ్‌జోన్‌లో చేపడుతున్న శానిటేషన్ పనులపై ఆరా తీశారు. క్వారంటైన్‌కు అందరూ సహకరించాలని, లేదంటే చట్టపరమైన చర్యలకు సిద్ధం కావాలని పోలీసు అధికారులకు సూచించారు. ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిన రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని స్పష్టం చేశారు.
నగరంలోని నిత్యావసరాలు విక్రయించే షాపుల వద్ద ధరల పట్టికలు చిన్నవిగా ఉన్నాయనే ఫిర్యాదులు వస్తున్నాయని, ఇలాంటి సమయంలో బ్లాక్ మార్కెట్‌ను అరికట్టాలని జాయింట్ కలెక్టర్ కె.వెంకటరమణరెడ్డిని ఆదేశించారు. చేపల మార్కెట్‌లో విక్రయాల తీరు దారుణంగా ఉందని, మార్కెట్లలో అమ్మకాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. సమావేశంలో అదనపు జాయింట్ కలెక్టర్ తేజ్‌భరత్, డీఎంఅండ్ హెచ్‌వో సుబ్రమ్మణేశ్వరి, డీపీవో శ్రీనివాస్ విశ్వనాథ్, ఆర్డీవో రచన, డీఎస్పీ దిలీప్‌కిరణ్, కమిషనర్ డి.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
క్వారంటైన్ కేంద్రాలుగా కాలేజీలు
భీమవరం: భీమవరం పట్టణంలోని శ్రీ విష్ణు ఇంజినీరింగ్ కళాశాలలో క్వారంటైన్ కేంద్రం ఏర్పాటును నర్సాపురం సబ్‌కలెక్టర్ కేఎస్ విశ్వనాథన్ శనివారం పరిశీలించారు. కళాశాలలోని క్లాస్ రూమ్స్, హాస్టల్స్ భవనాన్ని తనిఖీచేశారు.
నల్లజర్ల ఏకేఆర్జీలో
నల్లజర్ల: నల్లజర్లలో క్వారంటైన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్టు తహసీల్దారు పి.ప్రతాపరెడ్డి తెలిపారు. ఏకేఆర్జీ కళాశాల హస్టల్ భవనాన్ని ఎంపిక చేశారని చెప్పారు. భవనంలోని 39 గదుల్ని శుభ్రంచేసి 39 బెడ్స్ ఏర్పాటు చేస్తున్నారు. 24 గంటలు పనిచేసేలా నల్లజర్ల మెడికల్ ఆఫీసర్‌తో పాటు పిప్పర, ముదురునూరుపాడు పీహెచ్‌సీ డాక్టర్లను నియమించారు.
గూడెం క్వారంటైన్‌లో 135 మంది
తాడేపల్లిగూడెం: గూడెంలోని ఎల్.అగ్రహారంలో ఉన్న కరోనా క్వారంటైన్ కేంద్రంలో ఉంటున్న వారి సంఖ్య 135కి చేరింది. ఏలూరు ఐసొలేషన్ సెంటర్‌లో జరిపిన పరీక్షలలో నెగెటివ్ రిపోర్టు వచ్చిన వారిని శుక్రవారం రాత్రి, శనివారం ఈ కేంద్రానికి పంపారు.
కొవ్వూరులో 39 మంది
కొవ్వూరు: టిట్కో కాలనీలోని క్వారంటైన్ కేంద్రంలో 39 మందిని ఉంచినట్లు మున్సిపల్ కమిషనర్ కేటీ సు«ధాకర్ తెలిపారు. కొవ్వూరుతో పాటు దేవరపల్లి, తాళ్లపూడి, పెనుమంట్ర, పోలవరం తదితర మండలాల వారు ఉన్నారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment