సాక్షి, పశ్చిమ గోదావరి: జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతంలో అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్స్ అందుబాటులో ఉండాలని అధికారులను ఆదేశించారు. హాస్పిటల్స్‌లో ఖాళీగా ఉన్న మెడికల్ సిబ్బంది పోస్టులు వెంటనే భర్తీ చేయాలని జిల్లా కలెక్టర్ ముత్యాలు రాజుకు ఆదేశాలు జారీ చేశారు. ఏజెన్సీలో వెంటనే మొబైల్ ఎక్సరే యూనిట్ ఏర్పాటు చేయాలన్నారు. బుట్టాయిగూడంలో 10 ఎకరాలు స్థలంలో రూ. 75 కోట్లతో మల్టీ స్పెషలిటీ హాస్పిటల్ నిర్మాణం చేపట్టనున్నామని తెలిపారు. (ఏపీలో కోలుకున్నవారు 15 వేలు పైనే..)
రాష్ట్రంలో 7 ఐటీడీఏ పరిధిలో మల్లీ స్పెషలిటీ హాస్పిటల్స్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకురావడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు రూ.11,400 కోట్లు కేటాయించారని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడమే లక్ష్యం అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండగా అదనoగా మరో 16 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. (కరోనా పేషెంట్లకు అండగా ఉంటాం)
కరోనా నియంత్రణకు ప్రజలు సహకరించాలి:
పర్యటనలో భాగంగా పోలవరం నియోజకవర్గంలోని బుట్టాయిగూడేo కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్య సేవలపై మంత్రి ఆరా తీశారు. అనంతరం బుట్టాయిగూడం కమ్యూనిటీ హాస్పిటల్‌లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వారం రోజుల్లో మళ్లీ ఏజెన్సీకి వస్తానని మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. గర్భిణీ స్త్రీలకు వైద్యం అందించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఏజెన్సీలో అంటు వ్యాధులు ప్రబలకుండా చూడాలన్నారు. వైద్యం అందించడంలో ఆలస్యం వహిస్తే అధికారులే బాధ్యత వహించాలని తెలిపారు. వర్ష కాలంలో అంటు వ్యాధులు ప్రభలకుండా ముందస్తూ జాగ్రత్త లు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు మంత్రి ఆదేశించారు. కరోనా నియంత్రణకు ప్రజలు సహకరించాలని మాస్క్‌లు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ ముత్యాలరావు, ఐటీడీఏ, పీఓ సూర్యనారాయణ, వైద్య అధికారులు పాల్గొన్నారు.
ఐదు గిరిజన గ్రామాలకు వరం:
నూతనంగా మంజూరైన మల్టీ స్పెషలిటీ హాస్పిటల్ నిర్మాణానికి మంత్రి ఆళ్ల నాని స్థలం పరిశీలిచారు. మల్టీ సూపర్ స్పెషలిటీ హాస్పిటల్ నిర్మాణం ఈ ప్రాంతంలో 5 గిరిజన గ్రామాలకు ఒక వరం అన్నారు. పోలవరం, బుట్టాయిగూడం, జీలుగుమిల్లి, విలీన మండలాల ప్రజలకు వైద్యం అందుబాటులోకి రావడానికి మరింత తోడ్పాటు అందిస్తామని తెలిపారు.ఈ ప్రాంతంలో గిరిజనులు ఎక్కువగా రక్తహీనత మహమ్మారికి లోనవుతారని చెప్పారు. దశాబ్దాల తరబడి ఏజెన్సీలో గిరిజనులకు సరైన వైద్యం లేక అవస్థలుపడుతున్నారని గుర్తు చేశారు. సీఎం వైఎస్ జగన్ ఏజెన్సీ ప్రాంతంలో నివాసం ఉంటున్న గిరిజనులకు మెరుగైన వైద్య సదుపాయం కల్పించాలని లక్ష్యంతో ముందడుగు వేస్తున్నారని చెప్పారు. స్త్రీల అనారోగ్యం సమస్య లు పరిస్కారానికి కొత్తగా నిర్మించనున్న మల్టీ సూపర్ స్పెషలిటీ హాస్పిటల్ ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. బుట్టాయిగూడంలో మల్టీ స్పెషలిటీ హాస్పిటల్ రావడం వల్ల ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలకు ఎంతో ప్రయోజనం అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment