ఛీ..అనిపించుకున్నాడు
విజయనగరం క్రైం: బొండపల్లి మండలం జి.ఎన్.వలస గ్రామంలో చుక్క పోతయ్య, పాపమ్మ కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు. వీరికి పెంటయ్య, గురువులు, ఆదినారాయణ, ముత్యాలు అనే కుమారులు ఉన్నారు. వీరిలో రెండవ వా డు చుక్క గురువులు. గురువులు పద్మనాభం మండలం నరసాపు రం గ్రామానికి చెందిన పైడిరాజును వివాహం చేసుకున్నాడు. వీరికి భవాని, రామలక్ష్మి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గురువులు దొంగతనాలకు అలవాటు పడ్డాడు. ఇళ్లలో దొంగతనాలు, ఒంటరిగా నడిచి వెళ్తున్న మహిళల మెడలో గొలుసుల అపహరణలతో పాటు ఆరు బయట, ఇంట్లో ఒంటరిగా పడుకున్న మహిళలపై లైంగికదాడులకు పాల్పడేవాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు అతనిపై పలు పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నాయి. అయితే భార్య పైడిరాజుకు తన సోదరుడు పెంటయ్యతో వివాహేతర సంబంధం ఉందని గురువులు అనుమానించేవాడు.
ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. భార్య పైడిరాజును నిత్యం కొట్టి వేధించేవాడు. పదిరోజుల కిందట గురువులు భార్యను తీవ్రంగా కొట్టడంతో ఆమె జిల్లా కేంద్రాస్పత్రిలో చేరింది. ఆస్పత్రికి వచ్చిన గురువులు అక్కడ కూడా ఆమెను వేధింపసాగేవాడు. దీంతో ఆస్పత్రిలో ఉన్న తోటి రోగుల బంధువులు మందలించారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక పైడిరాజు అత్తవారింటికి కాకుండా కన్నవారింటికి వెళ్లిపోయింది. శనివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో తల్లిదండ్రులతో గురువులు గొడవపడి వారిని తీవ్రంగా కొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడిన తల్లి పాపమ్మ జిల్లా కేంద్రాస్పత్రిలో చికిత్స పొందుతోంది. తల్లిదండ్రులను కొట్టిన విషయమై గురువులు సోదరులు ప్రశ్నించడంతో వారితో గొడవ పడ్డాడు. అదే సమయంలో అక్కను కొట్టాడన్న విషయాన్ని అడగడానికి పైడిరాజు తమ్ముడు పెంటయ్య జీఎన్‌వలస గ్రామానికి చేరుకున్నాడు.
బావమరిదితో కూడా గురువులు గొడవ పడ్డాడు. దీంతో సహనం నశించిన సోదరులు బావమరిది గురువులును కత్తితో మెడపై నరికి హత్య చేసినట్లు సమాచారం. జేఎన్‌టీయూ కళాశాల వైపు వెళ్లే దారిలో మృతదేహాన్ని పాతేద్దామని భావించిన గురువులు సోదరులు, బావమరిది శనివారం అర్ధరాత్రి సమయంలో మృతదేహాన్ని గోనె సంచిలో కట్టి సైకిల్‌పై తీసుకువచ్చారు. ఆ సమయంలో జేఎన్‌టీయూ సెక్యురిటీ సిబ్బంది చూడడం, అటుగా వస్తున్న కొంతమంది గుర్తించి వారిని పట్టుకుని, 100కు సమాచారం అందించడంతో రూరల్ ఎస్‌ఐ ఐ.దుర్గాప్రసాద్ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని చూసి..నిందితుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు పరారయ్యాడు. మృతదేహానికి పోస్ట్‌మార్టం నిమిత్తం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. టూటౌన్ సీఐ సీహెచ్.అంబేడ్కర్ కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.