కృష్ణా యూనివర్శిటీ స్నాతకోత్సవ సభ | Amalutone empowerment laws | Sakshi
Sakshi News home page

కృష్ణా యూనివర్శిటీ స్నాతకోత్సవ సభ

Published Sat, Aug 2 2014 2:08 AM | Last Updated on Sat, Sep 2 2017 11:14 AM

కృష్ణా యూనివర్శిటీ స్నాతకోత్సవ సభ

కృష్ణా యూనివర్శిటీ స్నాతకోత్సవ సభ

  •  రాజకీయ నేతల భాషాజాలంలో మార్పు రావాలి   
  •  నిత్య విద్యార్థిగా ఉంటేనే బంగారు భవిత  
  •   కృష్ణా యూనివర్శిటీ స్నాతకోత్సవ సభలో జస్టిస్ పీసీ రావు
  •   ఘనంగా వర్శిటీ రెండో స్నాతకోత్సవం
  • సాక్షి, విజయవాడ : సమాజంలోని వాస్తవికతను గుర్తించి దానికి అనుగణంగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అంతర్జాతీయ సముద్ర జల ట్రిబ్యునల్ న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ పత్తిబండ్ల చంద్రశేఖర్‌రావు (జర్మనీ) సూచించారు. నిరంతర అధ్యయనం, సునిశిత పరిశీలన, నిత్య విద్యార్థిగా ఉండటం ద్వారానే సమాజంలో విద్యార్థులు రాణించగలుగుతారన్నారు. శుక్రవారం నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కృష్ణా యూనివర్శిటీ రెండో స్నాతకోత్సవ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తొలుత విద్యార్థుల గౌరవ వందనం స్వీకరించి సభలో పాల్గొన్నారు.

    ఈ సందర్భంగా మాట్లాడుతూ కృష్ణాజిల్లాలో జన్మించిన తాను కృష్ణా యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ అందుకోవటం ఆనందంగా ఉందన్నారు. డిగ్రీలు అందుకుని నూతన జీవితంలోకి ప్రవేశిస్తున్న విద్యార్థులు తమ సామాజిక బాధ్యతను విస్మరించకుండా ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా అనేక చట్టాలు చేస్తున్నాయని, దీని ఆధారంగానే సామాజిక మార్పు వస్తుందని అందరు భావిస్తున్నారని చెప్పారు. కానీ, చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించటంతోపాటు వాటిని అమలు చేస్తేనే కొంతైనా మార్పు వస్తుందన్నారు.

    అమలులో ఉన్న చట్టాల ప్రకారం ఎవరు పనిచేయట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మోటారు వాహనాల చట్టాన్ని పాటిస్తే ట్రాఫిక్ జామ్‌తో పాటు ప్రమాదాలు తగ్గుతాయని హితవు పలికారు. తాను 1988 నుంచి 1996 వరకు ఆరుగురు ప్రధానమంత్రుల వద్ద పనిచేశానని, ఆ సమయంలో న్యాయశాస్త్ర అభ్యున్నతి కోసం ఎంతగానో శ్రమించానని చంద్రశేఖర్‌రావు చెప్పారు.

    రాజకీయ నేతల భాషాజాలం సక్రమంగా లేదని, విమర్శలు చేసేందుకు ఉపయోగించే భాష అభ్యంతరకరంగా ఉందని, ఇది సమాజంపై చెడు ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరించారు. న్యాయమూర్తుల నియామకాలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో ఐదుగురు కొలిజియం జడ్జీలతో కమిటీ ఉందని, దీని స్థానంలో నేషనల్ జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటుచేయాలన్న ప్రతిపాదనలు చట్టసభల ద్వారా వస్తున్నాయని చెప్పారు.

    వర్శిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ పి.వెంకయ్య మాట్లాడుతూ ఆరేళ్ల కిందట ఆవిర్భవించిన కృష్ణా వర్శిటీ అంచెలంచెలుగా ముందుకు సాగుతోందని, రెండో స్నాతకోత్సవంలో 16వేల మంది విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేస్తున్నామని చెప్పారు. పీజీ, డిగ్రీ కోర్సులతోపాటు క్రీడలు, ఎన్‌ఎస్‌ఎస్, సాంస్కృతిక కార్యక్రమాల్లో ముందంజలో ఉన్నామని వర్శిటీ ప్రగతి నివేదిక వివరించారు. రుద్రవరంలో 71.75 కోట్లతో భవనాలు నిర్మించనున్నామని చెప్పారు.

    అనంతరం జస్టిస్ పీసీ రావును యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్‌తో సత్కరించారు. స్నాతకోత్సవంలో కళాశాల విద్య రాష్ట్ర కమిషనర్ కె.సునీత, వర్శిటీ డీన్లు ప్రొఫెసర్ డి.సూర్యచంద్రరావు, ఎంవీ బసవేశ్వరరావు, వైకే సుందరకృష్ణ తదితరులు పాల్గొన్నారు.  అనంతరం ఎంఏ తెలుగు విభాగంలో కొల్లూరి కల్పన, ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీలో మల్లాది దీప్తిలకు బంగారు పతకాలు బహూకరించారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement