కార్పొరేట్ల చేతుల్లోకి ఉన్నత విద్య!
విజయవాడ: రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీలు ఏర్పాటు చేయాలనే రాష్ట్రప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఒకవైపు ప్రైవేటు వర్సిటీల బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుండగా మరోవైపు దానిని విరమించుకోవాలంటూ విద్యార్థి సంఘాలు, విద్యావేత్తలు పెద్దఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ప్రైవేటు వర్సిటీలవల్ల రాష్ట్రంలో ఉన్నత విద్య కూడా కార్పొరేట్ విద్యాసంస్థల చేతుల్లోకి వెళ్లిపోతుందనే ఆందోళన క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే ఇంటర్మీడియట్ విద్య కార్పొరేట్ విద్యాసంస్థల అధీనంలో కి పూర్తిగా వెళ్లిపోయింది. ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఇంటర్ విద్యను శాసిస్తుండడంతో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు క్రమంగా కనుమరుగయ్యే దుస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ప్రైవేటు వర్సిటీలు ఏర్పాటైతే ఉన్నత విద్య కూడా కార్పొరేట్‌పరమయ్యే పరిస్థితి నెలకొంటుందని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు.
కార్పొరేట్ విద్యాసంస్థల కోసమేనా...
అసలు ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటే కార్పొరేట్ విద్యా సంస్థల కోసమన్న వాదన బలంగా వినిపిస్తోంది. కొందరు కార్పొరేట్ విద్యాసంస్థల అధిపతులు ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నారు. పలు విద్యా సంస్థలకు చెందిన వ్యక్తులు ప్రభుత్వానికి బాగా దగ్గరగా ఉన్నారు. ఎన్నికల్లో వీరంతా టీడీపీకి అన్ని విధాలుగా సహకరించారనే విమర్శలున్నాయి. వీరి ఒత్తిడి వల్లే ప్రభుత్వం ప్రైవేటు వర్సిటీల ఏర్పాటు దిశగా చకచకా అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబుతోపాటు మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ యూనివర్సిటీల ఏర్పాటుతో ఉన్నత విద్య పురోగమిస్తుందని పదేపదే చెబుతుండడం గమనార్హం.
ఈ యూనివర్సిటీలింతేనా..
రాష్ట్రంలో ఇప్పటికే 20 ప్రభుత్వ యూనివర్సిటీలున్నాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఉన్నత విద్యను పేదలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో జిల్లాకో యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. ఆ క్రమంలోనే కృష్ణా, నన్నయ, వేమన తదితర వర్సిటీలు ఏర్పడ్డాయి. అయితే వాటిల్లో చాలావరకూ ఇంకా బాలారిష్టాలతో సతమతమవుతున్నాయి. మౌలిక సదుపాయాలు లేకపోవడం, బోధన సిబ్బంది కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కొన్ని వర్సిటీలకైతే ఇంతవరకూ పూర్తిస్థాయి క్యాంపస్‌లు కూడా సమకూరలేదు.
భూములు లేనందున మచిలీపట్నంలోని కృష్ణా వర్సిటీ ఇంకా ఆంధ్ర జాతీయ కళాశాలలోనే కొనసాగుతోంది. ఈ వర్సిటీలను పట్టించుకోని ప్రభుత్వం ప్రైవేటు వర్సిటీలకోసం తపిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు కొత్తగా 11 కేంద్ర విద్యా సంస్థలు రాష్ట్రంలో ఏర్పా టు కానున్నాయి. ఉన్న వర్సిటీల్లో సమస్యలను పరిష్కరించి గాడిలో పెట్టడానికి చర్యలు తీసుకుంటే.. వాటితోపాటు కొత్తగా వచ్చే విద్యా సంస్థలతో రాష్ట్రంలో ఉన్నత విద్యను పటిష్టంగా మలి చే వీలుంది. కానీ ప్రభుత్వం ఇందుకు విరుద్ధంగా ప్రైవేటు వైపు అడుగులేస్తుండడంతో విద్యార్థి సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి.