
'విలువలేని వార్తలు రాసి అభాసుపాలు కావొద్దు'
హైదరాబాద్: తమ పార్టీపై ఓ రెండు పత్రికలు అసత్య కథనాలు ప్రచురిస్తున్నాయని, ఇది మంచి పద్ధతి కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. విలువలేని వార్తలు రాసి అభాసుపాలు కావొద్దని హితవు పలికారు. వాస్తవాలు రాయలేకపోయినా కనీసం వాస్తవానికి దగ్గరవుండే వార్తలు రాయాలన్నారు. విషప్రచారం ద్వారా తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై బురద చల్లడం మానుకోవాలని సూచించారు. వైఎస్సార్ సీపీ బలోపేతంగా ఉందని, ఎవరూ పార్టీ వదిలి వెళ్లడం లేదని స్పష్టం చేశారు. ఎల్లో మీడియా ప్రచారాన్ని నమ్మొద్దని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు.
చంద్రబాబులా అద్భుతమైన అబద్దాలు ఆడిన నేత ప్రపంచంలో ఎక్కడా ఉండరని అంబటి రాంబాబు అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన ఐదు సంతకాలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు అబద్దపు వాగ్దానాలు నమ్మి జనం ఓట్లు వేశారని చెప్పారు. టీడీపీకి ఓటు వేసి పొరపాటు చేశామని ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నారని అన్నారు. ఏ రాజకీయ పార్టీకి అధికారం శాశ్వతం కాదన్నారు.