నోటీసుల నుంచి తప్పించుకునేందుకే ఏపీ టూర్లు | Ambati Rambabu fires on Pawan Kalyan, chandrababu | Sakshi
Sakshi News home page

నోటీసుల నుంచి తప్పించుకునేందుకే ఏపీ టూర్లు

Published Mon, Jun 29 2015 4:06 AM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM

నోటీసుల నుంచి తప్పించుకునేందుకే ఏపీ టూర్లు - Sakshi

నోటీసుల నుంచి తప్పించుకునేందుకే ఏపీ టూర్లు

చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ నేత అంబటి ధ్వజం
♦ హైదరాబాద్‌లోనే తిష్ట వేస్తానన్న వ్యక్తిలో ఈ మార్పు ఎందుకొచ్చింది?
♦ ఆ స్వరం మీదో కాదో చెప్పకుండా సెక్షన్-8 అంటారా!
♦ టీఆర్‌ఎస్ చేతిలో కీలుబొమ్మగా అభివర్ణించిన గవర్నర్‌కు అధికారాలన్నీ దత్తం చేయాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు?

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏసీబీ నోటీసులను తప్పించుకునేందుకే సీఎం చంద్రబాబునాయుడు హైదరాబాద్‌లో ఒక్క నిమిషమైనా ఉండకుండా ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో తెగ తిరిగేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ విమర్శించింది. పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణలో టీడీపీ అధికారంలోకి వచ్చేవరకూ హైదరాబాద్‌లోనే ఉంటానన్న చంద్రబాబు వైఖరిలో తెలంగాణ ఏసీబీ కేసుల వల్ల తనకు సమస్యలొస్తాయని తెలిశాక మార్పెందుకు వచ్చిందని దుయ్యబట్టారు.

ఏసీబీనుంచి నోటీసులొస్తాయని అనుమానం వచ్చినపుడల్లా కార్యక్రమాలేవీ లేకపోయినా రాజమండ్రి, విజయవాడ అంటూ పర్యటించేస్తున్నారని ఎద్దేవాచేశారు. అభివృద్ధిని ఆశించి ఈ పర్యటనలు చేయట్లేదని, నోటీసులొస్తాయనే భయంతోనే తప్పించుకోవడానికి వెళుతున్నారన్నారు. సీఎం ప్రజలమధ్య ఉండటం సంతోషమేఅయినా చంద్రబాబు ముందుగా 3 ప్రశ్నలకు సమాధానం చెప్పితీరాలన్నారు. ‘‘ఆడియో టేపుల్లోని గొంతు మీదా(చంద్రబాబుదా), కాదా? టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి ఇచ్చి పంపిన రూ.50 లక్షలకు, మీకు సంబంధముందా, లేదా? రేవంత్‌రెడ్డి ‘బాస్’ అని ఉచ్ఛరించింది మిమ్మల్నా, కాదా?’’ అని ప్రశ్నించారు.

టేపుల్లోని స్వరం చంద్రబాబుదేనని ప్రయోగశాలలో నిర్ధారణ అయ్యాక తన కేసుల్ని కప్పిపుచ్చుకునేందుకు సెక్షన్-8, టెలిఫోన్ ట్యాపింగ్ వంటి మాటలతోపాటుగా హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలనే డిమాండ్‌ను తెరమీదకు తెచ్చారని ఆయన విమర్శించారు. గంగిరెద్దు, టీఆర్‌ఎస్ చేతిలో కీలుబొమ్మ అంటూ అభివర్ణించిన గవర్నర్‌కు ఇలా అధికారాలన్నీ దత్తంచేయాలనే ప్రయత్నం టీడీపీ ఎందుకు చేస్తోందన్నారు.
 
ఏపీ ప్రభుత్వాన్ని సంప్రదించాలని ఎందుకు సూచించలేదు?
చంద్రబాబు గతేడాది జూన్ 24నే సెక్షన్-8 అమలుచేయాలని కేంద్రానికి లేఖ రాసినట్లుగా చెబుతున్నారని, హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అయినందున సెక్షన్-8లో ఏపీ ప్రభుత్వాన్ని కూడా గవర్నర్ సంప్రదించాలన్న మార్పు కోరుతూ ఎందుకు లేఖలో సూచించలేకపోయారని అంబటి నిలదీశారు. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల్ని సంప్రదించాకనే గవర్నర్ నిర్ణయం తీసుకోవాలనే సవరణను సూచించివుంటే బాగుండేదన్నారు.
 
పవన్... ‘పేయిడ్ ఆర్టిస్టు’గా వ్యవహరించొద్దు
తెగేదాకా లాగొద్దన్న పవన్ కల్యాణ్.. చంద్రబాబు చేతిలో ‘పేయిడ్ ఆర్టిస్ట్’(డబ్బు తీసుకునే నటుడు)గా వ్యవహరించొద్దని అంబటి హితవు చెప్పారు. అసలు కథేమిటో తెలుసుకోకుండా ఎప్పుడంటే అపుడు మేల్కొని హఠాత్తుగా నెల్సన్ మండేలాను ప్రస్తావించడం విడ్డూరమన్నారు. ప్రజలపక్షాన ప్రశ్నిస్తానన్న పవన్.. ‘చంద్రబాబు ఒక ఎమ్మెల్యేను రూ.5 కోట్లకు కొనడం తప్పా?, కాదా? టేపుల్లో ఉన్నది చంద్రబాబు గొంతా? కాదా?, రేవంత్ టీడీపీవారా? కాదా?, ఆయన తీసుకెళ్లిన రూ.50 లక్షలు చంద్రబాబువా?, కావా?’ అని ఎందుకు ప్రశ్నించలేదని రాంబాబు నిలదీశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement