
ఆ మంత్రులు చాలా డేంజర్: అంబటి
గుంటూరు: ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు గౌరవంగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాదాభివందనం చేస్తే తప్పేంటని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. వయసులో పెద్దవారికి నమస్కరించడం మన సంప్రదాయమని, దీనిపై రాద్ధాంతం చేయడం దారుణమని పేర్కొన్నారు. అందితే జుట్టు, అందకపోతే కాళ్లు పట్టుకునే అలవాటు చంద్రబాబుకు ఉందని ఎద్దేవా చేశారు. కోవింద్‌కు జగన్ నమస్కారం చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుగా చిత్రీకరించడం సరికాదని అన్నారు. తాము బీజేపీకి మద్దతు ఇస్తున్నట్టు ప్రచారం చేస్తున్నారని, తమ మద్దతు రాష్ట్రపతి ఎన్నిక వరకే పరిమితమని స్పష్టం చేశారు.
హెరిటేజ్ వాహనంలో ఎర్రచందనం దుండగులు పట్టుబడిన వ్యవహారంపై మంత్రులు ఆదినారాయణరెడ్డి, అమరనాథ్ రెడ్డి చాలా నీచంగా మాట్లాడారని ధ్వజమెత్తారు. ఆ వ్యాన్‌ను పట్టుకుంది వైఎస్సార్ సీపీ కార్యకర్తలు కాదని, టాస్క్‌ఫోర్స్ పోలీసులే పట్టుకున్నారన్న విషయాన్ని టీడీపీ నేతలు గ్రహించాలన్నారు. పట్టుకున్న వ్యాన్ తమది కాకుంటే ఆ విషయాన్ని చంద్రబాబు, హెరిటేజ్ సంస్థ వెల్లడించాలి. టీడీపీకి అమ్ముడుపోయి మంత్రులుగా చెలామణి అవుతూ జగన్‌ను విమర్శించే హక్కు ఆదినారాయణరెడ్డి, అమరనాథ్ రెడ్డికి లేదని అన్నారు. రాజకీయాన్ని అమ్ముకునే దొంగలు మీరు, స్మగ్లింగ్ చేసే వారికంటే మీరే ప్రమాదకరమ’ ని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.