అనంతపురం ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ : జిల్లా విద్యాశాఖలో అడ్డగోలు బదిలీలకు ప్రభుత్వం తెరతీసింది. 60 మందిని కోరుకున్న ప్రాంతాలకు బదిలీ చేస్తూ హడావుడిగా ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో 33 మంది స్కూల్ అసిస్టెంట్లు, 23 మంది ఎస్జీటీలు, ముగ్గురు ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎంలు, ఒక లాంగ్వేజ్ పండిట్ (హిందీ) ఉన్నారు. ఈ బదిలీలకు సంబంధించి కనీసం జిల్లా విద్యాశాఖను ‘రిమార్క్సు’ కోరలేదు. గుట్టుచప్పుడు కాకుండా ఈ బదిలీల ఆర్డర్లు జారీ చేయడంపై ఉపాధ్యాయ వర్గాలు నివ్వెరపోతున్నాయి.
రాజకీయ ఒత్తిళ్ల వల్లే నిబంధనలకు పాతరేసి అడ్డగోలు బదిలీలు చేసినట్లు విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ బదిలీలు ‘తాంబూలాలిచ్చాం తన్నుకు చావండి’ అన్న చందంగా ఉన్నాయి. ఒక ఖాళీ ఉంటే ముగ్గురు, నలుగురు ఉపాధ్యాయులను బదిలీ చేశారు. దీంతో అప్పుడే జాయినింగ్ ఉత్తర్వుల కోసం పైరవీలు మొదలయ్యాయి. మరోవైపు ఖాళీలు లేని, అసలు పోస్టే లేని స్కూళ్లకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఎంత బలంగా పని చేశాయో అర్థం చేసుకోవచ్చు.
హైదరాబాద్ స్థాయిలో ఒక్కో ఆర్డర్‌కు అక్షరాలా లక్ష రూపాయలు ఖర్చు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగానే.. బదిలీకి అర్హులా.. కాదా అనే విషయాలను కూడా పట్టించుకోకుండా దరఖాస్తు చేసుకున్న అందరికీ బదిలీల ఆర్డర్లు ఇచ్చేశారు. జిల్లాకు చెందిన ఓ మంత్రి ప్రధాన అనుచరుడు తనకు కావాల్సిన మహిళా ఉపాధ్యాయురాలి బదిలీ కోసం.. ఆమె దరఖాస్తు చేయకపోయినా, అతనే ఆమె తరుఫున దరఖాస్తు చేసి సదరు మంత్రి ద్వారా ఒత్తిడి చేయించి బదిలీ చేయించినట్లు సమాచారం.
బదిలీలలు
రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంటు బయాలజికల్ సైన్సు ఒక పోస్టు ఖాళీ ఉంది. అయితే ఇక్కడికి నలుగురిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఖాళీలు లేకపోయినా.. బుక్కరాయసముద్రం, సిద్ధరాంపురం ఇంగ్లిష్ సబ్జెక్టు పోస్టులు, బీ. కొత్తపల్లిలో ఫిజికల్ సైన్స్ పోస్టులకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
అనంతపురం రూరల్ పరిధిలోని పాపంపేట జెడ్పీహెచ్‌ఎస్‌లో ఇంగ్లిష్ సబ్జెక్టు పోస్టు ఖాళీ లేదు. ఇక్కడికి ఒక ఉపాధ్యాయురాలిని నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇటీవల ఇదే సబ్జెక్టుకు సంబంధించి ఇద్దరు ఉపాధ్యాయులకు ప్రభుత్వం బదిలీ ఉత్తర్వులు జారీ చేసింది.
‘నియర్ బై అనంతపురం’ అంటూ ముగ్గురు ఉపాధ్యాయుల ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఓడీసీ మండలం ఎన్.తండా పాఠశాలలో ఎస్జీటీగా పని చేస్తున్న ఓ మహిళను పుట్టపర్తి మండలానికి బదిలీ చేస్తూ రెండు ఉత్తర్వులు జారీ చేశారు. అనంతపురం భగత్‌సింగ్ నగర్ పాఠశాలలో రెండు ఖాళీలు ఉంటే నలుగురికి ఉత్తర్వులు ఇచ్చారు. తాటిచెర్లలో ఒక పోస్టుకు ఇద్దరికి ఉత్తర్వులు ఇచ్చారు. ఇక సోములదొడ్డి పాఠశాలలో ఖాళీలు లేకపోయినా ముగ్గురిని బదిలీ చేశారు.
రిమార్క్సు కూడా కోరని ప్రభుత్వం
ఒక ఉపాధ్యాయుడు బదిలీ కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటే జిల్లా విద్యాశాఖను రిమార్క్సు కోరడం నిబంధన. దరఖాస్తు చేసుకున్న పాఠశాలలో ఖాళీ ఉందా లేదా.. ప్రస్తుతం పని చేస్తున్న చోటు రెండేళ్ల సర్వీసు పూర్తయిందా, లేదా.. పనిచేస్తున్న ఉపాధ్యాయుల సంఖ్య, విద్యార్థుల వివరాలు ఇలా సుమారు 19 అంశాలతో కూడుకున్న ప్రొఫార్మాను జిల్లా విద్యాశాఖ అధికారులు భర్తీ చేసి ప్రభుత్వానికి పంపాల్సి ఉంటుంది. వీటన్నింటినీ పరిశీలించి బదిలీకి అర్హులైతేనే పరిగణనలోకి తీసుకోవాలి. లేదంటే దరఖాస్తును తిరస్కరించాలి.
ముందు వచ్చిన వారికే అవకాశం
బదిలీ ఉత్వర్వు ఇచ్చిన పాఠశాలలో ఖాళీ లేకపోతే సమీప పాఠశాల, అక్కడ లేదంటే సమీప మండలంలో అవకాశం కల్పిస్తాం. ఎవరు ముందుగా వస్తారో వారికి ముందు అవకాశం ఇస్తాం. ఉపాధ్యాయుల బదిలీకి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులో ఈ విషయాలు చాలా స్పష్టంగా పేర్కొంది.
- మధుసూదన్‌రావు, డీఈఓ
పంతుళ్ల దొడ్డిదారి
Published Wed, Feb 5 2014 2:37 AM | Last Updated on Fri, Sep 28 2018 4:43 PM
Advertisement
Advertisement