అమెరికా అమ్మాయి.. ఆంధ్రా అబ్బాయి!
చిత్తూరు : ప్రేమకు మతాలు అడ్డుకావని, ఎల్లలు లేవని నిరూపించింది ఓ జంట. అమెరికాలో ఉంటున్న అమ్మాయిని, ఆంధ్రాలో ఉంటున్న అబ్బాయిని ఫేస్‌బుక్ కలుపగా ఇరు కుటుంబాలు వారిని ఒక్కటి చేశాయి. దీనికి చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలం కోటావూరు గ్రామ పంచాయతీలోని అమరనారాయణపురం ఆలయం వేదికైంది. అబ్బాయి కుటుంబీకుల కథనం మేరకు... మదనపల్లెకు చెందిన కె.జనార్దన్‌రెడ్డి స్థానికంగా ఓ పాఠశాల యాజమాన్య బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇతని మేనమామ ఆర్.రాజశేఖర్‌రాజు అలియాస్ జర్మన్‌రాజు గతంలో విదేశాల్లో గడిపారు.
ఈ నేపథ్యంలో అమెరికాలోని కాలిఫోర్నియాలో స్థిరపడిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఫిద్వాహీదా, మదనపల్లెలో ఉంటున్న జనార్దన్‌రెడ్డి ఫేస్‌బుక్‌లో కలుసుకున్నారు. ఒకరి అభిరుచులు మరొకరు తెలుసుకుని ఏడాదిగా ప్రేమలో పడ్డారు. పెళ్లికి ఇరు కుటుంబాల్లోని పెద్దలను ఒప్పించారు. వివాహం కోసం అమెరికా నుంచి ఫీద్వాహిదా, ఆమె తల్లి, అక్క, మరికొందరు బంధువులు గురువారం తెల్లవారున మదనపల్లెకు చేరుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున బంధు, మిత్రుల మధ్య ఫిద్వాహీదా హిందూ సంప్రదాయ పద్ధతిలో పెళ్లిపీటలపై కూర్చొని జనార్దన్‌రెడ్డితో మూడుముళ్లు వేయించుకుంది. పెళ్లి కుమార్తె ముస్లిం కావడంతో వారి కుటుంబీకుల తరఫున జనార్దన్‌రెడ్డి మేనమామ జర్మన్‌రాజు కన్యాదానం చేశారు.