ఇది ఒక షార్ట్‌ఫిల్మ్. దీని పేరు ‘ఫ్యామిలీ’. తాజాగా విడుదలైంది. ఏమిటి కథ? ఇందులో ఇంటి పెద్ద అమితాబ్ బచ్చన్ ఒక ఉదయాన్నే తన సన్ గ్లాసెస్ వెతుక్కుంటూ ఉంటాడు. ‘ఏవోయ్... నా సన్ గ్లాసెస్ ఎక్కడా?’ అని భార్యను ఉద్దేశించి అడుగుతుంటాడు. భార్య పలకదు. ఏ వంట పనిలో ఉందో ఏమో. ‘ఏవోయ్... నిన్నే... నా సన్ గ్లాసెసోయ్’ అంటుంటాడు. భార్య ఉలకదు. పక్క గదిలో ఉన్న మేనల్లుడు దిల్‌జిత్ (పంజాబీ నటుడు) దీనికి స్పందిస్తాడు. ‘మామ సన్ గ్లాసెస్ కనిపించడం లేదని వెతుక్కుంటుంటే ఒక్కరూ పట్టించుకోరెందుకు? నేను వెతుకుతా’ అని అటూ ఇటూ వెతుకుతాడు. వెళ్లి నిద్రపోతున్న రణ్‌బీర్ కపూర్‌ను లేపుతాడు. ‘నన్నెందుకు లేపుతావ్? నువ్వే వెతుకు?’ అంటాడు రణ్‌బీర్. తల్లి వచ్చి ‘ఇద్దరూ వెతకండి’ అంటుంది.
దాంతో రణ్‌బీర్ కపూర్ పక్క గదిలో ఉన్న మమ్ముట్టి దగ్గరకు వెళ్లి ‘అంకుల్‌వి కళ్లద్దాలు కనిపించడం లేదట. చూశారా?’ అని అడుగుతాడు. ‘ఏం తలనొప్పిరా సామి నీతో. ఆయన కళ్లద్దాలు నాకు తెలుసులే. చాలా ఓల్డ్ మోడల్. కాస్త మేం వాడే కొత్త మోడల్స్ వాడమని చెప్పు. (అని కెమెరా వైపు చూస్తూ) ‘గురూ... నీ దగ్గర చాలా మోడల్స్ ఉంటాయిగా. ఒకటివ్వరాదూ’ అంటాడు. అంతే... రజనీకాంత్ ఫ్రేమ్‌లోకి వచ్చి తాను పెట్టుకున్న సన్ గ్లాసెస్‌ను స్టయిల్‌గా చూపిస్తూ ‘ఇవా?’ అని అడిగి, మళ్లీ క్షణంలో కొత్తవి మార్చి ‘ఇవా’ అని అడుగుతాడు. దాంతో రణ్‌బీర్ కపూర్ ఖంగు తింటాడు. రణ్‌బీర్‌తో లాభం లేదనుకున్న దిల్‌జిత్ బాత్‌రూమ్‌కు వెళ్లి తలుపు కొడతాడు. లోపల ఎవరు? ఇంకెవరు? మెగాస్టార్ చిరంజీవి!
లోపల ఆయన గడ్డం గీసుకుంటూ ‘ఏమిటా కొట్టడం? తలుపు విరిగిపోగలదు. ఏం కావాలి?’ అని అడిగితే ‘సన్ గ్లాసెస్ ఉన్నాయా అక్కడా?’ అని అడుగుతాడు దిల్‌జిత్. ‘సన్ గ్లాసెసా? ఇక్కడ నీళ్లే రావట్లేదు. సన్ గ్లాసెస్ ఎందుకొస్తాయి’ అని ఆయన ప్రశ్నిస్తాడు. లైబ్రరీలో ఉన్న శివ రాజ్‌కుమార్ ‘నన్ను చూశావా అని అడుగుతున్నావా? కనపడనివాటిని ఎలా చూడమంటావు? ముందు నువ్వు వాటిని వెతుకు. అప్పుడు చూస్తాను’ అని సలహా ఇస్తాడు. ఇక మోహన్‌లాల్ ‘హ..హ... సన్ గ్లాసెస్... ఇక్కడే ఎక్కడో ఉండాలి. ఆయనవి కనిపిస్తే నావి కూడా వెతుక్కోవాలి’ అంటాడు. బెంగాలీ స్టార్ ప్రసేన్‌జిత్ చటర్జీ ‘ఎందుకు నాయనా ఒకరి వెంట ఒకరు వచ్చి సన్ గ్లాసెస్ అంటూ నా ప్రాణం తీస్తారు’ అంటాడు.
చివరకు దిల్‌జిత్ ఆలియా భట్‌కు ఫోన్ చేస్తాడు. ఆలియా భట్ ఆ పక్కనే యోగా చేస్తుంటుంది. ‘ఇక్కడే నన్ను పెట్టుకొని ఎందుకు ఫోన్ చేస్తున్నావ్? సన్ గ్లాసెస్ నేను చూశాలే’ అని గుర్తు తెచ్చుకుని తన నెత్తి మీద ఉన్న వాటిని తీసి ఇస్తుంది. వాటిని ప్రియాంకా చోప్రా లాక్కుని తీసుకెళ్లి అమితాబ్ చేతిలో పెడుతుంది.
‘ఇంత హడావిడి చేస్తున్నారు? మీకు సన్ గ్లాసెస్ ఎందుకు?’ అని అమితాబ్‌ను అడుగుతుంది ప్రియాంకా చోప్రా.
‘ఎందుకా? నేను కొన్నాళ్లు బయటకు వెళ్లదలుచుకోలేదు. వెళ్లను కనుక సన్ గ్లాసెస్ నాకు అవసరం లేదు. అవసరంలేని సన్ గ్లాసెస్‌ను ఎక్కడో మర్చిపోతే మీరంతా అనవసరంగా వాటిని వెతకాల్సి వస్తుంది. అందుకే ఇప్పుడు వెతకమన్నాను’ అని నవ్వుతాడు.
అందరూ ‘హార్ని’ అనుకుంటూ ఉండగా షార్ట్‌ఫిల్మ్ ముగుస్తుంది. అందరూ ఇంట్లోనే ఉండండి, బయటకు వెళ్లవద్దు, వెళ్లి కరోనా బారిన పడవద్దు అని చెప్పడానికి దేశంలోని ప్రాతినిధ్య నటులు కలిసి చేసిన ప్రయత్నం ఇది. ఇందుకోసం ఎవరూ ఇంటి నుంచి బయటకు రాలేదు. తమ ఇళ్లల్లోనే ఉంటూ తమ పార్ట్‌ను షూట్ చేసి పంపారు. దర్శకుడు ప్రసూన్ పాండే వీరందరినీ వర్చువల్‌గా డైరెక్ట్ చేశాడు. మమ్ముట్టి పార్ట్‌ను ఆయన కుమారుడు దుల్కర్ షూట్ చేశాడట.
మంచి విషయం ఏమిటంటే ఈ షార్ట్ ఫిల్మ్‌లో ప్రతి ఒక్కరూ వారి భాషలను మాట్లాడటం. చిరంజీవి తెలుగు, మమ్ముట్టి–మోహన్‌లాల్ మలయాళం, రజనీకాంత్ తమిళం, ప్రసేన్ జిత్ బెంగాలీ మాట్లాడారు. షార్ట్ ఫిల్మ్ చివరలో వినోద రంగ కార్మికుల కోసం సహాయ కార్యక్రమాలు చేపట్టనున్నట్టు అమితాబ్ ప్రకటించడం కనిపిస్తుంది. సోనీ నెట్‌వర్క్, కల్యాణ్ జ్యువెలర్స్ కలిసి ఈ షార్ట్ ఫిల్మ్‌ను నిర్మించాయి. అమితాబ్ ఇందుకు సూత్రధారిగా వ్యవహరించారు. యూ ట్యూబ్‌లో ఉంది చూడండి. ఇల్లు కదలకుండా ఉండండి.
పెద్దాయన సన్ గ్లాసెస్ వెతకండ్రా
Published Wed, Apr 8 2020 2:09 AM | Last Updated on Wed, Apr 8 2020 5:06 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment