shortfilm
-
నాలుగు గోడల మధ్య నరకాలు నడిచొచ్చిన చోట...
కొన్ని చిత్రాలు ఇలా వచ్చి అలా వెళ్లిపోతాయి... కొన్ని చిత్రాల చిత్రజైత్రయాత్ర మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. ‘కేజ్డ్’ అనే లఘుచిత్రం కూడా ఇలాంటిదే! దీనిలో ఎలాంటి కమర్షియల్ గిమ్మిక్కులు లేవు... కన్నీటిబొట్లు ఉన్నాయి. వాటిలోకి ఒకసారి తొంగిచూస్తే మన ఊరు,వాడ, ఇల్లు కనిపిస్తాయి. కరోనా కాలంలో... ముఖ్యంగా లాక్డౌన్ టైమ్‌లో... ఒక ఊళ్లో ఒక భర్త: ‘చికెన్ బిర్యానీ వండిపెట్టమని రెండురోజుల నుంచి చెబుతున్నాను. పుట్టింటి వాళ్లతో మాట్లాడడానికి టైమ్ ఉంటుందిగానీ నేను అడిగింది చేసి పెట్టడానికి మాత్రం టైమ్ ఉండదు. మగాడికి విలువ లేకుండా పోయింది’ మరో ఊళ్లో ఒక భర్త: ఈయన ఇంట్లో ఉండడం కంటే ఆఫీసులో ఉండడమే ‘కుటుంబ సంక్షేమం’ అనుకుంటారు కుటుంబసభ్యులు. ఈ భర్త చాదస్తాల చౌరస్తా. ‘ఇది ఇల్లా అడవా? ఏంచేస్తున్నావు? ఎక్కడి వస్తువులు అక్కడే పని ఉన్నాయి’ అని గర్జించే ఈ భర్తకి టీవికి ఠీవీగా ముఖం అప్పగించడం తప్ప చిన్నచిన్న పనులలో కూడా భార్యకు సహాయం చేయడానికి మనసు రాదు. ఇంకో ఊళ్లో ఇంకో భర్త: ఈయనకు ఏమాత్రం టైమ్ దొరికినా అత్తింటివాళ్లు బాకీపడ్డ అదనపు కట్నం గురించి అదేపనిగా గుర్తొస్తుంది. అలాంటిది లాక్డౌన్ పుణ్యమా అని అతడు రోజంతా ఇంట్లోనే ఉన్నాడు. మాటలతోనే ఇంట్లో వరకట్న హింసను సృష్టించాడు. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. లాక్డౌన్ టైమ్‌లో ప్రపంచవ్యాప్తంగా మహిళలు రకరకాల హింసలు ఎదుర్కొన్నారు. ఈ హింసపై ఐక్యరాజ్య సమితి సాధికారికమైన నివేదికను ప్రచురించింది. దీనిని ఆధారం చేసుకొని అమెరికాలో స్థిరపడిన మలయాళీ డైరెక్టర్ లీజా మాథ్యూ ‘కేజ్డ్’ పేరుతో షార్ట్‌ఫిల్మ్ రూపొందించింది. లాక్డౌన్ టైమ్‌లో అక్షరజ్ఞానం లేని మహిళలతో పాటు బాగా చదువుకున్న మహిళలు, ఇంటిపనులకే పరిమితమైన వారితో పాటు, ఉద్యోగాలు చేస్తున్న మహిళలు ఎదుర్కున్న మానసిక, శారీరక, భావోద్వేగ హింసకు ‘కేజ్డ్’ అద్దం పడుతుంది. చిత్రంలో సంద్ర, జయ, విను, క్లైర్ ప్రధాన పాత్రలు. ప్రాంతం, దేశంతో సంబంధం లేకుండా ప్రపంచంలోని వివిధ రకాల హింస బాధితులకు వీరు ప్రతీకలు. నిజానికి వీరు చిత్రం కోసం బాధితుల అవతారం ఎత్తిన వారు కాదు. నిజజీవితంలోనూ బాధితులే. సంద్ర, జయ, విను, క్లైర్ పాత్రలు పోషించిన సచిన్మై మేనన్, దివ్య సంతోష్, శిల్పఅరుణ్ విజయ్, రిలే పూల్‌లు భిన్నరకాల హింస బాధితులే. రిలే పూల్ విషయానికి వస్తే నిజజీవితంలోనూ ట్రాన్స్జండరే. ‘యువ అమెరికన్లపై హింస జరిగితే, తేరుకొని తిరిగిపోరాడతారు. మనదేశంలో మాత్రం అలాంటి పరిస్థితి లేదు. దీనికి రకరకాల కారణాలు ఉండొచ్చు. ముఖ్యంగా గృహహింసకు సంబంధించిన కేసుల్లో చాలామంది మౌనంగా ఉంటున్నారు. మానసికహింస భౌతికహింస కంటే తక్కువేమీ కాదు’ అంటుంది లీజా మాథ్యూ. కొట్టాయం (కేరళ)కు చెందిన లీజా మాథ్యూ గత పదిసంవత్సరాలుగా అమెరికాలో స్థిరపడింది. పద్దెనిమిది నిమిషాల నిడివి గల ‘కేజ్డ్’ మానసిక హింస నుంచి లైంగిక హింస వరకు మహిళలు ఎదుర్కొన్న రకరకాల హింసలను బయటపెడుతుంది. మొన్న మొన్నటి ముంబై ఇంటర్నేషనల్ ఫిల్మ్ఫెస్టివల్తో సహా లండన్ ఇండీ షార్ట్‌ఫిల్మ్ ఫెస్టివల్, నయాగరా ఫాల్స్ షార్ట్ ఫెస్టివల్, టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్... ఎన్నో చిత్రోత్సవాలలో ప్రదర్శితమై రకరకాల ప్రగతిశీల చర్చలకు కేంద్ర బిందువుగా నిలిచింది. -
పెద్దాయన సన్ గ్లాసెస్ వెతకండ్రా
ఇది ఒక షార్ట్‌ఫిల్మ్. దీని పేరు ‘ఫ్యామిలీ’. తాజాగా విడుదలైంది. ఏమిటి కథ? ఇందులో ఇంటి పెద్ద అమితాబ్ బచ్చన్ ఒక ఉదయాన్నే తన సన్ గ్లాసెస్ వెతుక్కుంటూ ఉంటాడు. ‘ఏవోయ్... నా సన్ గ్లాసెస్ ఎక్కడా?’ అని భార్యను ఉద్దేశించి అడుగుతుంటాడు. భార్య పలకదు. ఏ వంట పనిలో ఉందో ఏమో. ‘ఏవోయ్... నిన్నే... నా సన్ గ్లాసెసోయ్’ అంటుంటాడు. భార్య ఉలకదు. పక్క గదిలో ఉన్న మేనల్లుడు దిల్జిత్ (పంజాబీ నటుడు) దీనికి స్పందిస్తాడు. ‘మామ సన్ గ్లాసెస్ కనిపించడం లేదని వెతుక్కుంటుంటే ఒక్కరూ పట్టించుకోరెందుకు? నేను వెతుకుతా’ అని అటూ ఇటూ వెతుకుతాడు. వెళ్లి నిద్రపోతున్న రణ్‌బీర్ కపూర్‌ను లేపుతాడు. ‘నన్నెందుకు లేపుతావ్? నువ్వే వెతుకు?’ అంటాడు రణ్‌బీర్. తల్లి వచ్చి ‘ఇద్దరూ వెతకండి’ అంటుంది. దాంతో రణ్‌బీర్ కపూర్ పక్క గదిలో ఉన్న మమ్ముట్టి దగ్గరకు వెళ్లి ‘అంకుల్‌వి కళ్లద్దాలు కనిపించడం లేదట. చూశారా?’ అని అడుగుతాడు. ‘ఏం తలనొప్పిరా సామి నీతో. ఆయన కళ్లద్దాలు నాకు తెలుసులే. చాలా ఓల్డ్ మోడల్. కాస్త మేం వాడే కొత్త మోడల్స్ వాడమని చెప్పు. (అని కెమెరా వైపు చూస్తూ) ‘గురూ... నీ దగ్గర చాలా మోడల్స్ ఉంటాయిగా. ఒకటివ్వరాదూ’ అంటాడు. అంతే... రజనీకాంత్ ఫ్రేమ్‌లోకి వచ్చి తాను పెట్టుకున్న సన్ గ్లాసెస్‌ను స్టయిల్‌గా చూపిస్తూ ‘ఇవా?’ అని అడిగి, మళ్లీ క్షణంలో కొత్తవి మార్చి ‘ఇవా’ అని అడుగుతాడు. దాంతో రణ్‌బీర్ కపూర్ ఖంగు తింటాడు. రణ్‌బీర్‌తో లాభం లేదనుకున్న దిల్జిత్ బాత్రూమ్కు వెళ్లి తలుపు కొడతాడు. లోపల ఎవరు? ఇంకెవరు? మెగాస్టార్ చిరంజీవి! లోపల ఆయన గడ్డం గీసుకుంటూ ‘ఏమిటా కొట్టడం? తలుపు విరిగిపోగలదు. ఏం కావాలి?’ అని అడిగితే ‘సన్ గ్లాసెస్ ఉన్నాయా అక్కడా?’ అని అడుగుతాడు దిల్జిత్. ‘సన్ గ్లాసెసా? ఇక్కడ నీళ్లే రావట్లేదు. సన్ గ్లాసెస్ ఎందుకొస్తాయి’ అని ఆయన ప్రశ్నిస్తాడు. లైబ్రరీలో ఉన్న శివ రాజ్‌కుమార్ ‘నన్ను చూశావా అని అడుగుతున్నావా? కనపడనివాటిని ఎలా చూడమంటావు? ముందు నువ్వు వాటిని వెతుకు. అప్పుడు చూస్తాను’ అని సలహా ఇస్తాడు. ఇక మోహన్‌లాల్ ‘హ..హ... సన్ గ్లాసెస్... ఇక్కడే ఎక్కడో ఉండాలి. ఆయనవి కనిపిస్తే నావి కూడా వెతుక్కోవాలి’ అంటాడు. బెంగాలీ స్టార్ ప్రసేన్‌జిత్ చటర్జీ ‘ఎందుకు నాయనా ఒకరి వెంట ఒకరు వచ్చి సన్ గ్లాసెస్ అంటూ నా ప్రాణం తీస్తారు’ అంటాడు. చివరకు దిల్జిత్ ఆలియా భట్‌కు ఫోన్ చేస్తాడు. ఆలియా భట్ ఆ పక్కనే యోగా చేస్తుంటుంది. ‘ఇక్కడే నన్ను పెట్టుకొని ఎందుకు ఫోన్ చేస్తున్నావ్? సన్ గ్లాసెస్ నేను చూశాలే’ అని గుర్తు తెచ్చుకుని తన నెత్తి మీద ఉన్న వాటిని తీసి ఇస్తుంది. వాటిని ప్రియాంకా చోప్రా లాక్కుని తీసుకెళ్లి అమితాబ్ చేతిలో పెడుతుంది. ‘ఇంత హడావిడి చేస్తున్నారు? మీకు సన్ గ్లాసెస్ ఎందుకు?’ అని అమితాబ్‌ను అడుగుతుంది ప్రియాంకా చోప్రా. ‘ఎందుకా? నేను కొన్నాళ్లు బయటకు వెళ్లదలుచుకోలేదు. వెళ్లను కనుక సన్ గ్లాసెస్ నాకు అవసరం లేదు. అవసరంలేని సన్ గ్లాసెస్‌ను ఎక్కడో మర్చిపోతే మీరంతా అనవసరంగా వాటిని వెతకాల్సి వస్తుంది. అందుకే ఇప్పుడు వెతకమన్నాను’ అని నవ్వుతాడు. అందరూ ‘హార్ని’ అనుకుంటూ ఉండగా షార్ట్‌ఫిల్మ్ ముగుస్తుంది. అందరూ ఇంట్లోనే ఉండండి, బయటకు వెళ్లవద్దు, వెళ్లి కరోనా బారిన పడవద్దు అని చెప్పడానికి దేశంలోని ప్రాతినిధ్య నటులు కలిసి చేసిన ప్రయత్నం ఇది. ఇందుకోసం ఎవరూ ఇంటి నుంచి బయటకు రాలేదు. తమ ఇళ్లల్లోనే ఉంటూ తమ పార్ట్‌ను షూట్ చేసి పంపారు. దర్శకుడు ప్రసూన్ పాండే వీరందరినీ వర్చువల్‌గా డైరెక్ట్ చేశాడు. మమ్ముట్టి పార్ట్‌ను ఆయన కుమారుడు దుల్కర్ షూట్ చేశాడట. మంచి విషయం ఏమిటంటే ఈ షార్ట్ ఫిల్మ్‌లో ప్రతి ఒక్కరూ వారి భాషలను మాట్లాడటం. చిరంజీవి తెలుగు, మమ్ముట్టి–మోహన్‌లాల్ మలయాళం, రజనీకాంత్ తమిళం, ప్రసేన్ జిత్ బెంగాలీ మాట్లాడారు. షార్ట్ ఫిల్మ్ చివరలో వినోద రంగ కార్మికుల కోసం సహాయ కార్యక్రమాలు చేపట్టనున్నట్టు అమితాబ్ ప్రకటించడం కనిపిస్తుంది. సోనీ నెట్వర్క్, కల్యాణ్ జ్యువెలర్స్ కలిసి ఈ షార్ట్ ఫిల్మ్‌ను నిర్మించాయి. అమితాబ్ ఇందుకు సూత్రధారిగా వ్యవహరించారు. యూ ట్యూబ్‌లో ఉంది చూడండి. ఇల్లు కదలకుండా ఉండండి. -
రమ్య సైలెంట్‌గా ఏం చేసిందో తెలుసా?
సినిమా: మాలీవుడ్, కోలీవుడ్ అంటూ దక్షిణాది సినిమాలో తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్న మలమాళీ చిన్నది రమ్య నంబీశన్. కొన్ని చిత్రాల్లో అందాలారబోసినా, ఎందుకనో ఈ అమ్మడికి పక్కింటి అమ్మాయి ఇమేజ్‌నే ఉండడం లక్కీనే. తమిళంలో నటించిన పిజ్జా చిత్రం తెలుగు అనువాదంతో అక్కడ పరిచయం అయిన ఈ అమ్మడిలో మల్టీటాలెంట్ ఉందన్నది తెలిసిందే. నటి, గాయనిగా రాణిస్తున్న రమ్య తాజాగా మరో ప్రయత్నం చేసింది. అదేంటో చూద్దాం. ఈ అమ్మడు మెగాఫోన్ పట్టింది. దీని గురించి అడిగితే అయ్యయ్యో అది పెద్ద చిత్రం కాదండీ. చాలా చిన్న చిత్రం. దాన్ని లఘు చిత్రం అని కూడా అనవచ్చో లేదో. మూడు నిమిషాలు నిడివితో కూడుకుంది. దానికి అన్హైట్ అనే టైటిల్‌ను పెట్టాను. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ నెల 14న విడుదల చేయనున్నాను. తన మనసులో ఉన్న చిన్న కాన్సెప్ట్‌నకు దృశ్య రూపం ఇచ్చే ప్రయత్నం చేశాను అంతే అని చెప్పింది. ప్రస్తుతం చేస్తున్న చిత్రాల గురించి చెబుతూ విజయ్ ఆంటోనికి జంటగా తమిళరసన్ అనే చిత్రంలో నటించాను. ఈ చిత్రంలో కథనం వైవిద్యంగా ఉంటుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. ప్రస్తుతం సిబిరాజ్‌కు జంటగా రేంజర్స్ చిత్రంలోనూ ప్లాన్ పన్ని పన్ననుమ్ అనే మరో కామెడీ కథా చిత్రం, ప్రభుదేవాకు జంటగా ఒక చిత్రం చేస్తున్నాను. అదేవిధంగా మలయాళంలో ఒక చిత్రం చేస్తున్నాను అని తెలిపింది. మాతృభాషలో కంటే తమిళంలోనే ఎక్కువ చిత్రాలు చేస్తున్నట్లున్నారే అన్న ప్రశకు అవును తమిళంలో సేతుపతి చిత్రం తరువాత మంచి అవకాశాలు వస్తున్నాయి. నాకు భాషా సమస్య లేదు. అందుకే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాను. అందులోనూ మంచి కథా పాత్రలనే ఎంపిక చేసుకుంటున్నాను. అయితే మలయాళం మాతృభాష కావడంతో ఆ చిత్రాల్లో నటించేటప్పుడు కలిగే అనుభూతే వేరు. అందుకే మలయాళ చిత్రాల్లోనూ నటిస్తున్నాను అని చెప్పింది. గాయనిగా కెరీర్ ఎలా సాగుతోందన్న ప్రశ్నకు నా జీవితంలో నటనకు, సంగీతానికి సమ ప్రాధాన్యతనిస్తాను. ఇటీవల సల్మాన్‌ఖాన్ నటించిన దబాంగ్ 3 చిత్ర తమిళ వెర్షన్లో ఒక పాట పాడాను. తరువాత యువన్‌శంకర్‌రాజా సంగీతదర్శకత్వంలో ఒక పాట పాడాను. ఇక బుల్లితెర సంగీత కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ జీవితం ఆనందంగా సాగిపోతోంది అని రమ్యానంబీశన్ చెప్పుకొచ్చింది. -
ఈ వారం యూట్యూబ్ హిట్స్
ఆఫీస్ రొమాన్స్ – హిందీ షార్ట్‌ఫిల్మ్ నిడివి 8 ని. 05 సె. హిట్స్ 27,21,025 ప్రేమలు పుట్టే అతి ముఖ్య స్థలం క్లాస్రూమ్. అది దాటాక ఆఫీస్ ఫ్లోర్. క్లాస్రూమ్ ప్రేమలు సఫలం అవుతాయో అవవో చెప్పడం కష్టం... ఎందుకంటే అప్పటికి వాళ్లు జీవితంలో సెటిల్ అయి ఉండరు కనుక. కానీ ఆఫీస్ ప్రేమలు సఫలమయ్యే చాన్సులు ఎక్కువ. ఎందుకంటే వాళ్లను ఆపే శక్తి ఎవరికీ ఉండదు కనుక. కానీ ఆఫీసు ప్రేమ పండి పెళ్లి వరకూ చేరుకునే దాకా చాలా సీక్రెసీ మెయిన్‌టెయిన్ చేయాల్సి ఉంటుంది. తెలిస్తే కొలీగ్స్‌తో తలనొప్పి. బాస్‌కి ఇష్టం లేకపోతే అతడు హరాస్ చేసే అవకాశం ఉంది. చెవులు కొరుక్కోవడం. ఈ షార్ట్‌ఫిల్మ్‌లో ప్రేమలో ఉన్న ఇద్దరు కొలీగ్స్ కనిపిస్తారు. ఇద్దరూ ఒకే క్యాబ్‌లో వస్తారు. కానీ ఆఫీసుకు కాస్త దూరంలో దిగి ఆమె ముందు వెళుతుంది. ఐదు నిమిషాల తర్వాత ఏమీ ఎరగనట్టు అతడు చేరుకుంటాడు. ఆఫీసులో కళ్లతోనే ప్రేమించుకుంటారు. మాటలు కూడా సైగల ద్వారానే. పైకి మాత్రం ఏమెరగనట్టు ఉంటారు. ఈ షార్ట్‌ఫిల్మ్‌లో మరుసటి రోజు ఆ కుర్రాడి బర్త్‌డే ఉంటుంది. అమ్మాయి ఆఫీసు నుంచి త్వరగా బయటపడి పార్టీ చేసుకుందాం అనుకుంటుంది. ఇద్దరూ ఒకరి తర్వాత ఒకరు బాస్‌కు మస్కా కొట్టి పర్మిషన్ తీసుకుంటారు. పార్టీ చేసుకుని ఇద్దరూ మరి కాస్త మజా చేసుకోవడానికి రూమ్‌కు చేరుకుంటే ఏమైందనేది క్లయిమాక్స్. సరదా షార్ట్‌ఫిల్మ్. నటించిన నిక్, ప్రాజెక్తా ఇద్దరూ యూట్యూబ్ స్టార్లే కనుక హిట్స్ జోరుమీదున్నాయి. నా పెళ్లిగోల – షార్ట్‌ఫిల్మ్ నిడివి 10 ని. 38 సె. హిట్స్ 5,73,318 గతంలో మనుషులకు చాలా సెలబ్రేషన్స్ ఉండేవి. ఊళ్లో తిరునాళ్ళు, వన భోజనాలు, నవమి పందిళ్లు, ఆరుబయట కబుర్లు, పూజలు, వ్రతాలు... ఇప్పుడు అవన్నీ పోయి ఒకే సెలబ్రేషన్ మిగిలింది. పెళ్లి. జీవితంలో డబ్బు తప్ప వేరే ఏమీ సంపాదించే పని లేదని భావించి కష్టపడి, తీరా డబ్బు సంపాదించాక అందరూ డబ్బు సంపాదించేపనిలోనే ఉన్నారు కనుక ఎవరికీ ఒకరంటే ఒకరికి గౌరవం లేదని అర్థం చేసుకొని, చివరకు ఆ డబ్బును ప్రదర్శించడం వల్లే గుర్తింపు పొందుదామని తాపత్రయపడి, అందుకోసం ఒక సందర్భాన్ని సృష్టించుకుంటే ఆ సందర్భమే పెళ్లి. ఆ పెళ్లి మీద బోలెడన్ని సెటైర్లు వేస్తుంది ఈ షార్ట్‌ఫిల్మ్‌లో మహాతల్లి. ‘మహాతల్లి’ పేరుతో యూ ట్యూబ్ సిరీస్ నడుపుతున్న జాహ్నవి తన టీమ్‌తో చేసిన సందడి ఇది. పెళ్లి అనగానే ఇరుగు పొరుగు ఆరాలు, స్నేహితుల రియాక్షన్లు, తల్లిదండ్రుల ఆకాంక్షలు... ఇవన్నీ అవసరమా అన్నట్టు ముక్తాయింపు ఇస్తుంది. కాలక్షేపం ఇస్తూనే చిన్న మెసేజ్ కూడా ఇచ్చిన షార్ట్‌ఫిల్మ్ ఇది. సిటీ బస్‌లో గోల – షార్ట్‌ఫిల్మ్ నిడివి 7 ని. 42 సె. హిట్స్ 4,43,063 సిటీబస్ అంటేనే ఒక సర్కస్. మానవ జీవితంలో ఉండే సకల ఫీట్లూ మూడ్లూ ఆ బస్‌లో ఉంటాయి. గమనించాలేగానీ వేయి మనస్తత్వాలు, లక్ష వినోదాలు ఆ బస్‌లో దొరుకుతాయి. గతంలో సిటీబస్ కామెడీ చాలామంది మిమిక్రీ ఆర్టిస్టులు చేశారు. ఇప్పుడు యూట్యూబ్‌లో ఫిల్మ్‌గా విడుదల చేశారు. సీటున్నా ఫుట్‌బోర్డ్ మీద నిలుచునేవాళ్లు, సీటున్నా ఆడవాళ్ల దగ్గర ఆనుకుని నిలుచునేవారూ, టికెట్ వెనుక చిల్లర కోసం వందసార్లు అడిగేవారు, టికెట్ కొనకుండా పాస్ ఉందని అబద్ధం చెప్పేవాళ్లు, మగవారి మీద చేయి వేసే మగవారు, ముఖానికి స్కార్ఫ్ కట్టుకుని ఊసులాడుకునే ప్రేమికులు... వీళ్లందరూ ఈ సిటీబస్‌లో హాస్యం పుట్టిస్తారు. చివరకు స్క్వాడ్ వచ్చి చెకింగ్ చేస్తే ఏమయ్యిందనే ముగింపు. నటుడు రవితేజ నానిమల కండక్టర్‌గా ఆకట్టుకుంటాడు. ప్రయాణికులుగా నటించిన టీమ్ కూడా. సరదా వీడియో ఇది. దర్శకత్వం: జోన్స్ కాట్రు. -
షార్ట్ ఫిలిం హీరోపై క్రిమినల్ కేసు
సాక్షి, బంజారాహిల్స్ : షార్ట్‌ఫిలింలో హీరోయిన్గా నటిస్తున్న తన కుమార్తెను ప్రేమపేరుతో మోసం చేసి తీసుకెళ్లాడని ఆరోపిస్తూ బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు షార్ట్‌ఫిలిం హీరో, నిర్మాతపై కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. యూసుఫ్‌గూడ చెక్‌పోస్టు ప్రాంతానికి చెందిన మహిళ దాండియా కొరియోగ్రాఫర్‌గా పని చేస్తుండగా, ఆమె కుమార్తె(14) షార్ట్‌ఫిలిమ్స్‌లో హీరోయిన్గా నటిస్తోంది. తిరుపతికి చెందిన కస్తూరి ఆనంద వర ప్రసాద్ అనే వ్యక్తి తన స్వీయ నిర్వహణలో తీస్తున్న షార్ట్‌ఫిలింలో నటించేందుకు ఆమెను హీరోయిన్గా బుక్ చేశాడు. కొద్ది రోజులకు వారు ప్రేమించుకుంటున్నట్లు గుర్తించిన యువతి తల్లి ఆనంద్ వివనాలపై ఆరా తీయగా అతడికి అప్పటికే పెళ్లయి, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తేలింది. దీనిపై ఆమె ఆనంద్‌ను నిలదీయగా తనకు పెళ్లి కాలేదని బుకాయించాడు. ఈ నేపథ్యంలో గత మార్చి 22న తాను ఇంట్లో లేని సమయంలో తన కుమార్తెను బలవంతంగా తీసుకెళ్లాడని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
లఘు చిత్రంగా రజనీ ఆధ్యాత్మిక పయనం
తమిళసినిమా: నటుడు రజనీకాంత్ ఆధ్యాత్మిక పయనాన్ని లఘు చిత్రంగా రూపొందించేందుకు సన్నాహాలు జరగుతున్నట్టు కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. రజనీకాంత్‌కు ఆధ్యాత్మిక చింతన అధికం అన్న విషయం తెలిసిందే. దేవుడు శాసిస్తే రజనీ పాటిస్తాడు అని ఆయన చాలా సార్లు వ్యాఖ్యానించారు. రజనీకాంత్ బాబా పరమభక్తుడు. తరచూ హిమాలయాలకు వెళ్లి బాబా ఆశ్రమంలో పూజలు, ధ్యానం చేస్తుంటారు. ఇటీవల రాజకీయ రంగప్రవేశానికి సిద్ధమైన రజనీకాంత్ తనది ఆధ్యాత్మిక రాజకీయం అని పేర్కొనడంతో పాటు, తన పార్టీ గుర్తును ఆ భావన కలిగేలా రూపొందించి, అనంతరం విమర్శలు వెల్లువెత్తడంతో మార్పులు చేశారు. పార్టీ ఆవిర్భావానికి ముందు హిమాలయ పయనం చేసోచ్చిన రజనీకాంత్ అక్కడి దేవాలయాలను సందర్శించి పూజలు, ధ్యానం, యోగా లాంటి వాటిలో పాల్గొన్నారు. ఈసారి ఆయన ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్‌లోని పుణ్య స్థలాలను సందర్శించి వచ్చారు. ఇంతకుముందు హిమాలయాలకు వెళ్లనప్పుడు దైవ దర్శనం మాత్రమే చేసుకుని వచ్చిన రజనీకాంత్ ఈ సారి తన ఆధ్యాత్మిక పయనాన్ని కెమెరాలో బంధించేలా ప్లాన్ చేసుకున్నారు. ఆ దృశ్యాలను ఒక లఘు చిత్రంగా రూపకల్పన చేయడానికి ఒక బృందాన్ని పురమాయించినట్లు తాజా సమాచారం. ఈ లఘు చిత్రాన్ని ఆయన రాజకీయ రంగప్రవేశం సమయంలో సీడీల రూపంలో అభిమానులకు ఉచితంగా అందించాలని నిర్ణయించినట్లు సమాచారం. -
‘సావిత్రి ఒక దీపం’ షూటింగ్ ప్రారంభం
విజయవాడ (గాంధీనగర్) : సావిత్రి కళాపీఠం వ్యవస్థాపకురాలు పరుచూరి విజయలక్ష్మి, గౌరవాధ్యక్షుడు ప్రభల శ్రీనివాస్ నిర్మాతలుగా ‘సావిత్రి ఒక దీపం’ పేరుతో నిర్మిస్తున్న లఘుచిత్రం షూటింగ్ ఆదివారం ప్రారంభమైంది. హోటల్ ఐలాపురంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సినీనటి వాణిశ్రీ పూజ చేసి అనంతరం క్లాప్ కొట్టి షూటింగ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కథానాయికగా సావిత్ర ఎంతో ఎత్తుకు ఎదిగారని కొనియాడారు. సావిత్రిలోని సేవాభావాన్ని లఘుచిత్రం ద్వారా నేటితరం నటీనటులకు తెలియజెప్పేందుకు కళాపీఠం చేస్తున్న ప్రయత్నం అభినందనీయమన్నారు. సావిత్రి తన జీవితంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని, అందుకు తానే ప్రత్యక్ష సాక్షినని వాణిశ్రీ తెలిపారు. నిర్మాతలు పరుచూరి విజయలక్ష్మి, ప్రభల శ్రీనివాస్ మాట్లాడుతూ సావిత్రి కీర్తిప్రతిష్టలను మరింత ఇనుమడింపజేసేందుకు ఈ లఘుచిత్రం నిర్మిస్తున్నట్లు చెప్పారు. మాస్టర్ శ్రీనాగ్‌హితేన్ సమర్పణలో కె.మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక, శ్రీవి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారని తెలిపారు. సావిత్రి కళాపీఠం కార్యదర్శి తోట కృష్ణకిషోర్, కొత్తా జ్యోతి, ఐలాపురం శ్రీదేవి, దారా కరుణశ్రీ, పైడిపాటి వెంకన్న, కోట ఆంజనేయశాస్త్రి, సురేష్, చందన పాల్గొన్నారు. -
పర్యావరణ పరిరక్షణపై లఘుచిత్రం చిత్రీకరణ
పేదరిక నిర్మూలన, పర్యావరణ పరిరక్షణపై ఆదివారం జవహర్‌నగర్‌లో లఘు చిత్రాన్ని చిత్రీకరించారు. గ్రామీణ ప్రాంతాల్లో జీవించే పేదల స్థితిగతులను కళ్లకుకట్టేలా కొన్ని సన్నివేశాలను చిత్ర డైరెక్టర్ వాసు చిత్రీకరించారు. బాలాజీనగర్‌లోని సబ్‌స్టేషన్ ఆవరణలోని చెత్త కుప్పలో ఈ సన్నివేశాలను చిత్రీకరించారు. పర్యావరణ పరిరక్షణ, పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు చిత్ర దర్శకుడు వాసు తెలిపారు. - జవహర్‌నగర్ -
అంతర్జాతీయ చిత్రోత్సవానికి ‘విక్కీస్ డ్రీమ్’
హన్మకొండ కల్చరల్ : ‘ఆదిత్య – జీనియస్ చిత్రంతో గుర్తింపు పొందిన విద్యావేత్త భీమగాని సుధాకర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘విక్కీస్డ్రీమ్’ లఘచిత్రం కూడా అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలకు ఎంపికైంది. పోలెండ్‌లో ఇంటర్నేషనల్ చిల్ర్టన్ మీడియా అధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ చిత్రోత్సవంతో పాటు ముంబైలో జరగనున్న షార్ట్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ చిత్రం ప్రదర్శనకు ఎంపికైందని సుధాకర్ తెలిపారు. విద్యారంగంలో పోటీతత్వం పెరిగి అర్హతలు లేనప్పటికీ డబ్బుతో తన కుమారునికి అవార్డు ఇప్పించుకోవాలని ప్రయత్నించి విఫలమైన తండ్రి, ఆయన కుమారుడి మానసిక సంఘర్షణల నేపథ్యంలో 32 నిముషాల వ్యవధితో విక్కీస్ డ్రీం లఘు చిత్రాన్ని నిర్మించినట్లు సుధాకర్ వివరించారు.