
తమిళసినిమా: నటుడు రజనీకాంత్ ఆధ్యాత్మిక పయనాన్ని లఘు చిత్రంగా రూపొందించేందుకు సన్నాహాలు జరగుతున్నట్టు కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. రజనీకాంత్‌కు ఆధ్యాత్మిక చింతన అధికం అన్న విషయం తెలిసిందే. దేవుడు శాసిస్తే రజనీ పాటిస్తాడు అని ఆయన చాలా సార్లు వ్యాఖ్యానించారు. రజనీకాంత్ బాబా పరమభక్తుడు. తరచూ హిమాలయాలకు వెళ్లి బాబా ఆశ్రమంలో పూజలు, ధ్యానం చేస్తుంటారు. ఇటీవల రాజకీయ రంగప్రవేశానికి సిద్ధమైన రజనీకాంత్ తనది ఆధ్యాత్మిక రాజకీయం అని పేర్కొనడంతో పాటు, తన పార్టీ గుర్తును ఆ భావన కలిగేలా రూపొందించి, అనంతరం విమర్శలు వెల్లువెత్తడంతో మార్పులు చేశారు.
పార్టీ ఆవిర్భావానికి ముందు హిమాలయ పయనం చేసోచ్చిన రజనీకాంత్ అక్కడి దేవాలయాలను సందర్శించి పూజలు, ధ్యానం, యోగా లాంటి వాటిలో పాల్గొన్నారు. ఈసారి ఆయన ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్‌లోని పుణ్య స్థలాలను సందర్శించి వచ్చారు. ఇంతకుముందు హిమాలయాలకు వెళ్లనప్పుడు దైవ దర్శనం మాత్రమే చేసుకుని వచ్చిన రజనీకాంత్ ఈ సారి తన ఆధ్యాత్మిక పయనాన్ని కెమెరాలో బంధించేలా ప్లాన్ చేసుకున్నారు. ఆ దృశ్యాలను ఒక లఘు చిత్రంగా రూపకల్పన చేయడానికి ఒక బృందాన్ని పురమాయించినట్లు తాజా సమాచారం. ఈ లఘు చిత్రాన్ని ఆయన రాజకీయ రంగప్రవేశం సమయంలో సీడీల రూపంలో అభిమానులకు ఉచితంగా అందించాలని నిర్ణయించినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment