సినిమా: మాలీవుడ్, కోలీవుడ్ అంటూ దక్షిణాది సినిమాలో తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్న మలమాళీ చిన్నది రమ్య నంబీశన్. కొన్ని చిత్రాల్లో అందాలారబోసినా, ఎందుకనో ఈ అమ్మడికి పక్కింటి అమ్మాయి ఇమేజ్‌నే ఉండడం లక్కీనే. తమిళంలో నటించిన పిజ్జా చిత్రం తెలుగు అనువాదంతో అక్కడ పరిచయం అయిన ఈ అమ్మడిలో మల్టీటాలెంట్ ఉందన్నది తెలిసిందే. నటి, గాయనిగా రాణిస్తున్న రమ్య తాజాగా మరో ప్రయత్నం చేసింది. అదేంటో చూద్దాం. ఈ అమ్మడు మెగాఫోన్ పట్టింది. దీని గురించి అడిగితే అయ్యయ్యో అది పెద్ద చిత్రం కాదండీ. చాలా చిన్న చిత్రం. దాన్ని లఘు చిత్రం అని కూడా అనవచ్చో లేదో. మూడు నిమిషాలు నిడివితో కూడుకుంది. దానికి అన్‌హైట్ అనే టైటిల్‌ను పెట్టాను. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ నెల 14న విడుదల చేయనున్నాను. తన మనసులో ఉన్న చిన్న కాన్సెప్ట్‌నకు దృశ్య రూపం ఇచ్చే ప్రయత్నం చేశాను అంతే అని చెప్పింది. ప్రస్తుతం చేస్తున్న చిత్రాల గురించి చెబుతూ విజయ్ ఆంటోనికి జంటగా తమిళరసన్ అనే చిత్రంలో నటించాను.
ఈ చిత్రంలో కథనం వైవిద్యంగా ఉంటుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. ప్రస్తుతం సిబిరాజ్‌కు జంటగా రేంజర్స్ చిత్రంలోనూ ప్లాన్ పన్ని పన్ననుమ్ అనే మరో కామెడీ కథా చిత్రం, ప్రభుదేవాకు జంటగా ఒక చిత్రం చేస్తున్నాను. అదేవిధంగా మలయాళంలో ఒక చిత్రం చేస్తున్నాను అని తెలిపింది. మాతృభాషలో కంటే తమిళంలోనే ఎక్కువ చిత్రాలు చేస్తున్నట్లున్నారే అన్న ప్రశకు అవును తమిళంలో సేతుపతి చిత్రం తరువాత మంచి అవకాశాలు వస్తున్నాయి. నాకు భాషా సమస్య లేదు. అందుకే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాను. అందులోనూ మంచి కథా పాత్రలనే ఎంపిక చేసుకుంటున్నాను. అయితే మలయాళం మాతృభాష కావడంతో ఆ చిత్రాల్లో నటించేటప్పుడు కలిగే అనుభూతే వేరు. అందుకే మలయాళ చిత్రాల్లోనూ నటిస్తున్నాను అని చెప్పింది. గాయనిగా కెరీర్ ఎలా సాగుతోందన్న ప్రశ్నకు నా జీవితంలో నటనకు, సంగీతానికి సమ ప్రాధాన్యతనిస్తాను. ఇటీవల సల్మాన్‌ఖాన్ నటించిన దబాంగ్ 3 చిత్ర తమిళ వెర్షన్‌లో ఒక పాట పాడాను. తరువాత యువన్‌శంకర్‌రాజా సంగీతదర్శకత్వంలో ఒక పాట పాడాను. ఇక బుల్లితెర సంగీత కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ జీవితం ఆనందంగా సాగిపోతోంది అని రమ్యానంబీశన్ చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment