విజయనగరం అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘జనగన్న అమ్మఒడి’ పథకం అమలుకు విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. పాఠశాల విద్యాశాఖ నుంచి వచ్చిన షెడ్యూల్ వివరాలు, ప్రధానోపాధ్యాయులు నిర్వహించాల్సిన అంశాలను డీఈఓ జి.నాగమణి సోమవారం విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో ఈ పథకం అమలుకు చేపట్టాల్సిన విధి విధానాలను వివరించారు. పథకానికి ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లులు/గుర్తింపు పొందిన సంరక్షకుల అర్హతను నిర్ధారిస్తారు. అర్హులందరికే ఈ పథకం అందేదిశగా చర్యలు తీసుకుంటున్నారు. వైఎస్సార్ నవశకం పేరుతో ఈ నెల 20 నుంచి డిసెంబర్ 20వ తేదీ వరకు చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగానే పథకం అమలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.
అమ్మ ఒడి జిల్లా స్థాయి షెడ్యూల్ ఇలా...
-పాఠశాల చైల్డ్ ఇన్ఫోలో నమోదైన విద్యార్థుల వివరాలను ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పరిశీలించాలి. ఈ నెల 19వ తేదీలోగా ధ్రువీకరించాలి.
-ఇతర పాఠశాల చైల్డ్ ఇన్ఫోలో ఉన్న విద్యార్ధులను తిరిగి నమోదు చేసుకోవాలి.
-గుర్తించిన జాబితాను గ్రామ సచివాలయంలోని విద్య, సంక్షేమ సహాయకునికి ఈ నెల 20న పంపించి 25న నోటీసు బోర్డులో పెట్టాలి.
అప్‌డేట్ అయిన చైల్డ్ ఇన్ఫో డేటా రాష్ట్ర స్థాయిలో ఏపీ ఆన్‌లైన్ ద్వారా ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్‌కు అందజేస్తారు.
-ఏపీ ఆన్‌లైన్‌కు అందిన చైల్డ్ ఇన్‌ఫో రేషన్ కార్డుల జాబితా మరియు ప్రజాసాధికార సర్వే సమాచారంతో పోల్చి అమ్మ ఒడికి అర్హులైన తల్లులు/సంరక్షకుల సమాచారాన్ని నిర్ధారించి ఈ నెల 21న ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్ ద్వారా ప్రకటిస్తారు.
-ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్ ద్వారా ప్రధానోపాధ్యాయులకు లాగెన్ ఐడీ మరియు పాస్‌వర్డ్ కేటాయిస్తారు. ∙కొత్తగా అర్హతలను జోడించడానికి అవసరమైన మూడు ఫార్మేట్స్ ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్ విడుదల చేస్తుంది.
-వాటిలో ఫార్మేట్–1 తెల్ల రేషన్ కార్డు కలిగిన తల్లులు, సంరక్షకుల వివరాలతో కూడి ఉన్న విద్యార్థుల జాబితా ఉంటుంది. ఇందులో సమాచారాన్ని ప్రధానోపాధ్యాయుడు పరిశీలించి లోపాలు ఉన్నట్లయితే సరిదిద్ది గ్రామ సచివాలయ లాగిన్‌లో ఈ నెల 24లోపు క్రోడీకరించాలి.
-ఫార్మేట్–1ను గ్రామ సచివాలయంలోని విద్య సంక్షేమ సహాయకుడు ప్రధానోపాధ్యాయుల నుంచి అందిన సమాచారాన్ని నోటీస్ బోర్డులో ప్రకటించాలి. అభ్యంతరాలపై గ్రామస్థులకు మూడు రోజులు గడువు ఇవ్వాలి.
-ఫార్మేట్–2 తెల్లరేషన్ కార్డు లేని తల్లులు, సంరక్షకుల వివరాలతో కూడిన విద్యార్థుల జాబితా ఉంటుంది. ప్రధానోపాధ్యాయులు పరిశీలించి గ్రామ సచివాలయం లాగిన్‌కు ఈ నెల 24వ తేదీలోగా పంపాలి.
-ఫార్మేట్–3 ఆధార్ నంబర్/ఈఐడీ నంబర్ లేని విద్యార్థుల జాబితా సేకరించడం కోసం ఉపయోగించాలి. ప్రధానోపాధ్యాయుల ద్వారా అందిన ఫార్మేట్–2, ఫార్మేట్–3వ లను విద్య సంక్షేమ, సహాయకునికి గ్రామవలంటీర్లు అందజేయాలి.
-గ్రామ వలంటీర్లు ఆ సమాచారాన్ని కుటుంబాలకు వివరించి... సమాచారంలో లేని తల్లుల పేర్లు, రేషన్ కార్డు వివరాలు ఆధార్ కార్డు నంబర్, అకౌంట్ నంబర్, ఐఎఫ్‌ఎస్‌సీ వివరాలు సేకరించాలి. కుటుంబాలు అర్హత కలిగిన వారు అవునో కాదో ఆరు అంచెల పరిశీలన ద్వారా ధ్రువీకరించుకోవాలి. సమాచార సేకరణ గ్రామ వలంటీర్ల ద్వారా ఈ నెల 25 నుంచి వచ్చేనెల 1వ తేదీ వరకు చేపట్టాలి. -సేకరించిన సమాచారాన్ని తిరిగి ప్రధానోపాధ్యాయులకు అందజేయాలి. ఆ సమాచారాన్ని ప్రధానోపాధ్యాయుడు ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్‌లో అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది.
-ముసాయిదా జాబితా సిద్ధం చేసేటప్పటికీ 75 శాతం హాజరు ఉన్నది లేనిదీ పరిశీలించాలి. 75 శాతం హాజరు లెక్క కట్టేటప్పుడు వీలైనంత విద్యార్థి పక్షంగా ఉండాలి.
-వచ్చేనెల 9వ తేదీన గ్రామ సచివాలయంలో జాబితా ప్రకటించాలి. అభ్యంతరాలపై గ్రామస్తులకు వచ్చే నెల 13 వరకు గడువు ఇవ్వాలి.వచ్చేనెల 15 నుంచి 18వ తేదీ లోగా గ్రామసభలో జాబితాను ప్రకటించి ఆమోదం పొందాల్సి ఉంటుంది.
-ఆమోదించిన జాబితా వచ్చేనెల 20వ తేదీ నాటికి ప్రధానోపాధ్యాయులకు అందజేయాలి. సంబంధిత ప్రధానోపాధ్యాయుడు మండల విద్యాశాఖ అధికారి ద్వారా జిల్లా విద్యాశాఖ అధికారికి అదే నెల 23వ తేదీలోగా అందజేయాలి. ∙ప్రధానోపాధ్యాయుడు పాఠశాలకు సంబంధించిన సమాచారాన్ని అప్‌లోడ్ చేసినప్పుడు పేరెంట్స్ కమిటీని తప్పకుండా సంప్రదించాలి.
జిల్లా స్థాయిలో హెల్త్‌లైన్ సెంటర్:
‘జగనన్న అమ్మ ఒడి’ పథకం అర్హులను క్రోడీకిరించే ప్రక్రియలో ఎలాంటి సందేహాలు వచ్చినా ప్రధానోపాధ్యాయు లు సంప్రదించుకోవడానికి జిల్లా స్థాయిలో హెల్ప్‌లైన్ సెంటర్‌ని ఏర్పాటు చేశాం. ఎప్పటికప్పుడు సందేహాలను సత్వరమే నివృత్తి చేసుకోవడానికి ఫోన్: 9440011576, 8008686988 నంబర్లను సంప్రదించాలి.
– జి.నాగమణి, డీఈఓ
Comments
Please login to add a commentAdd a comment