తాడికొండ (గుంటూరు) : రాజధాని నిర్మాణంలో మరో ప్రధాన ఘట్టం సోమవారం ప్రారంభమైంది. భూములు ఇచ్చిన రైతులకు అధికారులు కౌలు చెక్కుల పంపిణీ ప్రారంభించారు. వ్యవసాయ భూములను చదును చేసే ప్రక్రియనూ ఆరంభించారు. భూములు ఎక్కువగా ఇచ్చిన తాడికొండ మండలం నేలపాడు గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమానికి సీఆర్డీఏ కమిషనర్ ఎన్.శ్రీకాంత్, జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, జేసీ సీహెచ్.శ్రీధర్ హాజరయ్యారు. కార్యక్రమానికి నేలపాడు సీఆర్డీఏ అధికారి శ్రీనివాసమూర్తి అధ్యక్షత వహించగా..కమిషనర్ శ్రీకాంత్ మాట్లాడుతూ, భూములు ఇచ్చిన రైతులకు మూడేళ్లలో అభివృద్ధి చేసి అందిస్తామని తెలిపారు. తొలిగా భూములిచ్చిన మహిళారైతు కొమ్మినేని ఆదిలక్ష్మిని అభినందించారు.
భూములు ఇచ్చిన రైతుల వద్ద అంగీకార పత్రాలన్నీ కచ్చితంగా ఉంటే ఏడాదికి రూ.30 వేలు కౌలు అందిస్తున్నట్లు చెప్పారు. ఇక నుంచి అన్ని గ్రామాల్లో ఈ ప్రక్రియ ప్రారంభం కానుందన్నారు. వివాదాలు ఉన్న భూములకు సంబంధించి వాటిని పరిష్కరించి రైతులకు కౌలు ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. దాదాపు 80 శాతం భూములు కచ్చితంగానే ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమం ఏడాది వరకు కొనసాగుతుందన్నారు. కలెక్టర్ కాంతి లాల్‌దండే మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజా రాజధానిని నిర్మించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. భూసమీకరణ పూర్తిచేసి సహకరించిన అధికారులంతా గుర్తుండిపోతారని చెబుతూ, తుళ్లూరు తహశీల్దారు సుధీర్‌బాబును అభినందించారు.
సీఎం చంద్రబాబు రైతులతో తన ఆనందాన్ని పంచుకొనేందుకు తుళ్లూరులోనే ఉగాది జరుపుతున్నట్టు చెప్పా రు. జేసీ శ్రీధర్ మాట్లాడుతూ63 రోజుల్లో భూసమీకరణ పూర్తిచేసినట్లు తెలిపారు. రైతుల వద్దనుంచి అగ్రిమెంటు తీసుకొని కౌలు సొమ్ము అందిస్తున్నామన్నారు. ఏటా పది శాతం కౌలు పెరుగుతుందన్నారు. అనంతరం గ్రామంలోని 93 ఎకరాలకు సంబంధించి 36 మంది రైతులకు రూ. 27.93 లక్షల సొమ్ముకు చెక్కులు అందించారు. సర్పంచ్ ధనేకుల సుబ్బారావు పొలాన్ని దున్ని అభివృద్ధిని ప్రారంభించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శివశంకర్, ఆర్డీవో భాస్కరనాయుడు, ఎంపీపీ పద్మలత, నాయకులు దామినేని శ్రీనివాసరావు, రైతులు పాల్గొన్నారు.
రాజధాని రైతుకు కౌలు సొమ్ము
Published Tue, Mar 10 2015 1:48 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
Advertisement
Advertisement