బాలారిష్ట నివారిణి , చల్లని చూపుల తల్లి, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి, ఆరోగ్య ప్రదాయినిగా పేరొందిన శ్రీనూకాంబికా అమ్మవారి జాతర బుధవారం నుంచి ప్రారంభం కానుంది. కొత్త అమావాస్యను పురస్కరించుకుని ప్రతిఏటా నిర్వహించే ఈ ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు 12 లక్షల మంది భక్తులు వస్తారని దేవాదాయశాఖ అంచనా వేస్తోంది.
ఆలమూరు పవిత్ర గౌతమీ గోదావరి తీరాన ఉన్న ఆలమూరు మండలం చింతలూరులో అమ్మవారి ఆలయానికి రెండున్నర శతాబ్దాల చరిత్ర ఉంది. చింతలూరు గ్రామ శివారులో ఉన్న పాలచెట్టు తొర్రలో లభించిన ఆమ్మవారి విగ్రహాన్ని అప్పటి పిఠాపురం మహారాజు సహకారంతో ప్రతిష్ఠించినట్టు చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. చంటిపిల్లల పాలిట అమృతవల్లిగా, సకల పాపాలు హరించే మాతృమూర్తిగా విరాజిల్లుతోంది. నూకాంబికా అమ్మవారికి పిల్లలతో కాగడాలు వెలిగిస్తే.. తట్టు, పొంగు, ఆటలమ్మ వంటి వ్యాదులు సోకవని భక్తుల నమ్మకం. జిల్లాకు చెందిన భక్తులు అమ్మవారి జాతరలో వారి పిల్లలతో కాగడాలు వెలిగించడం ఆనవాయితీగా వస్తోంది. నెల రోజుల ముందుగానే మండలంలోని అన్ని గ్రామాల్లో బుట్టగరగ రూపంలో అమ్మవారు ప్రజలకు దర్శనమిస్తారు.
మోదుగుపూల గరగ ప్రత్యేక ఆకర్షణ
రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో లేనివిధంగా శ్రీనూకాంబికా అమ్మవారి పూల ఘటానికి పక్షం రోజుల ముందునుంచే కొత్త, పాత పూల ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ పూలను రోజు విడిచి రోజు మన్య ప్రాంతం నుంచి తీసుకువచ్చిన మోదుగుపూలతో అలంకరిస్తారు. ఈ గరగను నెత్తిన ధరించిన నృత్య కళాకారుడుతో చంటిపిల్లలను దాటిస్తే, రోగాలు దరిచేరవని భక్తుల ప్రగాఢ విశ్వాసం. పూర్వకాలం అమ్మవారికి మూలస్థానం అగ్రహారానికి చెందినవారు జంతుబలి ఇచ్చేవారు. 35 ఏళ్ల క్రితం ఆలయాన్ని దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకోవడంతో బలులు నిషేధించారు. జాతర రోజున అబ్బురపర చే గరగ నృత్యాలు, తీర్థం రోజున గవ్వ నృత్యం, ఉగాది రోజున నిర్వహించే ‘బద్ది కడుగుట’ కార్యక్రమంతో ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ ఉత్సవాలు మే నెల 6 వరకూ జరగనున్నాయి.
భక్తులకు ఏర్పాట్లు పూర్తి
అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లను దేవాదాయ శాఖ పూర్తి చేసింది. క్యూలైన్లు, తాగునీటి వసతి, చంటి పిల్లలకు పాల సరఫరాకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు దేవాదాయ శాఖ తెలిపింది. భక్తులు సేదతీరేందుకు గ్రామంలో పలుచోట్ల చలువపందిళ్లను ఏర్పాటు చేశారు. పారిశుధ్య నిర్వహణకు పంచాయతీ ప్రత్యేక సిబ్బందిని నియమించింది. పెదపళ్ల పీహెచ్‌సీ ఆధ్వర్యంలో ముగ్గురు వైద్యులు సహా 38 మంది ఆరోగ్య, ఆశ సిబ్బంది స్థానిక సబ్ సెంటర్ వద్ద ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తారు. రాజమండ్రి సబ్ కలెక్టర్ విజయ్‌కృష్ణన్ ఆదేశాల మేరకు రామచంద్రపురం, రావులపాలెం, రాజమండ్రి డిపోల నుంచి బస్సు సౌకర్యాన్ని, 108 సేవలను అందుబాటులోకి ఉంచనున్నారు.
పోలీసుల బందోబస్తు
జాతర సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రామచంద్రపురం డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు. డీఎస్పీ నేతృత్వంలో ఇద్దరు సీఐలు, ఆరుగురు ఎస్సైలు, 20 మంది ఏఎస్సైలతో పాటు సుమారు 150 కానిస్టేబుళ్లు, 30 మంది మహిళా కానిస్టేబుళ్లు, 50 మంది హోంగార్డులతో విధులు నిర్వహించనున్నారు.
అమృతవల్లి.. శ్రీనూకాలమ్మ తల్లి
Published Wed, Apr 6 2016 12:50 AM | Last Updated on Sun, Sep 3 2017 9:16 PM
Advertisement
Advertisement