=నేటి అర్ధరాత్రి నుంచి అమలు
=జిల్లాపై రోజుకు రూ.10 లక్షల భారం
=సిటీ బస్సు కనీస చార్జీ రూ.6
=హైదరాబాద్ ప్రయాణికులపై రూ.40 వడ్డన
=బస్‌పాస్‌ల ధరలు యథాతథం
=ప్రజలనెత్తిన సమైక్యాంధ్ర సమ్మె భారం
ప్రజల నెత్తిన మరో గుదిబండ పడనుంది. ఇప్పటికే అన్నిరకాల ధరల భారంతో దిక్కుతోచని స్థితిలో ఉండగా, ఆర్టీసీకి చార్జీల వడ్డనకు సిద్ధమైంది. చార్జీల పెంపు ఫైలుపై సీఎం సంతకం చేయడంతో మంగళవారం అర్ధరాత్రి నుంచే ఇది అమలులోకి రానుంది.
సాక్షి, విజయవాడ : రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ప్రయాణికుల నడ్డివిరిచేందుకు సిద్ధమైంది. సమైక్యాంధ్ర ఉద్యమంతో కోట్ల రూపాయలు నష్టపోయిన ఆర్టీసీని ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆ బాధ్యత నుంచి తప్పుకొని ప్రజలపై చార్జీల మోత మోగించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా పెంచుతున్న చార్జీల ఫైలుపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సోమవారం సంతకం చేశారు. దీంతో మంగళవారం అర్ధరాత్రి నుంచి చార్జీలను పెంచేందుకు అధికారులు నిర్ణయించారు.
జిల్లావాసులపై రూ.10 లక్షల భారం
ఆర్టీసీకి కృష్ణా రీజియన్‌లో 1,400 వరకు బస్సులు ఉన్నాయి. వాటి ద్వారా ప్రతిరోజు ఆర్టీసీకి రూ.కోటీ 20 లక్షల ఆదాయం వస్తుంది. ప్రస్తుత చార్జీలు పెంచడం వల్ల అది రూ.కోటీ 30 లక్షలకు చేరుతుంది. ప్రస్తుతం పెరిగిన చార్జీల నేపథ్యంలో రోజుకు రూ.10 లక్షల వరకు ఆదాయం పెరుగుతుందని అధికారులు లెక్కిస్తున్నారు. వారాంతపు, సెలవు రోజుల్లో ఈ ఆదాయం మరికొంత పెరిగే అవకాశం ఉంది. సమైక్యాంధ్ర బంద్ సందర్భంగా జిల్లాలో రూ.85 కోట్ల నష్టం వచ్చింది. ప్రస్తుతం పెరిగిన చార్జీల నేపథ్యంలో రెండేళ్లలో ఉద్యమం వల్ల వచ్చిన నష్టాన్ని పూరించవచ్చని అధికారులు భావిస్తున్నారు.
బస్కెక్కిదిగితే రూ.6 చెల్లించాల్సిందే!
సిటీ బస్సులో ఇప్పటివరకు కనీస చార్జీ రూ.5 ఉంది. కొత్త చార్జీలతో అది రెండు కిలోమీటర్లకు రూ.6కు చేరనుంది. మెట్రో ఎక్స్‌ప్రెస్ కనీస చార్జీని రూ.6 నుంచి రూ.7కు, మెట్రో డీలక్స్ చార్జీ రూ.7 నుంచి రూ.8కి పెంచారు. ఈ విధంగా ప్రతి రెండు కిలోమీటర్లకు రూపాయి చొప్పున పెరుగుతూ పోతుందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. దూరప్రాంతాలకు వెళ్లే ఎక్స్‌ప్రెస్, డీలక్స్, ఇంద్ర, గరుడ బస్సుల చార్జీలు కూడా పెరగనున్నాయి. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే ఎక్స్‌ప్రెస్ బస్సుకు కనీసం రూ.19 పెరగ్గా, గరుడ, గరుడ+ సర్వీసులకు రూ.40 చొప్పున చార్జీలు పెరుగుతున్నాయి.
వెన్నెల బస్సుల చార్జీలు మాత్రం పెంచలేదు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గరుడ బస్సులో గతంలో రూ.377 చార్జీ వసూలు చేయగా మంగళవారం అర్ధరాత్రి నుంచి రూ.417 చార్జీ వసూలు చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే రిజర్వేషన్ టిక్కెట్ తీసుకున్నవారి వద్ద అదనంగా చార్జీలు వసూలు చేయరు. సీజన్ టిక్కెట్ల చార్జీ రూ.650 నుంచి రూ.700కు పెరగనుంది. స్టూడెంట్ బస్‌పాస్ చార్జీలు యథాతథంగా ఉంటాయి.
ఏడాది తరువాత పెరిగిన చార్జీలు
ఆర్టీసీ చివరిగా 2012 సెప్టెంబర్‌లో చార్జీలను పెంచింది. అప్పటి నుంచి ప్రతి నెలా ఎంతో కొంత డీజిల్ చార్జీలు పెరుగుతున్నా చార్జీలు పెంచలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు డీజిల్ ధర లీటరుకు రూ.7.50 పెరిగిందని, తప్పని పరిస్థితుల్లో ఆ భారం ప్రజలపై వేయాల్సి వస్తోందని అధికారులు సమర్థించుకుంటున్నారు. డీజిల్‌పై రాష్ట్ర ప్రభుత్వం విధించే పన్ను ఎత్తివేస్తే ఆర్టీసికి నష్టాలు తగ్గి ఆ మేరకు ప్రజలపై భారం తగ్గించవచ్చని ఆర్టీసీ కార్మిక సంఘాలు చెబుతున్నాయి. ప్రభుత్వం కళ్లు తెరిచి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ప్రజలపై భారం తగ్గించాలని కోరుతున్నారు.