భువనగిరి, న్యూస్‌లైన్: పాల సేకరణ ధరను బుధవారం నుంచి పెంచుతున్నట్టు నల్లగొండ-రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ, సహకార సంఘం (నార్మాక్) చైర్మన్ గుత్తా జితేందర్‌రెడ్డి తెలిపారు. ఇది పాడి రైతులకు నూతన సంవత్సర కానుక అని ఆయన చెప్పారు. భువనగిరి మిల్క్ చిల్లింగ్ సెంటర్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాణ్యమైన గేదెపాలు లీటరుకు రూ.46 నుంచి రూ.50కి, ఆవుపాల ధర రూ. 21.97 నుంచి రూ.23.22కు పెంచినట్లు జితేందర్‌రెడ్డి చెప్పారు. ఎన్నో ఒడిదొడుకులు ఎదురవుతున్నా రైతుల ప్రయోజనమే ధ్యేయంగా నార్మాక్ ముందుకు సాగుతోందన్నారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటూ, సంక్షేమ పథకాలను అందిస్తోందన్నారు. ప్రైవేట్ డెయిరీల పోటీని తట్టుకుంటూ ఎల్లకాలం రైతులకు అందుబాటులో ఉండి సేవలందించే సంస్థ నార్మాక్ మాత్రమేనని ఆయన స్పష్టంచేశారు.
ప్రస్తుతం కరెంట్ చార్జీలు, ఉద్యోగుల జీతాలు, డీజిల్ చార్జీలు పెరిగినా అనవసరపు ఖర్చులను తగ్గించుకుని రైతులకు అధిక రేటు చెల్లిస్తున్నామన్నారు. గతంలో రైతుల నుంచి సేకరించిన రూపాయి కన్వర్షన్ చార్జీలు సుమారు రూ.2 కోట్ల 11 లక్షలను సంక్రాంతి నుంచి సుమారు 60మంది రైతులకు చెల్లిస్తామని తెలిపారు. ప్రస్తుతం లక్షా యాభైవేల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయని చెప్పారు. ఇందులో కేవలం లక్ష లీటర్ల పాలను మాత్రమే అమ్ముతున్నామని, మిగతా పాలతో ఇతర ఉత్పత్తులు తయారు చేసి విక్రయిస్తున్నామని ఆయన చెప్పారు. ఇందులో మిల్క్ కేక్, కర్డ్‌కప్స్, బట్టర్‌మిల్క్, పన్నీర్, వెన్న, నెయ్యి తయారు చేసి అమ్ముతున్నట్లు చెప్పారు. తమ డీలర్లతో పాటు, అన్ని మిల్క్ చిల్లింగ్ సెంటర్లలో వీటిని అమ్మకానికి పెడుతున్నట్లు చెప్పారు. శుభకార్యాలకు ఆర్డర్లపై పెరుగును సరఫరా చేయనున్నట్లు వివరించారు. విలేకరుల సమావేశంలో సంస్థ ఎండీ సురేష్‌బాబు, జీఎం రమేష్, డెరైక్టర్లు కాయితి వెంకట్‌రెడ్డి, పి. భూపాల్‌రెడ్డి, చిన్నన ర్సింహారెడ్డి, ఎన్. భిక్షపతి, శ్రీశైలం, పట్నం అమరేందర్ పాల్గొన్నారు.
పాడిరైతుకు ‘కొత్త’ కానుక
Published Wed, Jan 1 2014 12:32 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement
Advertisement