అనా‘రోగ్యశ్రీ’ | Ana 'rogyasri' | Sakshi

అనా‘రోగ్యశ్రీ’

Feb 28 2014 2:11 AM | Updated on Aug 20 2018 4:22 PM

అనా‘రోగ్యశ్రీ’ - Sakshi

అనా‘రోగ్యశ్రీ’

నిరుపేదకు జబ్బు చేస్తే కార్పొరేట్ వైద్యం అందించాల్సిన ఆరోగ్యశ్రీ పథకం అనారోగ్యానికి గురైంది. ప్రభుత్వ అసమర్థ విధానాలు, రిఫరల్ ఆస్పత్రుల ధనదాహంతో ఈ పథకం అస్తవ్యస్తంగా మారింది.

  • పేదలకు అందని కార్పొరేట్ వైద్యం
  •  చికిత్స మధ్యలోనే గెంటేస్తున్న వైనం
  •  అదనంగా డబ్బు గుంజుతున్న ఆస్పత్రులు
  •  చోద్యం చూస్తున్న అధికారులు
  •  విజయవాడ, న్యూస్‌లైన్ : నిరుపేదకు జబ్బు చేస్తే కార్పొరేట్ వైద్యం అందించాల్సిన ఆరోగ్యశ్రీ పథకం అనారోగ్యానికి గురైంది. ప్రభుత్వ అసమర్థ విధానాలు, రిఫరల్ ఆస్పత్రుల ధనదాహంతో ఈ పథకం అస్తవ్యస్తంగా మారింది. ప్రాణాపాయస్థితిలో ఉన్న రోగి తెల్లకార్డు తీసుకుని ఆస్పత్రికి వెళ్తే మీకు ఆరోగ్యశ్రీ వర్తించదు, డబ్బులు చెల్లించాలని చెప్పడంతో దిక్కుతోచని స్థితిలో ప్రభుత్వాస్పత్రికి పయనమవుతున్నారు. మరికొందరు.. ఉన్న ఆస్తులు అమ్మి వైద్యం చేయించాల్సిన దుస్థితి నెలకొంటోంది.

    నిరుపేదకు జబ్బు చేస్తే పైసా ఖర్చు లేకుండా కార్పొరేట్ వైద్యం పొందేలా భరోసా ఇస్తూ డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెడితే నేటి ప్రభుత్వం ఆ  పథకాన్ని నీరుగారుస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కార్పొరేట్ ఆస్పత్రులు సైతం నిబంధనలను విస్మరిస్తూ, చికిత్స పొందుతున్న రోగిని మధ్యలోనే గెంటేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. అందుకు ఇటీవల జరిగిన పరిణామాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఆరోగ్యశ్రీ పథకంపై సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఈ దుస్థితి నెలకొందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
     
    నిర్లక్ష్యానికి సాక్ష్యాలివే...

    తోట్లవల్లూరుకు చెందిన 65 సంవత్సరాల వృద్ధుడు గుండెజబ్బుతో ఓ ఆస్పత్రిలో చేరాడు. అతనికి పరీక్షలు నిర్వహించి వాల్వు పోయిందని నిర్ధారించారు. ఆరోగ్యశ్రీలో గుండె వాల్వు మారుస్తామని, అయితే ఈ పథకంలో వర్తించే వాల్వు ఈ వయసు వారికి సరిపోదని చెప్పి, మరో రూ.35 వేలు చెల్లిస్తే మంచిది వేస్తామన్నారు. అంత మొత్తం చెల్లించలేక, ఆపరేషన్ వాయిదా వేసుకుని మందులు వాడుతూ కాలం వెళ్లదీస్తున్నాడు ఆ పెద్దాయన.
     
    ఏలూరుకు చెందిన ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో తలకు బలమైన గాయం కాగా విజయవాడలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరాడు. అతనికి ఆరోగ్యశ్రీ పథ కం వర్తించే వీలున్నా, వర్తించదంటూ ముక్కుపిండి డబ్బులు వసూలు చేశారు. ఆరోగ్యశ్రీ అయితే తక్కువ ప్యాకేజీ వస్తుందని ఇలా చేసినట్లు సమాచారం. ఇదే ఆస్పత్రిలో తొలుత వ్యాధి నిర్ధారణకు స్కానింగ్‌లు వగైరా వారి డబ్బులతోనే చేయించి, సర్జరీ అవసరమైన వారికి మాత్రమే పథకం వర్తించే విధంగా చూస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
     
    ఇటీవల గన్నవరానికి చెందిన ఆరేళ్ల బాలికకు మొదడు వాపు వ్యాధి రావడంతో అక్కడకు సమీపంలోని ఓ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ పథకంలో చికిత్సకు చేర్చారు. పది రోజులు చికిత్స చేసిన తర్వాత పరిస్థితి విషమించింది మావల్ల కాదంటూ చేతులెత్తేసి బలవంతంగా డిశ్చార్జి చేసేశారు. దీంతో చేసేది లేక ఆ బాలిక తల్లిదండ్రులు విజయవాడలోని ఓ కార్పోరేట్ ఆస్పత్రికి తరలించగా, రూ.50 వేలకు పైగా చికిత్సకు వెచ్చించాల్సిన దుస్థితి నెలకొంది.
     
    ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. ఇలా విజయవాడలోని రిఫరల్ ఆస్పత్రుల్లో అడుగడుగునా రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. గుండె ఆపరేషన్ చేయించుకున్న వారికి ఆరు నెలలు మందులు ఉచితంగా ఇవ్వాల్సి ఉండగా, రెండు, మూడునెలలు ఇచ్చి, అనంతరం డబ్బులు వెచ్చించి కొనుగోలు చేయాలని చెబుతున్నట్లు పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక ఆరోగ్యశ్రీ పథకంలో నిర్వహించిన సర్జరీలు నిర్వహించిన రోగులకు రెండు, మూడు నెలల తర్వాత ఇన్‌ఫెక్షన్‌లు సోకితే తమకు సంబంధం లేదని చేతులెత్తేస్తున్నారు. దీంతో ఏంచేయాలో తెలియని దుస్థితిలో ప్రభుత్వాస్పత్రిని ఆశ్రయిస్తున్నారు.

    ఇటువంటి వారు నిత్యం ఆర్థోపెడిక్, సర్జరీ వార్డులకు వస్తున్నట్లు ఆ విభాగాలకు చెందిన వైద్యులే చెబుతున్నారు. ఆరోగ్యశ్రీ పథకంలో డబ్బులు కార్పొరేట్ ఆస్పత్రులు పొందితే, ఇన్‌ఫెక్షన్‌కు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స చేయాల్సిన దుస్థితి నెలకొంటున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఆరోగ్యశ్రీలో జరుగుతున్న బాగోతంపై జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ జీవన్‌కుమార్‌ను న్యూస్‌లైన్ వివరణ కోరగా సరైన వైద్యం అందకపోతే ట్రస్టుకు ఫిర్యాదు చేయాలని.. సదరు ఆస్పత్రిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement