
వాతావరణ బీమాను పునఃసమీక్షించాలి: కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి
సాక్షి, అనంతపురం/ధర్మవరం: వాతావరణ బీమాతో రైతులకు నష్టం కలుగుతోందని, ఏదో ఒకటి రెండు చోట్ల కురిసిన వర్షం ఆధారంగా బీమా వర్తింపజేయడం వల్ల రైతులందరికీ నష్టం జరుగుతోందని. దీనిపై పునఃసమీక్ష చేయాలని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ప్రభుత్వానికి విన్నవించారు. శుక్రవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ, ధర్మవరం నియోజకవర్గంలో రైతులు రూ. 500 ప్రీమియం చెల్లిస్తే కేవలం రూ.300 బీమా దక్కిన సంఘటనలు ఉన్నాయని గుర్తు చేశారు. గతంలో పంట నష్టం ఆధారంగా బీమాను ఇచ్చేవారని గుర్తుచేశారు. అందువల్ల బీమా విషయంలో ప్రభుత్వం పునఃసమీక్షించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా మూడు నాలుగు నియోజకవర్గాలకు కలిపి ఒక మార్కెట్ యార్డు ఉందనీ, దీంతో రైతుల సమస్యలు పరిష్కరించడానికి ఇబ్బంది కలుగుతోందన్నారు. నియోజకవర్గానికి ఒక మార్కెట్ యార్డు ఏర్పాటు చేస్తే పరిపాలన సులభతరంగా ఉంటుందన్నారు. అలాగే రైతులకు వడ్డీలేని రుణాలు మంజూరు చేయడం, పెట్టుబడి సాయం, ఉచిత బోర్ల పథకం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహనరెడ్డికి ఎమ్మెల్యే కేతిరెడ్డి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
టీడీపీ హయాంలో రైతులు కూలీలుగా మారారు
చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో వ్యవసాయాన్ని చిన్నచూపు చూడటంతో రాష్ట్రంలో వ్యవసాయ రంగం పూర్తిగా కుదేలైందని ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అత్యల్ప వర్షపాతం నమోదయ్యే అనంతపురం జిల్లాలో రైతులు ఇతర ప్రాంతాల్లో దినసరి కూలీలుగా మారిపోయారన్నారు. టీడీపీ హయాంలో 1,160 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వాటిని అప్పటి ప్రభుత్వం అంగీకరించే పరిస్థితిలో కూడా లేకపోయిందన్నారు. ఈ నేపథ్యంలో తమ నాయకుడు వైఎస్ జగన్‌మోహనరెడ్డి రైతు భరోసా యాత్ర నిర్వహించి, బలవన్మరణాలు చేసుకున్న రైతుల కుటుంబాలకు అండగా నిలిచారన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తూనే బంగారం విడిపిస్తామని చెప్పిన చంద్రబాబు రైతులందరినీ మోసం చేయడంతో అనంతపురం జిల్లాలోనే రూ.1,600 కోట్ల విలువైన బంగారాన్ని బ్యాంకులు వేలం వేశాయని గుర్తు చేశారు. అనంతపురం జిల్లాలో చుక్కనీరు లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే... రెయిన్‌గన్ల పేరిట రూ.160 కోట్లు, వాటి నిర్వహణ పేరిట మరో రూ.100 కోట్లు దుర్వినియోగం చేశారని దుయ్యబట్టారు. రైతులకు స్పిక్లర్లు/డ్రిప్ కావాలన్నా, హార్టికల్చర్ రుణాలు కావాలన్నా జన్మభూమి కమిటీలు సంతకం పెడితేనే ఇచ్చే దుస్థితి ఉండేదని గుర్తు చేశారు.
ఆరోగ్యశ్రీని బాబు నిర్వీర్యం చేశారు : సిద్దారెడ్డి
కదిరి: చంద్రబాబు తన హయాంలో ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేశారని కదిరి ఎమ్మెల్యే డా.పెడబల్లి వెంకట సిద్దారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ, వైఎస్సార్ హయాంలో ఎంతోమంది పేదలు ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఖరీదైన వైద్యం అందుకున్నారని గుర్తు చేశారు. 108 వాహనం కుయ్..కుయ్ అని రోడ్డుపై వెళ్తుంటే ప్రజలంతా వైఎస్సార్‌ను గుర్తు చేసుకునేవారన్నారు. అందుకే చంద్రబాబు 108తో పాటు ఆరోగ్యశ్రీ పథకానికి నిధులు కేటాయిస్తే మహానేత వైఎస్సార్‌నే ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని కుట్రపన్ని ఆ పథకాలను నిర్వీర్యం చేశారన్నారు. బాబు పాలనలో ఆసుపత్రులు దారుణంగా ఉండేవన్నారు. ఓ ఆస్పత్రిలో చిన్నారిని ఎలుకలు కొరుక్కుతినగా... మరో ఆస్పత్రిలో స్ట్రెచ్చర్ లేక ఓ మహిళ తన భర్తను ర్యాంపుపై ఈడ్చుకెళ్లిన దృశ్యంతో పాటు ఆపరేషన్ థియేటర్‌లో కరెంటు లేక సెల్‌ఫోన్ టార్చ్‌లైట్ వెలుతురులో ఆపరేషన్లు చేసిన సంఘటనలు రాష్ట్ర ప్రజలంతా చూశారన్నారు. చంద్రబాబు తన 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని అవినీతికి ఉపయోగించాడన్నారు. పసికందును ఎలుక కొరికిందంటూ ఎలుకలు, బల్లులు పట్టడానికి ప్రజల సొమ్ము మింగేశారని మండిపడ్డారు. ఒక ఎలుకను పట్టుకుంటే రూ.10 వేలు, బల్లిని పట్టుకుంటే రూ.3 వేల చొప్పున బిల్లులు వసూలు చేశారన్నారు. ఇలా అనంతపురం ఆసుపత్రిలోనే రూ.45 లక్షలు బిల్లులు తినేసిన విషయాన్ని పత్రికల్లో చూశానని సిద్దారెడ్డి తన ప్రసంగంలో పేర్కొన్నారు.
ప్రతి మండలానికీఒక 108 వాహనం
ముఖ్యమంత్రి జగనన్న ప్రభుత్వంలో ప్రతి మండలానికి ఒక 108 వాహన ఏర్పాటుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించడం ఆనందంగా ఉందన్నారు. పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీకి నిధులు కేటాయించారని గుర్తు చేశారు. మాటలు రాని ఎంతోమందికి తన సొంత ఖర్చులతో మా నాయకుడు కాక్లియర్ ఇంప్లాంటేషన్ ఆపరేషన్ చేయించారన్నారు. ఆరోగ్యశ్రీ కోసం ఈ ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించిందని, రూ. 5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారందరికీ ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందే విధంగా చర్యలు తీసుకున్నారనీ, అలాగే వైద్యం బిల్లు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ ద్వారా చెల్లించే విధంగా జగనన్న ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. రెండు ప్రభుత్వ మెడికల్ కళాశాలలతో పాటు ఒక అడ్వాన్స్‌డ్ కిడ్నీ సెంటర్, ఒక అడ్వాన్స్‌డ్ క్యాన్సర్ సెంటర్ ఏర్పాటుకు జగనన్న ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించిందని ఆయన గుర్తు చేశారు.
స్త్రీలను కించపరిచే పోస్టులపై చర్యలు తీసుకోండి : ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్
కళ్యాణదుర్గం: మహిళలను కించపరిచేలా సామాజిక మాధ్యమాలలో పోస్టింగ్‌లు చేసినా.. అనుచిత వ్యాఖ్యలు పొందుపరిచినా కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్ డిమాండ్ చేశారు. విజయవాడలో శుక్రవారం నిర్వహించిన మహిళా రక్షణ భద్రతా కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
మహిళలపై వేధింపులు, సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన పోస్టింగ్‌లపై ఆమె డీజీపీ గౌతం సవాంగ్, డీఎస్పీ సరితలతో చర్చించారు. వాట్సఫ్, ఫేస్‌బుక్, ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాల్లో మహిళలపై అనుచిత పోస్టింగ్‌లు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి వాటిపై మహిళలు కూడా వెంటనే ఫిర్యాదుల చేయాలని సూచించారు.
సాగు, తాగునీటి సమస్య పరిష్కరించండి
శింగనమల: తన నియోజకవర్గంలో నెలకొన్న సాగు, తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి విన్నవించారు. శాసనసభ సమావేశాల సందర్భంగా శుక్రవారం ఆమె ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు.
సీఎంకు వినతిపత్రం అందజేస్తున్న ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి
నియోజకవర్గంలోని శింగనమల, గార్లదిన్నె, బుక్కరాయసముద్రం, నార్పల, పుట్లూరు, యల్లనూరు మండలాల్లో నెలకొన్న తాగు నీటి సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా నియోజకవర్గంలో ప్రధాన సమస్య అయిన సాగునీరు అందించాలని కోరారు. సాగునీటికోసం రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, భూగర్భజలం తగ్గిపోయి...బోర్లలోనీళ్లురాక పండ్ల తోటలు ఎండిపోయాయని సీఎంకు వివరించారు. అలాగే నియోజకవర్గంలోని నార్పల, కల్లూరు గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చాలని కోరారు. నార్పలలో డీగ్రీ కళాశాలతో పాటు ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు చేయాలని, శింగనమలలో బీసీ బాలికల గురుకుల పాఠశాల ఏర్పాటు చేయాలని విన్నవించారు. అన్నీ ఎంతో ఓపికగా విన్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment