MLAs performance
-
శాసనసభలో ఎమ్మెల్యేల తొలి గళం ప్రజాపక్షం
ఈ నెల 11 నుంచి ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడీవేడిగా సాగాయి. 14 రోజుల పాటు సాగిన ఈ సమావేశాలు మంగళవారంతో ముగిసాయి. జిల్లా సమస్యలు, నియోజకవర్గ సమస్యలపై ప్రజా గొంతుకను జిల్లా మంత్రి శంకరనారాయణతో పాటు అధికార పార్టీ ఎమ్మెల్యేలు వినిపించారు. తమ ప్రాంతాల్లో ప్రధానంగా నెలకొన్న సమస్యలు ప్రస్తావించారు. తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన మంత్రితో పాటు పుట్టపర్తి, కదిరి, రాప్తాడు, కళ్యాణదుర్గం, గుంతకల్లు, శింగనమల, తాడిపత్రి ఎమ్మెల్యేలు ‘అధ్యక్షా’ అంటూ తమదైన శైలిలో సమస్యలు ప్రస్తావిస్తూ సీనియర్లను సైతం మైమరిపించారు. తొలిసారి అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కల్పించిన ప్రజలకు కృతజ్ఞతలు చెబుతూ సమస్యలపై మాట్లాడిన వారి తీరు ఆకట్టుకుంది. కాగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అసెంబ్లీ సమావేశాలకు మూడు రోజులు హాజరైనా మైకు మాత్రం పట్టుకోలేదు. జిల్లా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రస్తావించిన సమస్యలు.. వారి మాటల్లోనే.. – అనంతపురం ఉద్యాన రైతులను ఆదుకోండి శింగనమల: నియోజకవర్గంలో పండ్ల తోటలు సాగు చేసే రైతులను ఆదుకోవాలంటూ శాసనసభ సాక్షిగా ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి కోరారు. మంగళవారం శాసనసభ సమావేశాల్లో ఆమె మాట్లాడారు. మిడ్ పెన్నార్ డ్యాం నుంచి నియోజకవర్గంలోని ఆయకట్టుకు నీటి కేటాయింపులున్నా.. కొన్నేళ్లుగా నీటిని విడుదల చేయకపోవడంతో రైతులు దిక్కుతోచనిస్థితిలో ఉన్నారన్నారు. అత్యధికంగా సాగవుతున్న చీనీ, జామ తోటలను కాపాడుకునేందుకు రైతులు అప్పులు చేసి ట్యాంకర్ల ద్వారా నీటిని వదులుకుంటున్నారని గుర్తు చేశారు. బోర్లు వేసి అప్పుల ఊబిలో కూరుకుపోయి.. చివరకు ఆత్మహత్యల వైపు మొగ్గు చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల గార్లదిన్నె మండలం ముకుందాపురం గ్రామంలో రైతు సుబ్బయ్య ఆత్మహత్య ఇలాంటిదేనని గుర్తు చేశారు. నియోజకవర్గంలో ఉద్యాన పంటలను సాగు చేసే రైతులను ఆదుకోవాలని కోరారు. ఉద్యావన పంటల సాగును గత ప్రభుత్వం పోత్సహించ లేదన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో 2004 నుంచి ఐదేళ్లు పండ్ల తోటల సాగుకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చారన్నారు. ఎంఐటీహెచ్ రాష్ట్ర ప్లాన్, ఆర్కేవీవై ప్లాన్ కింద 7,325 మంది లబ్ధిదారులను చేరుస్తూ రైతులకు రూ.16.68 కోట్లు ఆర్థిక సాయం అందించారని గుర్తు చేశారు. వైఎస్సార్ చొరవ వల్లనే అప్పట్లో అనంతపురానికి హార్టికల్చర్ జిల్లాగా పేరు వచ్చిందని తెలిపారు. ఆయన మరణానంతరం వచ్చిన ప్రభుత్వాలు ఈ పథకాన్ని కొనసాగించడంలో అంతులేని నిర్లక్ష్యాన్ని కనబరచాయని విమర్శించారు. ఇలాంటి తరుణంలో జిల్లా రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి పండ్ల తోటల రైతులను ఆదుకోవాలని సూచించారు. మంత్రి కన్నబాబు స్పందన.. ‘ఉద్యాన పంటలను పోత్సహించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చర్యలు తీసుకున్నారు. శింగనమల నియోజకవర్గంలో 38,573 హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగులో ఉన్నాయి. నీటి ఎద్దడి కారణంగా ఎండిపోతున్న ఉద్యాన పంటలకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందించేందుకు గత ప్రభుత్వం ట్యాంకర్‌కు రూ.500 ఇస్తే, మన ప్రభుత్వం రూ.600 చెల్లించేలా ముఖ్యమంత్రి ఆదేశాలు ఉన్నాయి. ఈ మొత్తాన్ని వర్షాలు సమృద్ధిగా కురిసే వరకూ చెల్లిస్తాం. ఎండిపోయిన చెట్లను తొలగించి, తిరిగి పంటలను వేసుకునేందుకు ఉద్యాన శాఖ ద్వారా హెక్టారుకు రూ.20 వేలు ఆర్థిక సాయం అందిస్తాం. చిరుధ్యానాల సాగును పోత్సహించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతున్నాం.’ అంటూ ఎమ్మెల్యే పద్మావతికి వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు సమాధానమిచ్చారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్ చారిత్రాత్మకం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లు ప్రవేశపెట్టడం చారిత్రాత్మకం. అసెంబ్లీలో సీఎం జగన్ ప్రవేశపెట్టిన బిల్లులతో రాజారామ్మోహన్ రాయ్ లాంటి సంఘ సంస్కర్తగా కీర్తింపబడుతున్నారు. లాలించే స్థాయి నుంచి పాలించే స్థాయికి మహిళలకు ఎదగడానికి గొప్ప అవకాశం ఇచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడం గొప్పవిషయం. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల ముందు ప్రకటించిన నవరత్న పథకాలు అమలు చేయడానికి బడ్జెట్లో పెద్దపీట వేశారు. అనంతపురం జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నట్లు కనిపించింది. రైతులను మహారాజులుగా చేయాలన్న సంకల్పంతోనే బడ్జెట్లో కేటాయింపులు ఉన్నాయి. – ఉషశ్రీచరణ్, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఎన్టీఆర్ తర్వాత వైఎస్సే రాయలసీమ ప్రాంతానికి నీళ్లు అందించేందుకు చర్యలు తీసుకున్న వారిలో ఎన్టీఆర్ తర్వాతి స్థానం వైఎస్ రాజశేఖర్‌రెడ్డిదే. ఎపీ భూభాగం నుంచే గోదావరి జలాలను శ్రీశైలం సాగర్‌కు మళ్లించాలి. మన భూభాగం నుంచే గోదావరి జలాలను మళ్లించి సాగు, తాగునీటి ప్రాజెక్టులకు పారిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. పొరుగు రాష్ట్రాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడే పరిస్థితి మనకు వద్దు. భూ యాజమాన్య బిల్లును స్వాగతిస్తున్నాం. ఇదేమి కొత్త బిల్లు కాదు, దేశ వ్యాప్తంగా భూ హక్కులపై ఉన్న సమస్యలను కేంద్రం కూడా గుర్తించింది. – పయ్యావుల కేశవ్, ఉరవకొండ ఎమ్మెల్యే వెనుకబడిన కులాల్లో వెలుగులు ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్రెడ్డి 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేసినప్పుడు లక్షలాదిమంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు తమ ఇబ్బందులు ఏకరవు పెట్టారు. ఆయా వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం మొత్తం ఐదు బిల్లులు ప్రవేశపెట్టడం చారిత్రాత్మకం. దేశంలోనే ఇది అరుదైన ఘట్టం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల పట్ల ముఖ్యమంత్రికి ఉన్న ప్రేమ, వారి సమస్యల పరిష్కారం పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి తెలియజేస్తోంది. ఈ రోజు బీసీల అభ్యన్నతి కాంక్షిస్తూ శాశ్వత కమిషన్ ఏర్పాటుతో వారి కష్టాలు తొలిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వెనుకబడిన తరగతుల పురోభివృద్ధి, సాధికారత కోసం పటిష్టమైన బీసీ కమిషన్ ఏర్పాటు చేసింది. 2014 ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతి కులానికో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత నిలువునా మోసగించారు. బీసీలను కేవలం కులవృత్తులకే పరిమితం చేయాలనే దిగజారుడు ఆలోచన చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కుల వృత్తులే కాకుండా నామినేటడ్ పదవులు, నామినేషన్ పనుల్లో 50 శాతం ఇస్తామంటూ గొప్ప నిర్ణయం తీసుకున్న మహానుభావుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. – మాలగుండ్ల శంకరనారాయణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి, పెనుకొండ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి దార్శనికతకు నిదర్శనం రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం చట్టాలు తీసుకువస్తూనే మరోవైపు అవినీతి నిరోధానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నూతన బిల్లులు తీసుకువస్తున్నారు. అందులో భాగంగానే లోకాయుక్త సవరణ బిల్లు, జుడీషియల్ బిల్లులు ప్రవేశపెట్టారు. లోకాయుక్త కమిషన్‌ను ఏర్పాటు చేయాలంటే హైకోర్టు జస్టిస్‌ను నియమించాల్సి ఉంది. దేశంలో న్యాయమూర్తుల కొరత ఉండడంతో సమస్యగా మారింది. దేశంలో మొత్తం 1,079 మంది న్యాయమూర్తులు అవసరముండగా కేవలం 534 మంది న్యాయమూర్తులు, 132 మంది అదనపు న్యాయమూర్తులు మాత్రమే అందుబాటులో ఉన్నారు. రాష్ట్రంలో 28 మంది న్యాయమూర్తులు, 9 మంది అదనపు న్యాయ మూర్తులు అవసరముండగా 13 మంది న్యాయమూర్తులు మాత్రమే అందుబాటులో ఉన్నారు. – కాపురామచంద్రారెడ్డి, ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే ఆరోగ్యశ్రీ నిర్వీర్యం వైఎస్ హయాంలో ఎంతోమంది పేదలు ఖరీదైన వైద్యాన్ని ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా కార్పొరేట్ ఆస్పత్రుల్లో పొందారు. అలాంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని చంద్రబాబు హయాంలో నిర్వీర్యం చేశారు. పసికందును ఎలుక కొరికిందంటూ ఎలుకలు, బల్లులు పట్టడానికి రాష్ట్రవ్యాప్తంగా టెండర్లు పిలిచి పెద్ద మొత్తంలో ప్రజల సొమ్ము మింగేశారు. ఒక ఎలుకను పట్టుకుంటే రూ.10వేలు, బల్లిని పట్టుకుంటే రూ.3 వేలు చొప్పున బిల్లులు చేశారు. అనంతపురం ఆస్పత్రిలోనే రూ.45 లక్షలు బిల్లులు స్వాహా చేశారనే విషయాన్ని పత్రికల్లో చూశాం. ఆరోగ్యశ్రీ కోసం ప్రస్తుత ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. వైద్య చికిత్సల బిల్లు రూ. వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ ద్వారా చెల్లించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. – డాక్టర్ పీవీ సిద్దారెడ్డి, కదిరి ఎమ్మెల్యే రైతులు కూలీలుగా మారారు గత ముఖ్యమంత్రి చంద్రబాబు ఐదేళ్ల పాలనలో వ్యవసాయాన్ని చిన్నచూపు చూశారు. ఫలితంగా ఆ రంగం కుదేలైంది. అత్యల్ప వర్షపాతం నమోదయ్యే అనంతపురం జిల్లాలో రైతులు కూలీలుగా మారారు. టీడీపీ హయాంలో 1,160 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వాటిని అప్పటి ప్రభుత్వం అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో బలవన్మరణాలకు పాల్పడ్డ రైతు కుటుంబాలకు తమ నాయకుడు వైఎస్ జగన్మోహనరెడ్డి రైతు భరోసా యాత్రతో అండగా నిలిచారు. పంటలకు వాతావరణ బీమాతో నష్టం కలుగుతోందని, ఏదో ఒకటి రెండు చోట్ల కురిసిన వర్షం ఆధారంగా బీమాను ఇవ్వడం వల్ల రైతులందరికీ నష్టం జరుగుతోంది. ధర్మవరం నియోజకవర్గంలో రైతులు రూ. 500 ప్రీమియం చెల్లిస్తే కేవలం రూ.300 బీమా దక్కిన సంఘటనలూ ఉన్నాయి. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. – కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, ధర్మవరం ఎమ్మెల్యే హంద్రీ–నీవా పనులు వెంటనే పూర్తి చేయాలి వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పడు మడకశిర నియోజకవర్గంలోని కరువు పరిస్థితులు, రైతుల కష్టాలను గుర్తించి హంద్రీనీవా ద్వారా సాగు నీరు అందించడానికి చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా మడకశిర బ్రాంచ్ కెనాల్‌ను ప్రత్యేకంగా మంజూరు చేశారు. దీనిద్వారా నియోజకవర్గంలోని 168 చెరువులకు సాగునీరు అందించడానికి వీలుగా ప్రణాళిక రూపొందించి పనుల కోసం రూ.కోట్ల నిధులను మంజూరు చేశారు. మడకశిర ప్రాంతానికే కాకుండా హిందూపురంలో 48 చెరువులు, పెనుకొండ నియోజకవర్గంలోని 31 చెరువులకు సాగునీరు అందించడానికి చర్యలు చేపట్టారు. వైఎస్ హయాంలో 80 శాతం పూర్తి చేశారు. ఆయన అకాల మరణంతో పనులు ఆగి పోయాయి. ఈ పనులను పూర్తి చేయడంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. వెంటనే పనులను పూర్తి చేసి మడకశిర ప్రాంతానికి హంద్రీ–నీవా ద్వారా సాగునీటిని అందించేలా చూడాలి. – డాక్టర్ తిప్పేస్వామి, మడకశిర ఎమ్మెల్యే రూ. కోట్లు దోచిపెట్టారు మాజీ సీఎం చంద్రబాబు హయాంలో విద్యుత్ ఛార్జీలు పెంపును నిరసిస్తూ ధర్నా చేసిన రైతులను లాఠీలతో కొట్టించి కాల్పులు జరిపారు. ప్రైవేటు విద్యుత్ సంస్థల నుండి అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేసి ఏపీ ట్రాన్స్‌కో, ఏపీ జెన్కోలను నాశనం చేశారు. వైఎస్సార్ హయాంలోనే విద్యుత్ ప్రాజెక్టులు పూర్తి చేసి మిగులు విద్యుత్తు సాధిస్తే ఆ ఘనత తనదని చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుచేటు. రీనవబుల్ ఎనర్జీ ఆబ్లిగేషన్లకు మించి సోలార్, విండ్ ఎనర్జీలను కేవలం 6 కంపెనీలతో కొనుగోలు చేసి రూ.3 వేల కోట్లు ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారు. రాష్ట్రంలో మిగులు ఉత్పత్తి ఉన్నా సోలార్, విండ్ ఎనర్జీలను కొనుగోలు చేయాల్సిన అవసరం ఏముంది. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. – దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, పుట్టపర్తి ఎమ్మెల్యే సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతిని వెలికితీయాలి సాగునీటి ప్రాజెక్టులలో అంచనాలు పెంచుకొని టీడీపీ పాలకులు చేసిన దోపిడీపై సమగ్ర విచారణ చేపట్టాలి. అనంతపురం జిల్లాలో చేపట్టిన హంద్రీ–నీవా కాలువ పనులతో పాటు చాలా ప్రాజెక్టులను చంద్రబాబు ప్రభుత్వం బినామీలకు అప్పగించింది. నిర్మాణపు అంచనాలు పెంచుకొని నిధుల దోచేశారు. అప్పటి మంత్రి పరిటాల సునీత, ఇతర ఎమ్మెల్యేల అండతో కోట్లాది రూపాయలు ప్రజాసొమ్మును స్వాహా చేశారు. విచారణ జరిపించి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి. కరువు పరిస్థితులతో ఇబ్బందులు పడుతున్న రాప్తాడు నియోజకవర్గ రైతాంగాన్ని ఆదుకొనేందుకు లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలి. నియోజకవర్గంలో కొత్తగా ఏర్పాటు చేసే సాగునీటి రిజర్వాయర్లతో పాటు ప్రజల తాగునీటి సమస్యలను తీర్చేందుకు నిధులు కేటాయించాలి. – తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, రాప్తాడు ఎమ్మెల్యే భూ యాజమాన్య చట్టంతో హక్కుదారులకు భద్రత ఏపీ భూ యాజమాన్య చట్టం ద్వారా భూ యజమానికి భద్రతతో పాటు హక్కులు లభిస్తాయి. ల్యాండ్ మాఫియా ఆగడాలు, భూ కబ్జాలు జరగవు. భూ వివాదాలు, నేరాలు గణనీయంగా తగ్గిపోతాయి. ఈ బిల్లు వల్ల భూ యజమానులకు మేలు జరుగుతుంది. అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో 30 వేల ఎకరాలకు పైగా భూమిని మాజీ సీఎం చంద్రబాబు లాక్కొని అన్నదాతల నోట మట్టి మట్టికొట్టారు. టీడీపీ నాయకులు విచ్చలవిడిగా భూకబ్జాలకు పాల్పడ్డారు. టీడీపీ ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనే ల్యాండ్ మాఫియా రెచ్చిపోయింది. ల్యాండ్ మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేయాలనే సదుద్దేశంతోనే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఏపీ భూ యాజమాన్య హక్కుల చట్టం అమలుకు శ్రీకారం చుట్టింది. ఇది శుభపరిణామం. ఈ చట్టం అమలులోకి వస్తే ప్రతి ఒక్కరికీ వారి భూమిపై పూర్తి హక్కు లభిస్తుంది. ఒక్కసారి భూరికార్డులో యజమానిగా నమోదైతే రికార్డులో పొరపాట్ల వల్ల నష్టం జరిగితే ప్రభుత్వమే పరిహారం కూడా చెల్లించేలా చట్టాన్ని రూపొందించడం గర్వకారణం. భూవివాదాల పరిష్కారానికి దోహదపడే ఈ చట్టానికి శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నా. – వై.వెంకటరామిరెడ్డి, గుంతకల్లు ఎమ్మెల్యే -
అసెంబ్లీలో అనంత ఎమ్మెల్యేల వాణి
వాతావరణ బీమాను పునఃసమీక్షించాలి: కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సాక్షి, అనంతపురం/ధర్మవరం: వాతావరణ బీమాతో రైతులకు నష్టం కలుగుతోందని, ఏదో ఒకటి రెండు చోట్ల కురిసిన వర్షం ఆధారంగా బీమా వర్తింపజేయడం వల్ల రైతులందరికీ నష్టం జరుగుతోందని. దీనిపై పునఃసమీక్ష చేయాలని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ప్రభుత్వానికి విన్నవించారు. శుక్రవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ, ధర్మవరం నియోజకవర్గంలో రైతులు రూ. 500 ప్రీమియం చెల్లిస్తే కేవలం రూ.300 బీమా దక్కిన సంఘటనలు ఉన్నాయని గుర్తు చేశారు. గతంలో పంట నష్టం ఆధారంగా బీమాను ఇచ్చేవారని గుర్తుచేశారు. అందువల్ల బీమా విషయంలో ప్రభుత్వం పునఃసమీక్షించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా మూడు నాలుగు నియోజకవర్గాలకు కలిపి ఒక మార్కెట్ యార్డు ఉందనీ, దీంతో రైతుల సమస్యలు పరిష్కరించడానికి ఇబ్బంది కలుగుతోందన్నారు. నియోజకవర్గానికి ఒక మార్కెట్ యార్డు ఏర్పాటు చేస్తే పరిపాలన సులభతరంగా ఉంటుందన్నారు. అలాగే రైతులకు వడ్డీలేని రుణాలు మంజూరు చేయడం, పెట్టుబడి సాయం, ఉచిత బోర్ల పథకం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి ఎమ్మెల్యే కేతిరెడ్డి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ హయాంలో రైతులు కూలీలుగా మారారు చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో వ్యవసాయాన్ని చిన్నచూపు చూడటంతో రాష్ట్రంలో వ్యవసాయ రంగం పూర్తిగా కుదేలైందని ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అత్యల్ప వర్షపాతం నమోదయ్యే అనంతపురం జిల్లాలో రైతులు ఇతర ప్రాంతాల్లో దినసరి కూలీలుగా మారిపోయారన్నారు. టీడీపీ హయాంలో 1,160 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వాటిని అప్పటి ప్రభుత్వం అంగీకరించే పరిస్థితిలో కూడా లేకపోయిందన్నారు. ఈ నేపథ్యంలో తమ నాయకుడు వైఎస్ జగన్మోహనరెడ్డి రైతు భరోసా యాత్ర నిర్వహించి, బలవన్మరణాలు చేసుకున్న రైతుల కుటుంబాలకు అండగా నిలిచారన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తూనే బంగారం విడిపిస్తామని చెప్పిన చంద్రబాబు రైతులందరినీ మోసం చేయడంతో అనంతపురం జిల్లాలోనే రూ.1,600 కోట్ల విలువైన బంగారాన్ని బ్యాంకులు వేలం వేశాయని గుర్తు చేశారు. అనంతపురం జిల్లాలో చుక్కనీరు లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే... రెయిన్గన్ల పేరిట రూ.160 కోట్లు, వాటి నిర్వహణ పేరిట మరో రూ.100 కోట్లు దుర్వినియోగం చేశారని దుయ్యబట్టారు. రైతులకు స్పిక్లర్లు/డ్రిప్ కావాలన్నా, హార్టికల్చర్ రుణాలు కావాలన్నా జన్మభూమి కమిటీలు సంతకం పెడితేనే ఇచ్చే దుస్థితి ఉండేదని గుర్తు చేశారు. ఆరోగ్యశ్రీని బాబు నిర్వీర్యం చేశారు : సిద్దారెడ్డి కదిరి: చంద్రబాబు తన హయాంలో ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేశారని కదిరి ఎమ్మెల్యే డా.పెడబల్లి వెంకట సిద్దారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ, వైఎస్సార్ హయాంలో ఎంతోమంది పేదలు ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఖరీదైన వైద్యం అందుకున్నారని గుర్తు చేశారు. 108 వాహనం కుయ్..కుయ్ అని రోడ్డుపై వెళ్తుంటే ప్రజలంతా వైఎస్సార్‌ను గుర్తు చేసుకునేవారన్నారు. అందుకే చంద్రబాబు 108తో పాటు ఆరోగ్యశ్రీ పథకానికి నిధులు కేటాయిస్తే మహానేత వైఎస్సార్‌నే ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని కుట్రపన్ని ఆ పథకాలను నిర్వీర్యం చేశారన్నారు. బాబు పాలనలో ఆసుపత్రులు దారుణంగా ఉండేవన్నారు. ఓ ఆస్పత్రిలో చిన్నారిని ఎలుకలు కొరుక్కుతినగా... మరో ఆస్పత్రిలో స్ట్రెచ్చర్ లేక ఓ మహిళ తన భర్తను ర్యాంపుపై ఈడ్చుకెళ్లిన దృశ్యంతో పాటు ఆపరేషన్ థియేటర్లో కరెంటు లేక సెల్‌ఫోన్ టార్చ్‌లైట్ వెలుతురులో ఆపరేషన్లు చేసిన సంఘటనలు రాష్ట్ర ప్రజలంతా చూశారన్నారు. చంద్రబాబు తన 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని అవినీతికి ఉపయోగించాడన్నారు. పసికందును ఎలుక కొరికిందంటూ ఎలుకలు, బల్లులు పట్టడానికి ప్రజల సొమ్ము మింగేశారని మండిపడ్డారు. ఒక ఎలుకను పట్టుకుంటే రూ.10 వేలు, బల్లిని పట్టుకుంటే రూ.3 వేల చొప్పున బిల్లులు వసూలు చేశారన్నారు. ఇలా అనంతపురం ఆసుపత్రిలోనే రూ.45 లక్షలు బిల్లులు తినేసిన విషయాన్ని పత్రికల్లో చూశానని సిద్దారెడ్డి తన ప్రసంగంలో పేర్కొన్నారు. ప్రతి మండలానికీఒక 108 వాహనం ముఖ్యమంత్రి జగనన్న ప్రభుత్వంలో ప్రతి మండలానికి ఒక 108 వాహన ఏర్పాటుకు బడ్జెట్లో నిధులు కేటాయించడం ఆనందంగా ఉందన్నారు. పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీకి నిధులు కేటాయించారని గుర్తు చేశారు. మాటలు రాని ఎంతోమందికి తన సొంత ఖర్చులతో మా నాయకుడు కాక్లియర్ ఇంప్లాంటేషన్ ఆపరేషన్ చేయించారన్నారు. ఆరోగ్యశ్రీ కోసం ఈ ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించిందని, రూ. 5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారందరికీ ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందే విధంగా చర్యలు తీసుకున్నారనీ, అలాగే వైద్యం బిల్లు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ ద్వారా చెల్లించే విధంగా జగనన్న ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. రెండు ప్రభుత్వ మెడికల్ కళాశాలలతో పాటు ఒక అడ్వాన్స్డ్ కిడ్నీ సెంటర్, ఒక అడ్వాన్స్డ్ క్యాన్సర్ సెంటర్ ఏర్పాటుకు జగనన్న ప్రభుత్వం ఈ బడ్జెట్లో నిధులు కేటాయించిందని ఆయన గుర్తు చేశారు. స్త్రీలను కించపరిచే పోస్టులపై చర్యలు తీసుకోండి : ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్ కళ్యాణదుర్గం: మహిళలను కించపరిచేలా సామాజిక మాధ్యమాలలో పోస్టింగ్‌లు చేసినా.. అనుచిత వ్యాఖ్యలు పొందుపరిచినా కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్ డిమాండ్ చేశారు. విజయవాడలో శుక్రవారం నిర్వహించిన మహిళా రక్షణ భద్రతా కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. మహిళలపై వేధింపులు, సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన పోస్టింగ్‌లపై ఆమె డీజీపీ గౌతం సవాంగ్, డీఎస్పీ సరితలతో చర్చించారు. వాట్సఫ్, ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాల్లో మహిళలపై అనుచిత పోస్టింగ్‌లు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి వాటిపై మహిళలు కూడా వెంటనే ఫిర్యాదుల చేయాలని సూచించారు. సాగు, తాగునీటి సమస్య పరిష్కరించండి శింగనమల: తన నియోజకవర్గంలో నెలకొన్న సాగు, తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి విన్నవించారు. శాసనసభ సమావేశాల సందర్భంగా శుక్రవారం ఆమె ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. సీఎంకు వినతిపత్రం అందజేస్తున్న ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి నియోజకవర్గంలోని శింగనమల, గార్లదిన్నె, బుక్కరాయసముద్రం, నార్పల, పుట్లూరు, యల్లనూరు మండలాల్లో నెలకొన్న తాగు నీటి సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా నియోజకవర్గంలో ప్రధాన సమస్య అయిన సాగునీరు అందించాలని కోరారు. సాగునీటికోసం రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, భూగర్భజలం తగ్గిపోయి...బోర్లలోనీళ్లురాక పండ్ల తోటలు ఎండిపోయాయని సీఎంకు వివరించారు. అలాగే నియోజకవర్గంలోని నార్పల, కల్లూరు గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చాలని కోరారు. నార్పలలో డీగ్రీ కళాశాలతో పాటు ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు చేయాలని, శింగనమలలో బీసీ బాలికల గురుకుల పాఠశాల ఏర్పాటు చేయాలని విన్నవించారు. అన్నీ ఎంతో ఓపికగా విన్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి తెలిపారు. -
ఎమ్మెల్యేల పనితీరుపై కేటీఆర్ ఫైర్
సాక్షి ప్రతినిధి, వరంగల్: ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదంటూ పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కుండబద్ధలు కొట్టారు. ‘అధికారులు పని చేయడం లేదంటూ సాకులు చెప్పొద్దు, ఎన్నికల పరీక్షను ఎదుర్కోబోయేది మీరేనంటూ’దిశానిర్ధేశం చేశారు. శనివారం వరంగల్‌కు వచ్చిన మంత్రి కేటీఆర్ అర్బన్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో గ్రేటర్ వరంగల్ పరి«ధిలో చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా స్మార్ట్ సిటీ, హృదయ్, అమృత్, డబుల్ బెడ్రూం పథకాలపై సమీక్ష నిర్వహించారు. పనులు ముందుకు సాగకపోవడం, బడ్జెట్లో వరంగల్‌కు కేటాయించిన రూ. 300 కోట్లను ఇప్పటీకీ ఖర్చు చేయకపోవడంతో మంత్రి కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు.. ‘సారీ... మీ వ్యవహారం ఏం బాగాలేదు. వేలకోట్ల నిధులున్నా ఒక్క పైసా ఖర్చుచేయటం లేదు. రెండున్నరేళ్ల క్రితం ముఖ్యమంత్రి.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ఇంత నిర్లక్ష్యమా... ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకేం సమాధానం చెబుతామనుకుంటున్నారు. నిధులున్నా పనులు చేయించుకోలేక పోతున్నారు. అధికారులంటే అరవై ఏళ్లకు రిటైర్ అవుతారు. కానీ, మీ సంగతేంటి. మరో సంవత్సరంలో మీకు పరీక్షలు (ఎన్నికలు) ఉంటాయి. ప్రజాప్రతినిధులు సాకులు చెపుతూ తప్పించుకోవడం పద్ధతి కాదు. కొన్ని చోట్ల ప్రజలు నిర్మాణాలు వద్దంటే నోటీసులు ఇచ్చి వాటిని రద్దు చేసి ఇతర ప్రదేశాల్లో నిర్మించాలి. అంతే తప్ప పనుల్ని ఆపేస్తారా?.. అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌ను ఉద్దేశించి ‘ఎమ్మెల్యే గారు, మీరు రోజూ హైదరాబాద్ వస్తారు. ఇక్కడేమో పనులు పెండింగ్‌లో ఉన్నాయి. నిధులకు కొదవలేదు. మీరు మాత్రం హైదరాబాద్ వచ్చినప్పుడు ఈ విషయాలు మాట్లాడరు’ అన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లకు సంబంధించి తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలతో పనిలేదని గ్రేటర్ పరిధిలో ఎక్కడ స్థలం ఉంటే అక్కడ నిర్మాణాలు చేపట్టాలని అన్నారు. అనంతరం మరో అంశంపై చర్చను కొనసాగించేందుకు ప్రయత్నించగా, ‘ఇక చాలు ఎంతసేపు రివ్యూ చేసినా మీరిచ్చే సమాధానాలు ఇలాగే ఉంటాయి.. సమావేశం ముగిస్తున్నా’నంటూ మంత్రి వెళ్లిపోయారు. అంతకు ముందు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలకు సంబం«ధించి వెంటనే టెండర్లు పిలిచి 24వ తేదీలోగా హైదరాబాద్ వచ్చి పరిపాలన అనుమతులు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. -
ఎమ్మెల్యేల పనితీరుకు మార్కులు
► టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ చేయించిన సర్వే ఫలితాలు ► 6 నెలల కాలంలో భారీగా పడిపోయిన ఎమ్మెల్యేల పనితీరు ► ఎమ్మెల్యేల పనితీరు మార్చుకోవాలని సూచించిన అధినేత ► జిల్లాలో మెజార్టీ స్థానాలు గెలుచుకోనున్నట్లు వెల్లడి సాక్షి, మహబూబ్‌నగర్ : ఎమ్మెల్యేల పనితీరుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్వహించిన సర్వే ఒక్కసారిగా రాజకీయ వేడి రగిల్చింది. జిల్లాలోని ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా మార్కులు వేశారు. తాజాగా వెలువడిన సర్వే ఫలితాలు ఎమ్మెల్యేలలో ఒక్కసారిగా గుబులు పుట్టించాయి. 6నెలల వ్యవధిలోనే ఎమ్మెల్యేల పనితీరు భారీగా పడిపోయినట్లు సర్వేలో వెల్లడైంది. ఎమ్మెల్యేల పనితీరును కాస్త మార్చుకోవాలని సుతిమెత్తగా హెచ్చరించారు. జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరుపై వచ్చిన మార్కులతో సీఎం కాస్త అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. కేవలం 6నెలల కాలంలోనే దాదాపు 20శాతం పైగా పడిపోయారని వివరించారు. అయితే ఎమ్మెల్యేలు తమ పనితీరును మార్చుకుంటే సునాయాసంగా గెలుపొందవచ్చని, వచ్చే ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మొత్తం 119స్థానాలకుగానూ దాదాపు 106 వరకు గెలుపొందుతామని పేర్కొన్నారు. అదేవిధంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కూడా మెజార్టీ స్థానాలు గెలుపొందుతామని స్పష్టం చేశారు. ఎన్నికల వేడి రగిల్చిన సర్వే.. రానున్న రెండేళ్లలో జరగనున్న సాధారణ ఎన్నికలకు రాజకీయ పార్టీలు అప్పుడే సన్నద్ధమవుతున్నాయి. 2014 సాధారణ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 14నియోజకవర్గాలకుగాను 7 స్థానాలు టీఆర్ఎస్ గెలుపొందగా.. 5 కాంగ్రెస్, 2టీడీపీ గెలుపొందాయి. రాష్ట్ర స్థాయిలో మారిన పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్, టీడీపీల నుంచి ఒక్కొక్క ఎమ్మెల్యే టీఆర్ఎస్లో చేరారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బలం 9కి చేరింది. ఈ నేపథ్యంలో వచ్చే సాధారణ ఎన్నికలను ప్రధాన రాజకీయ పార్టీలు ఒక సవాలుగా తీసుకున్నాయి. అందుకు అనుగుణంగా ఎప్పటికప్పుడు సర్వేలు చేయిస్తూ గెలుపు గుర్రాలను చూసుకుంటున్నారు. నెల రోజుల క్రితం పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సర్వే నిర్వహించగా... తాజాగా సీఎం కేసీఆర్ సర్వేలను బయటపెట్టడంతో ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. ఫస్ట్‌క్లాస్ మార్కులే రాలే... ఉమ్మడి మహబూబ్‌నగర్ జి ల్లాలో కేవలం ముగ్గురు మాత్ర మే ఫస్ట్ క్లాస్ మార్కులు సాధిం చినట్లు సీఎం సర్వే ద్వారా వెలుగుచూసింది. వీరిలో టీఆర్ఎస్ నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మాత్ర మే 67.40శాతం సాధించారు. మిగతా ఇద్దరు అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ 71.10శాతం, గద్వాల ఎమ్మెల్యే 65శాతం లభించింది. 6నెలల్లో నే ఎమ్మెల్యేల పనితీరు బాగా పడిపోయింది. సరాసరిగా ప్రతీఒక్క ఎమ్మెల్యే 20శాతం మేర పడిపోయారు. ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖమంత్రి డా.సి.లక్ష్మారెడ్డి 6నెలల క్రితం 73.20శాతంలో ఉంటే జనవరిలో నిర్వహించిన సర్వేలో 51.40 శాతానికి పడిపోయారు. అదే విధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు 6నెలల క్రితం 62.50శాతం ఉండగా... తాజా సర్వేలో 55.20కు తగ్గింది. కొడంగల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి 6నెలల క్రితం 56.80శాతం ప్రజల మద్దతు లభించగా... ప్రస్తుతం 49.80శాతం ఉన్నట్లు వెల్లడైంది. సుతిమెత్తగా హెచ్చరింపు... జిల్లాలోని టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం కాస్త అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. పనితీరు మార్చుకోకపోతే వేటు తప్పదని హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. పనితీ రు ఆధారంగా.. సర్వేల ఆధారంగానే పార్టీ తరఫున టిక్కెట్లు ఇవ్వనున్నట్లు సంకేతాలు జారీ చేశారు. సాధారణ ఎన్నికలకు మరో రెండేళ్లు ఉ న్న నేపథ్యంలో ఎమ్మెల్యేలందరూ పద్ధతి మార్చుకోవాలని సూచించినట్లు సమాచారం. ఎవరు ఎలాంటి స్థితిలో ఉన్నారో సర్వే ద్వారా తెలియజేశారు. ఇక నుంచి జనం మధ్యలో తిరుగుతూ.. వారి సమస్యలను పరిష్కరించాలని సుతిమెత్తగా హెచ్చరించారని పార్టీ వర్గాలు తెలిపాయి. -
ఈటల టాప్
► మంత్రి కేటీఆర్‌కు తొలి, రెండో సర్వేకు10.20 శాతం తేడా ► ముగ్గురు ఎమ్మెల్యేలకు అత్తెసరు మార్కులు ► పలువురు ఎమ్మెల్యేలకు ఏటా తగ్గిన గ్రాఫ్ ► జగిత్యాలలో పుంజుకున్న ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ► ఎమ్మెల్యేలపై అధికార పార్టీ సర్వే విడుదల ► ప్రజల మనోభావాలను కళ్లకు కట్టిన సీఎం కేసీఆర్ ► జనంతో మమేకం కావాలని ఉద్బోధ ► ఏటా పెరుగుతూ వచ్చిన రాజేందర్ పనితీరు ► ఉమ్మడి జిల్లాలో 89.90 శాతం జనం మెచ్చిన నేత సాక్షి, కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల పనితీరును గులాబీ దళపతి, ముఖ్యమంత్రి కేసీఆర్ వారి కళ్లకు కట్టారు. తెలంగాణ తొలి ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారి పనితీరు, రెండు విడతలు నిర్వహించిన సర్వే ఫలితా లను వెల్లడించారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి జిల్లాల వారీగా సర్వే నివేదికల ఆధారంగా సమీక్ష జరిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన మంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతల జాతకాన్ని ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 12 కాగా.. శాసనసభ్యులు, శాసనసభ నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల పనితీరు, టీఆర్ఎస్ పార్టీ, ఇతర పార్టీల బలాబలాలను కేసీఆర్ వివరించారు. ప్రజాక్షేత్రంలో ఉండే వారికి ప్రజల వేసిన మార్కులను వివరించడం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. మంత్రి ఈటల రాజేందర్‌కు ఫస్ట్ ర్యాంకు.. తొలి సర్వే, రెండో సర్వేకు భారీ తేడా.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై టీఆర్ఎస్ నిర్వహించిన సర్వేలో హుజూరాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు ప్రజలు ఫస్ట్ ర్యాంకు ఇచ్చారు. ఏటా ఆయన ప్రజలకు చేరువవుతున్నట్లు సర్వే నివేదికలు చెబుతున్నాయి. కాగా.. టీఆర్ఎస్ శాసనసభ్యులుగా ఎన్నికైన తరువాత 2015–16 సంవత్సరం సెప్టెంబర్, అక్టోబర్ మాసంలో మధ్య ఆ పార్టీ మొదట సర్వే జరిపించింది. తొలి సర్వేలో మంచి మార్కులు సాధించిన వారు కూడా రెండో సర్వేలో దారుణంగా వెనుకబడడం గమనార్హం. మంత్రి ఈటల రాజేందర్ తొలి సర్వేలో 73.50 శాతంగా ఉంటే.. రెండో సర్వే నాటికి ఆయన పనితీరు 89.90 శాతానికి పెరిగింది. ఆ తర్వాత ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ తొలి సర్వేలో 42.60 శాతం మార్కులు రాగా, రెండో సర్వేలో 47.30 శాతానికి పెరిగింది. సిరిసిల్ల ఎమ్మెల్యే, మంత్రి కేటీఆర్ 70.60 నుంచి 60.40 శాతంగా మారింది. తొలి, రెండో సర్వేలతో పోలిస్తే జిల్లా ఎమ్మెల్యేల్లో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు మార్కులు తగ్గాయి. అదే వరుసలో మంథని ఎమ్మెల్యే పుట్ట మధు, ఆ తర్వాత కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు ఉన్నారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నాలుగు శాతం తేడాతో ఉండగా, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ 88.10 శాతం నుంచి 56 శాతానికి, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్ 67.60 నుంచి 53.90కి, చొప్పదండి ఎమ్మెల్యే 79.40 నుంచి 62.50, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి 75.50 నుంచి 54.20కి తగ్గారు. కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఉపనేత, జగిత్యాల ఎమ్మెల్యే తాటిపర్తి జీవన్‌రెడ్డి తొలి, రెండో సర్వేకు గ్రేడ్ పెరిగింది. తొలి సర్వేలో 50.90 శాతం ఉండగా.. రెండో సర్వే నాటికి 68.90 శాతానికి పెరిగింది. అభివృద్ధి, సంక్షేమం ఎజెండాగా మారాలి... ప్రజలతో మమేకం కావాలి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల మనస్సులో నిలవడంతోపాటు చిరస్థాయి పేరు ప్రఖ్యాతలు పొందాలని రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు సూచించారు. బడ్జెట్ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆయన జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన 13 మంది ఎమ్మెల్యేల పనితీరుపై తాను నిర్వహించిన సర్వే వివరాలను వెల్లడించిన సీఎం 60 శాతానికి పైగా ప్రజల మద్దతు పొందిన ఎమ్మెల్యేలను అభినందించారు. మిగతా వారు కూడా పనితీరు మెరుగుపరుచుకొని ప్రజల్లో చెరగని ముద్ర వేసుకోవాలన్నారు. ప్రజల మద్దతే పనితీరుకు కొలమానమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ప్రాజెక్టుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రజలతో మమేకం అవుతూ పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించాలని సూచించినట్లు తెలిసింది. – ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు -
ఇదీ.. మీ పనితీరు
ఎమ్మెల్యేల పని విధానంపై సర్వేల నివేదిక ∙స్వయంగా వెల్లడించిన సీఎం కేసీఆర్ మీరు మారాలని శాసనసభ్యులకు క్లాస్ లోపాలను సరిదిద్దుకోవాలని ఆదేశం బహిరంగ సభలు నిర్వహించాలని సూచన సర్వేలో ఎర్రబెల్లి ఫస్ట్, వినయ్‌భాస్కర్ సెకండ్ ఆఖరులో ఎమ్మెల్యే రాజయ్య, మంత్రి చందూలాల్ వరంగల్ : అధికార పార్టీలో సర్వే అలజడి నెలకొంది. ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం కేసీఆర్ నిర్వహించిన సర్వే వివరాలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వ కార్యక్రమాలు, ఎమ్మెల్యేల వ్యక్తిగత పనితీరు, ప్రజలకు అందుబాటులో ఉండడం, టీఆర్ఎస్పై ప్రజల స్పందన వంటి అంశాలతో ఈ సర్వే చేయించారు. రెండు దశల్లో చేసిన సర్వే వివరాలను సీఎం కేసీఆర్ స్వయంగా వెల్లడించారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో గురువారం టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం పాత జిల్లాల వారీగా మంత్రులు, శాసనసభ్యులతో సీఎం ప్రత్యేకంగా సమావేశయమ్యారు. ఎమ్మెల్యేల పనితీరుపై నిర్వహించిన సర్వే వివరాలను వారికి స్వయంగా అందజేశారు. కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు ఆశించిన స్థాయిలో లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో అనుకూలత ఉన్నా... స్థానికంగా ఎమ్మెల్యేలపై ప్రతికూలత ఉందని పేర్కొన్నారు. ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా లోపాలను వెంటనే సరిచేసుకోవాలని ఆదేశించారు. టీఆర్ఎస్పై, ఎమ్మెల్యేలపై ప్రతికూలత ఎక్కువగా ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఆదేశించారు. బాగా ప్రతికూలత ఉన్న నియోజకవర్గాల్లో బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని, స్వయంగా తానే ఈ సభలకు హాజరవుతానని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో సమన్వయం చేసుకుని బహిరంగ సభలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కాగా, పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, డోర్నకల్ ఎమ్మెల్యే డి.ఎస్.రెడ్యానాయక్ ఈ సమావేశానికి హాజరుకాలేదు. -
‘బిగాల’ టాప్
‘గణేశ్ గుప్తా’ది ఉమ్మడి జిల్లాలో ఉత్తమ ర్యాంకు గత సర్వేతో పోల్చితే మెరుగైన మంత్రి పోచారం పనితీరు పూర్తిగా పడిపోయిన వేముల, షకీల్, రవీందర్రెడ్డిల ప్రోగ్రెస్ నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశం సర్వేలో వెనుకబాటుకు కారణాలు కూడా వివరించిన కేసీఆర్! డీఎస్, ఎమ్మెల్సీల సేవలు వినియోగించుకోవాలని ఆదేశం సర్వే ఆధారంగా ఎమ్మెల్యేల పనితీరును సమీక్షించిన సీఎం నిజామాబాద్ : ఎమ్మెల్యేల పనితీరు సర్వే నివేదిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గురువారం తెలంగాణభవన్‌లో ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేల పనితీరుపై ప్రత్యేకంగా సమీక్షించారు. టీఆర్ఎస్ఎల్పీ సమావేశం అనంతరం జరిగిన ఈ ప్రత్యేక సమీక్షలో నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల పనితీరును సమీక్షించారు. పనితీరు బాగాలేదని సర్వేలో తేలిన ఎమ్మెల్యేలను సున్నితంగా హెచ్చరించారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఆరు నెలల క్రితం నిర్వహించిన సర్వే నివేదికతో పాటు, జనవరిలో మరోదఫా నిర్వహించిన సర్వే నివేదికను పోల్చుతూ పనితీరు బేరీజు వేశారు. ఈ సమీక్ష సమావేశంలో తొమ్మిది మంది ఎమ్మెల్యేలతోపాటు, రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్, ఎమ్మెల్సీలు డాక్టర్ భూపతిరెడ్డి, డి.రాజేశ్వర్‌రావు, వి.గంగాధర్‌గౌడ్,లు పాల్గొన్నారు. పనితీరు మెరుగు పరుచుకోండి.. పనితీరు బాగాలేని సర్వే నివేదికలో తేలిన ముగ్గురు ఎమ్మెల్యేలను సీఎం కేసీఆర్ సున్నితంగా హెచ్చరించారు. బాల్కొండ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మిషన్ భగీరథ ప్రాజెక్టు వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డిలు తమ పనితీరు మెరుగు పరుచుకోవాలని సీఎం సూచించారు. వాటర్‌గ్రిడ్ సమీక్షలతో హైదరాబాద్‌కే పరిమితం కాకుండా, నియోజకవర్గానికి సమయం కేటాయించాలని ప్రశాంత్‌రెడ్డిని ఆదేశించారు. ఇసుక వివాదం కూడా ప్రశాంత్‌రెడ్డి పనితీరు పడిపోవడానికి కారణమనే అభిప్రాయాన్ని సీఎం వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రస్తుతం కంటే మరింత ఎక్కువ సమయం కేటాయించాలని షకీల్ అహ్మద్, ఏనుగు రవీందర్‌రెడ్డిలను కూడా ఆదేశించారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేల సర్వే నివేదికను పరిశీలిస్తే..72.50 శాతం ఉన్న ఏనుగు రవీందర్‌రెడ్డి పనితీరు 48.80 శాతానికి పడిపోడంపై సీఎం తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. అలాగే వేముల ప్రశాంత్‌రెడ్డి పనితీరు కూడా 67.20 శాతం నుంచి 39.90 శాతానికి తగ్గడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. షకీల్ అహ్మద్ పనితీరు 60.40 శాతం నుంచి 39.40 శాతానికి చేరడాన్ని కేసీఆర్ ప్రస్తావించారు. మొదటి స్థానంలో ‘బిగాల’ తాజా సర్వే నివేదిక ప్రకారం నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్త పనితీరు ఉమ్మడి జిల్లా పరిధిలోని తొమ్మిది మంది ఎమ్మెల్యేల్లో మొదటి స్థానంలో ఉన్నట్లు తేలింది. గత సర్వేతో పోల్చితే ఆయన పనితీరు బాగుందని తెలిపిన వారి శాతం కాస్త తగ్గినప్పటికీ, ఆయన తొమ్మిది మందిలో ప్రథమ స్థానం లభించింది. 74.70 శాతం మంది బిగాల పనితీరు బాగుందని తేల్చారు. గత సర్వేలో ఇది 78 శాతం ఉండేది. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండేలు ఇద్దరు కూడా జిల్లాలో రెండో స్థానంలో నిలిచారు. బాజిరెడ్డి పనితీరు బాగుందని గత సర్వేలో 75.50 శాతం మంది పేర్కొనగా, ఇప్పుడు ఇది 69.30 శాతానికి తగ్గింది. షిండే పనితీరు 60.30 శాతం నుంచి 69.30 శాతానికి పెరిగింది. ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి జిల్లాలో మూడోస్థానంలో ఉన్నారు. 65.70 శాతం మంది ఆయన పనితీరు బాగుందని తేల్చారు. గత సర్వేలో ఈ శాతం 76.80 శాతం మంది జీవన్‌రెడ్డి పనితీరు బాగుందని తేలింది. మెరుగైన మంత్రి పోచారం పనితీరు గత ఆరు నెలల క్రితం నిర్వహించిన సర్వే నివేదికతో పోల్చితే బాన్సువాడ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కామారెడ్డి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్‌ల పనితీరు మెరుగుపడిందని తేలింది. ఉమ్మడి జిల్లాలో తొమ్మిది మంది ఎమ్మెల్యేల్లో వీరిద్దరి పనితీరు బాగాలేదని గత సర్వేలో తేలింది. తాజా సర్వే నివేదికల ప్రకారం వీరి పనితీరు మెరుగైంది. ఆరు నెలల క్రితం పోచారానికి వచ్చే ఓట్లు 45.90 శాతం ఉండగా, ప్రస్తుతం ఇది 61 శాతానికి పెరిగింది. గత సర్వే నివేదిక ప్రకారం గంప గోవర్థన్ పనితీరు ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది మంది ఎమ్మెల్యేల్లో చివరి స్థానంలో ఉండేది. తాజా నివేదిక ప్రకారం ఆయన పనితీరు కాస్త మెరుగుపడింది. గత సర్వే నివేదికలో 42.30 శాతం రాగా, ఇప్పుడు ఇది 54.90 శాతానికి పెరిగింది. డీఎస్ సేవలు వినియోగించుకోండి.. అపార రాజకీయ అనుభవం కలిగిన రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ సేవలను అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు వినియోగించుకోవాలని సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలకు సూచించారు. జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో డీఎస్ అనుచరవర్గం ఉండటంతో తరచూ ఆయన పర్యటనలు తమ నియోజకవర్గాల్లో ఉండేలా చూసుకోవాలని సూచించారు. ముఖ్యంగా బాల్కొండ నియోజకవర్గంపై కాస్త శ్రద్ధ పెట్టాలని కేసీఆర్ డీఎస్‌ను సూచించినట్లు సమాచారం. జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ముగ్గురు ఎమ్మెల్సీలు డాక్టర్ భూపతిరెడ్డి, వి.గంగాధర్‌గౌడ్, డి.రాజేశ్వర్రావులతో సమన్వయం చేసుకుని పనిచేయాలని ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ సూచించారు. సభ్యత్వ నమోదు చేయించండి.. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ సమీక్షలో పాల్గొన్న ప్రజాప్రతినిధులను ఆదేశించారు. నాలుగు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ మేరకు సభ్యత్వ నమోదు పుస్తకాలను త్వరలోనే జిల్లాలకు పంపుతామన్నారు.