
సాక్షి ప్రతినిధి, వరంగల్: ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదంటూ పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కుండబద్ధలు కొట్టారు. ‘అధికారులు పని చేయడం లేదంటూ సాకులు చెప్పొద్దు, ఎన్నికల పరీక్షను ఎదుర్కోబోయేది మీరేనంటూ’దిశానిర్ధేశం చేశారు. శనివారం వరంగల్‌కు వచ్చిన మంత్రి కేటీఆర్ అర్బన్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో గ్రేటర్ వరంగల్ పరి«ధిలో చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా స్మార్ట్ సిటీ, హృదయ్, అమృత్, డబుల్ బెడ్రూం పథకాలపై సమీక్ష నిర్వహించారు.
పనులు ముందుకు సాగకపోవడం, బడ్జెట్‌లో వరంగల్‌కు కేటాయించిన రూ. 300 కోట్లను ఇప్పటీకీ ఖర్చు చేయకపోవడంతో మంత్రి కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు.. ‘సారీ... మీ వ్యవహారం ఏం బాగాలేదు. వేలకోట్ల నిధులున్నా ఒక్క పైసా ఖర్చుచేయటం లేదు. రెండున్నరేళ్ల క్రితం ముఖ్యమంత్రి.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ఇంత నిర్లక్ష్యమా... ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకేం సమాధానం చెబుతామనుకుంటున్నారు. నిధులున్నా పనులు చేయించుకోలేక పోతున్నారు. అధికారులంటే అరవై ఏళ్లకు రిటైర్ అవుతారు.
కానీ, మీ సంగతేంటి. మరో సంవత్సరంలో మీకు పరీక్షలు (ఎన్నికలు) ఉంటాయి. ప్రజాప్రతినిధులు సాకులు చెపుతూ తప్పించుకోవడం పద్ధతి కాదు. కొన్ని చోట్ల ప్రజలు నిర్మాణాలు వద్దంటే నోటీసులు ఇచ్చి వాటిని రద్దు చేసి ఇతర ప్రదేశాల్లో నిర్మించాలి. అంతే తప్ప పనుల్ని ఆపేస్తారా?.. అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌ను ఉద్దేశించి ‘ఎమ్మెల్యే గారు, మీరు రోజూ హైదరాబాద్ వస్తారు. ఇక్కడేమో పనులు పెండింగ్‌లో ఉన్నాయి. నిధులకు కొదవలేదు.
మీరు మాత్రం హైదరాబాద్ వచ్చినప్పుడు ఈ విషయాలు మాట్లాడరు’ అన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లకు సంబంధించి తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలతో పనిలేదని గ్రేటర్ పరిధిలో ఎక్కడ స్థలం ఉంటే అక్కడ నిర్మాణాలు చేపట్టాలని అన్నారు. అనంతరం మరో అంశంపై చర్చను కొనసాగించేందుకు ప్రయత్నించగా, ‘ఇక చాలు ఎంతసేపు రివ్యూ చేసినా మీరిచ్చే సమాధానాలు ఇలాగే ఉంటాయి.. సమావేశం ముగిస్తున్నా’నంటూ మంత్రి వెళ్లిపోయారు. అంతకు ముందు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలకు సంబం«ధించి వెంటనే టెండర్లు పిలిచి 24వ తేదీలోగా హైదరాబాద్ వచ్చి పరిపాలన అనుమతులు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment