బాధిత రైతును అరెస్ట్ చేస్తున్న పోలీసులు
తుళ్లూరురూరల్(తాడికొండ): రాజధానికి భూములు ఇవ్వని రైతులపై ఏడీసీ, సీఆర్‌డీఏ, రెవెన్యూ అధికారుల వేధింపులు పరాకాష్టకు చేరాయి. అనుమతి లేకుండా రైతు పొలంలో అక్రమంగా రోడ్డు నిర్మాణానికి పూనుకోవడమే కాకుండా.. అడ్డుకున్న రైతును ఈడ్చేసి అరెస్టు చేయించారు. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మల్కాపురం గ్రామానికి చెందిన గద్దె రాం మీరాప్రసాద్‌కు వెలగపూడి రెవెన్యూలో పొలం ఉంది. అతను సీఆర్‌డీఏకు భూమి ఇవ్వకపోవడంతో మూడేళ్లుగా అనేక రకాలుగా అధికారులు వేధింపులకు గురిచేస్తున్నారు. శనివారం తెల్లవారుజామున తుళ్లూరు తహసీల్దార్ ఐ.పద్మావతి, సీఐ వి.శ్రీనివాస్‌రెడ్డి, ఇద్దరు ఎస్సైలు, 30 మంది కానిస్టేబుళ్లు, 10 మంది మహిళా కానిస్టేబుళ్లను తీసుకుని సచివాలయం వెనుక నిర్మిస్తున్న ఎన్–9 రహదారి వద్దకు చేరుకున్నారు. డ్రోజర్లు, పొక్లెయిన్లు, లారీల ద్వారా గ్రావెల్‌ను తీసుకొచ్చి రైతు పొలంలో రహదారి నిర్మాణాన్ని చేపట్టారు.
ఈ విషయం తెలుసుకున్న రైతు గద్దె రాం మీరాప్రసాద్ తన కుటుంబసభ్యులు, న్యాయవాదితో అక్కడకు చేరుకున్నారు. తన పొలంలో రహదారి నిర్మాణం చేపట్టడానికి వీలులేదని, హైకోర్టు నుంచి స్టే ఉందని తెలిపారు. రైతుకు సమాచారం ఇవ్వకుండా ఎలా నిర్మిస్తారని తహసీల్దారును ప్రశ్నించగా.. ఆయన వద్ద ఎలాంటి సమాధానం లేకపోవడంతో ఏడీసీ అధికారులు రంగంలోకి దిగారు. రహదారి నిర్మాణం చేయడానికి వీలులేదని కోర్టు తెలుపలేదని ఏడీసీ ల్యాండ్స్ డైరెక్టర్ బి.రామయ్య తెలిపారు. హైకోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకువస్తే అప్పుడు పనులు నిలిపేస్తామని చెప్పారు. అనంతరం పోలీసుల సహకారంతో పొలంలో పనులు ప్రారంభించారు. అడ్డుకున్న రైతును పోలీసులు పొలం నుంచి ఈడ్చేశారు.
అండగా నిలిచిన రైతులు, నేతలకు బెదిరింపులు
రైతుకు అండగా వచ్చిన స్థానిక రైతులను, వైఎస్సార్‌సీపీ, సీపీఎం నేతలపై తుళ్లూరు డీఎస్పీ కె.కేశప్ప బెదిరింపులకు దిగారు. ఇది అధికారులు, రైతు విషయమని, ఇంకెవరైనా మాట్లాడినా, కలుగజేసుకున్నా వారిపై కేసులు పెట్టి అరెస్టులు చేస్తామని హెచ్చరించారు. ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ, సీపీఎం నేతలను బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. తమ నిర్మాణ పనులకు ఆటంకం కలిగిస్తున్నారని ఏడీసీ ఈఈ ఎలంగోవన్ తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు రైతు మీరాప్రసాద్‌ను, సీపీఎం రాజధాని డివిజన్ కార్యదర్శి మెరుగుమళ్ల రవిని అరెస్టు చేశారు. సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.
నా భూమిలో నిర్మాణం తొలగిస్తాను
ఈ భూమి నాది. హైకోర్టు స్టేని ఉల్లంఘించి పోలీసులు బలవంతంగా నన్ను నా పొలం నుంచి బయటకు ఈడ్చుకు వచ్చి అరెస్ట్ చేశారు. నన్ను వేధింపులకు గురిచేసిన ప్రతి ఒక్క అధికారిపై చర్యలు తీసుకునేలా కోర్టును ఆశ్రయిస్తాను. గతంలోనూ పోలీసులు నా చొక్కా చించేసి అన్యాయంగా అరెస్ట్ చేశారు. తుళ్లూరు ఎమ్మార్వో పద్మావతి, ఏడీసీ అధికారి రామయ్య, డీఎస్పీ కేశప్ప, సీఐ వి.శ్రీనివాసరెడ్డిపై కోర్టుకు వెళ్తాను. న్యాయం జరిగే వరకు పోరాడతాను. నా పొలంలో నిర్మించిన రోడ్డును తొలగిస్తాను.
– గద్దె రాంమీరాప్రసాద్, బాధిత రైతు
Comments
Please login to add a commentAdd a comment