సాక్షి, కర్నూలు : విఘ్నాలను భగ్నం చేసే వినాయకుడు.. తొలి మానవుడి ఆనవాళ్లున్న నల్లమలలో అక్కడక్కడా కనిపిస్తు తన ప్రాచీనత్వాన్ని, ఆదిదేవుడన్న బిరుదును సార్థకం చేసుకుంటున్నాడు. ఎవరు ఎందుకు అక్కడ ఉంచారో చరిత్ర కందని ఈ వినాయక విగ్రహాలు వివిధ ఆకృతులతో కనిపిస్తు భక్తజనానికి పారవశ్యాన్ని కలిగిస్తున్నాయి.
ఇసుక రాతిపై ఏకదంతుడు
ఆత్మకూరు మండలంలోని కొట్టాల చెర్వు సమీపంలో నల్లమల అడవుల్లో ఉన్న వరదరాజస్వామి ప్రాజెక్ట్ సమీపంలో ఒక చెట్టు కింద ఈ వినాయక విగ్రహం ఉంది. ఇసుక రాతిని వినాయకుడిగా ఎవరో ప్రాచీన శిల్పకారుడు ఈ విగ్రహాన్ని చెక్కినట్లు అర్థమవుతుంది. విగ్రహంపై ఎలాంటి ఆభరణాలు చెక్కి ఉండక పోవడం గమనిస్తే ఇది లోహ యుగానికి ముందుదా అన్న అనుమానమూ కలుగక మానదు. తలపై ఉన్న కిరీటం కూడా ఆకు దొన్నెనో, కర్రతో చేసిందా అన్నట్లుగా ఉంటుందే కాని లోహ కిరీటంగా కనిపించదు.
అష్టభుజ వినాయకుడు..
నాగలూటి వీరభధ్రాలయం సమీపంలో శ్రీశైలం మెట్ల మార్గం వద్ద ఎనిమిది చేతులతో నల్లటి గ్రానైట్ శిలతో ఈ అష్టభుజ వినాయకుడి విగ్రహం ఆకట్టుకుంది. అష్ట కరములతో వివిధ ఆయుధాలను ధరించి ఉన్నాడు. ఎడమ వైపున కుమార స్వామి విగ్రహం కూడా ఉంటుంది. నాగలూటి వీరబధ్రాలయం విజయనగర పాలకులు నిర్మించారని స్థల చరిత్ర చెబుతుంది. దీంతో 14వ శతాబ్దానికి చెందినది తెలుస్తుంది. ఇది చదవండి : రోజురోజుకు పెరిగే యాగంటి బసవయ్య
సిద్ధాపురం వినాయకుడు
సిద్ధాపురంలో ఒక వేప చెట్టు కింద ఈ విగ్రహం కనిపిస్తోంది. సమీపంలోని ముర్తుజావలి దర్గా సమీపంలో వెయ్యేళ్లకు పూర్వం మహా పట్టణం ఉండేది. ఇక్కడ పలు ఆలయాల శిథిలాలు ఉన్నాయి. కోట గోడల రాళ్లను సిద్ధాపురం చెరువు రివిట్ మెంట్‌కు వాడారు. ఆ సందర్భంలో శిథిల పట్టణం నుంచి వినాయక విగ్రహం సిద్ధాపురం గ్రామానికి చేరింది.
గుమ్మిత వినాయకుడు
ఆత్మకూరు అటవీ డివిజన్‌లోని నాగలూటి రేంజ్‌లో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న గుప్త మల్లికార్జున (గుమ్మితం) ఆలయ ఆవరణలో ఈ ప్రాచీన వినాయక విగ్రహం ఉంది. ఈ ఆలయాన్ని 10వ శతాబ్దంలో బాదామి చాళుక్యులు నిర్మించారని స్థల పురాణం తెలుపుతోంది. ఇసుక రాతితో చెక్కిన ఈ విగ్రహం భక్తులను ఆకట్టుకుంటోంది. ఇది చదవండి : వినాయకుని విశిష్ట ఆలయాలు
Comments
Please login to add a commentAdd a comment