గుంతకల్లు రూరల్ : సాయం కోసం వెళ్లిన వారు మృత్యువాడ పడ్డారు. అనంతపురం జిల్లా గుంతకల్లులోని వాసవీ టాకీస్ సమీపంలో ఉన్న మేదరి వీధిలో నిర్మాణంలో ఉన్న ఓ ఇంటిలో ఆదివారం ఉదయం సాయం కోసం వెళ్లిన ఇద్దరు వ్యక్తులు విద్యుదాఘాతానికి గురై మృత్యువాత పడ్డారు. మరో ముగ్గురు వ్యక్తులు కూడా గాయపడ్డారు. మృతుల బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మేదరి వీధిలో ధనుంజయ గుప్తా అనే వ్యాపారి, మేస్త్రీ హనుమేష్ ద్వారా కొత్త భవన నిర్మాణాన్ని చేపట్టాడు. ఆదివారం రెండో అంతస్తులో గ్రిల్ పనులు ప్రారంభించారు. గ్రిల్ బరువు ఎక్కువగా ఉండటంతో సహాయం కోసం అక్కడే హమాలీ పని చేసుకుంటున్న రాముడు(50), అదే సర్కిల్ ఆటో అద్దెకు నడుపుకుంటున్న మారెప్ప(55)ను పిలిచారు.
వీరితో పాటు మరో నలుగురు వ్యక్తులు గ్రిల్‌ను పైకి ఎత్తుతుండగా, ప్రమాదవశాత్తూ వెల్డింగ్ మిషన్‌కు తగిలి విద్యుదాఘాతానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో మేస్త్రీ హనుమేష్ ,హమాలీ పెద్దన్న, రాడ్ బైండర్ నాగరాజు, రాముడు, మారెప్ప విద్యుదాఘాతానికి గురయ్యారు. వీరిలో రాముడు, మారెప్ప అపస్మారక స్థితికి చేరుకున్నారు. బాధితుల్ని వెంటనే బస్టాండు సమీపంలోని ప్రైవేటు నర్సింగ్ హోమ్‌కు తరలించారు. అప్పటికే రాముడు, మారెప్ప మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
సమాచారం తెలిసి ఘటనా స్థలానికి చేరుకున్న మృతుల బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. తన భర్త మృతికి ఇంటి యజమానే బాధ్యత వహించాలని రాముడు భార్య సుంకులమ్మ కుటుంబ సభ్యులతో సహా భర్త మృతదేహంతో నిర్మాణంలో ఉన్న ఇంటి ఎదుట బైఠాయించింది. తనకు కుమారుడు, కూతురు ఉన్నారని, రెండు నె లల్లో కూతురి వివాహం కూడా ఉందని, ఇపుడు ఇలా జరిగిందే.. అంటూ ఆమె బోరున విలపించింది. అనంతరం కొందరు పెద్ద మనుషులు రంగప్రవేశం చేసి ఆందోళన విరమింపజేశారు. టూ టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
సాయం కోసం వెళ్లి మృత్యువాత
Published Mon, Jul 28 2014 2:16 AM | Last Updated on Sat, Sep 2 2017 10:58 AM
Advertisement
Advertisement