
అయ్యో..కృష్ణా!
ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో వరి సాగుకు పెట్టింది పేరుగా నిలిచిన కృష్ణా డెల్టాకు ఈ ఏడాది గడ్డు కాలం దాపురించింది. 2.40 లక్షల హెక్టార్లకు కేవలం ఐదువేల హెక్టార్లలోమాత్రమే ఇప్పటికి వరి నాట్లు పడడం రానున్న కరవు పరిస్థితిని కళ్లకు కడుతోంది. ఈ ఖరీఫ్‌లో వర్షాభావ పరిస్థితిని తలచుకుని రైతులు కంటతడి పెడుతున్నారు. దుక్కులు దున్ని సిద్ధం చేసుకున్న భూములను చూసి బోరుమంటున్నారు.
బాపట్ల : జిల్లాలో వర్షాభావ పరిస్థితి ఖరీఫ్ వరి సాగుపై తీవ్ర ప్రభావం చూపబోతోంది. అన్నదాతకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. గత ఏడాది అధిక వర్షాలతో నట్టేట మునిగిన రైతులను ఈ ఏడాది ప్రతికూల వాతావరణం పరిహసిస్తోంది. ఉభయ గోదావరి జిల్లాలతో పోల్చుకుంటే గుంటూరు జిల్లా రైతులు కూడా ఏమాత్రం వారికి తగ్గకుండా వరి సాగులో పోటీపడుతుంటారు. జిల్లాలో ప్రతి ఏడాది 2.40 లక్షల హెక్టార్లు సాగు సాధారణ విస్తీర్ణం కాగా ఆ మేరకు నాట్లు వేస్తుంటారు. జిల్లాలో 890 మీల్లీమీటర్లు సగటు వర్షపాతం కాగా ప్రతి ఏడాది అదే మోతాదులో వర్షం నమోదవుతుంది.
ఈ ఏడాది మొదటి నుంచి వర్షాభావ పరిస్థితి రైతులను కుంగ దీస్తూనే ఉంది. సగటు వర్షపాతం ఇప్పటికి 440 మీల్లీమీటర్లు మాత్రమే నమోదు కావటంతోపాటు కృష్ణాడెల్టాకు నీరు ఎప్పుడు విడుదల చేస్తారోకూడా స్పష్టత లేదు.
గత వారం తాగునీటి చెరువులకు మాత్రమే నీటిని విడుదల చేసిన అధికారులు అవి సక్రమంగా చెరువులకు చేరే లోపే కాలువల మరమ్మతులకు నోచు కోకపోవటంతో కొన్నిచోట్ల నీటి వృథా ఎక్కువగా కనిపించింది. మరికొన్ని చోట్ల రైతులు ఎక్కడ నారుమళ్లకు పెట్టుకుంటారోనని క్రిమినల్ కేసులు పెడుతామని బెదిరింపులకు పూనుకున్నారు.
ప్రస్తుత పరిస్థితి ఇది... జిల్లాలో వరిసాగు సాధారణ విస్తీర్ణం 2.40 లక్షల హెక్టార్లు కాగా ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు కారణంగా అప్పుడప్పుడుపడిన వర్షం,బోర్లు కింద కలుపుకుని కేవలం ఐదువేల హెక్టార్లలో మాత్రమే నాట్లు వేశారు.
వెదపెట్టే పద్ధతితోనే సేద్యం చేసేందుకు రైతులు సిద్ధమయ్యారు. ప్రస్తుత తరుణంలో నార్లు పోసి నెలరోజులు పెంచితే అప్పుడు కాలువ నీళ్లు వస్తాయనే నమ్మకం లేక పోవటంతో వెద పద్ధతి వైపు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు.
ఎకరాకు పది కిలోల విత్తనాలు వెదపెడితే సరిపోవటంతోపాటు దుక్కిదున్నిట్లే వెద పెడుతున్నారు. ఈ విధానం కొంతమంది రైతులకు ఊరట కలిగించింది. ఈ తరహా నాట్లు కూడా ఎక్కువగా తెనాలి డివిజన్‌లోనే పడ్డాయి.
ధాన్యంపై తీవ్ర ప్రభావం
వర్షాభావ పరిస్థితి ఈ ఏడాది వరి సాగుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
జిల్లాలో 2.40 లక్షల హెక్టార్లు సాధారణ సాగు విస్తీర్ణం కాగా, హెక్టారుకు 75 బస్తాలు చొప్పున ప్రతి ఖరీఫ్ సీజన్‌లో 1.80 కోట్ల బస్తాల ధాన్యం పండుతుంది. మరి ఈ ఏడాది ఆ పరిస్థితి కనిపించడం లేదు. జూన్ నుంచి సెప్టెంబరు వరకు ఖరీఫ్ సీజన్ కాగా, అక్టోబరు నుంచి రబీ సీజన్ కిందకు వస్తోంది.
సాధారణంగా జూన్‌లో తెనాలి డివిజన్‌లో 72 మీల్లీమీటర్లు సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఈ ఏడాది జూన్‌లో 50 మీల్లీమీటర్లు, జూలైలో 140 మీల్లీమీటర్లు వర్షానికి కేవలం 32 మీల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. ఇప్పుడు కృష్ణానదిలో నీటి పరిస్థితిని చూస్తే ఎగువ ప్రాంతాల్లో వర్షాలు సక్రమంగా కురవకపోవటం ఇప్పటి నుంచి విస్తారంగా కురిసినప్పటికీ మరో నెల రోజులు పాటు కాలువల ద్వారా నీరు వచ్చే అవకాశం లేకపోవటంతో కృష్ణాడెల్టాలో వరి సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఇక ఈ ఏడాది ఖరీఫ్ పూర్తిగా ప్రతికూలంగా మారటంతో రబీ లేనట్టేనని వ్యవసాయాధికారులే చెబుతున్నారు.