ఇంత మోసమా!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఏదో ఒక కారణం చూపి రైతుల రుణమాఫీ ఎగ్గొట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేయని ప్రయత్నం లేదు. రుణమాఫీ పొందే లబ్ధిదారుల సంఖ్య తగ్గించడంతో పాటు వారికి సకాలంలో అందకుండా చేయడం కోసం రోజుకో నిబంధనతో ప్రభుత్వం ముందుకొస్తోంది. మొదటి సంతకం అమలుకు ఐదు నెలలు గడిచిపోయినా ఇంకా ఒక కొలిక్కి రాలేదు. రాష్ట్రవ్యాప్తంగా 60 లక్షల ఖాతాలను గుర్తించామని చెబుతూనే ఇంకా సవరణలకు అవకాశం ఉందని, పూర్తి జాబితా రావడానికి మరో నెలరోజులు పడుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
చంద్రబాబు మాట మార్చడం కారణంగా జిల్లాలో మూడోవంతు రైతులు ఈ రుణమాఫీ నుంచి దూరంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఉద్యానవన పంటలకు రుణమాఫీ అందదని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు పూర్తిగా పంట రుణాలకే పరిమితమవుతోంది. ఎన్నికల ముందు అన్ని వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని చెప్పినా, బ్యాంకు అధికారులు కేవలం పంట రుణాలు తీసుకున్నవారి జాబితాలను మాత్రమే సిద్ధం చేసినట్లు సమాచారం.
కొత్త నిబంధనల ప్రకారం రైతు ఎన్ని ఎకరాలు పొలం కలిగి ఉన్నారు. ఎంత సాగు చేశారు. ఏ పంట సాగు చేశారు. ఆ పంటకు బ్యాంకులో ఎకరాకి ఎంత రుణం మంజూరు చేస్తుందనే దానిపై రుణమాఫీ వర్తింపచేస్తారన్న ప్రచారం సాగుతోంది. మరోవైపు బంగారం తాకట్టు పెట్టి రుణం తీసుకున్న వారికి ఈ రుణమాఫీ అమలు అవుతుందా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు బ్యాంకుల్లో బంగారం కుదవపెట్టి రుణం తీసుకున్న వారు రుణాల చెల్లించాలని.. లేనిపక్షంలో బంగారు వేలం వేస్తామని బ్యాంకులు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే కొనకనమిట్లలో సిండికేట్ బ్యాంకు అధికారులు వేలం వేయనున్నట్లు గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు.
చంద్రబాబునాయుడు ప్రకటించిన రుణమాఫీ కారణంగా బ్యాంకులకు రుణాలు తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకర్లు ఈ ఏడాది రైతులకు రుణాలు ఇవ్వడానికి ముందుకు రాలేదు. జిల్లా ఏర్పాటైన తర్వాత ఇప్పటి వరకూ రుణ ప్రణాళిక సిద్ధం కానిది ఈ ఏడాదే అంటే ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన అసలు విషయాన్ని పక్కదోవ పట్టించి చర్చను మరోపైపుకు తిప్పడమేనని రైతు నాయకులు అంటున్నారు.
తక్షణమే రుణమాఫీ అమలు చేయాలి: దుగ్గినేని గోపీనాథ్, రైతు నేత
చంద్రబాబునాయుడు తక్షణమే రుణమాఫీ అమలు చేయాలి. వ్యవసాయ రుణాలకు అమలు చేస్తారా? పంట రుణాలకు అమలు చేస్తారా అన్నది పక్కన పెట్టి అయన ప్రకటించినట్లుగా ఒక్కో కుటుంబానికి లక్షన్నర వరకూ రుణమాఫీని వెంటనే అమలు చేయాలి. ఇప్పటికే ఆరు నెలలు గడిచిపోయాయి. మరింత కాలం రుణమాఫీని జాప్యం చేయడం కోసమే చంద్రబాబునాయుడు రోజుకో ప్రకటన చేస్తున్నారు.
ఇది రైతులను మోసం చేయడమే: మారెడ్డి సుబ్బారెడ్డి, వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు
ఎన్నికల ముందు అన్ని వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబునాయుడు ఇప్పుడు పంట రుణాలు మాత్రమే మాఫీ అని చెప్పడం రైతులను మోసం చేయడమే. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ వర్తింప చేయాలి. కుంటిసాకులు చెప్పి రుణమాఫీని ఇప్పటి వరకూ ఇవ్వకుండా జాప్యం చేయడం వల్ల రైతులకు కొత్త రుణాలు రాకుండా పోయాయి.