ఏఓబీలో ఎర్రదండు | Andhra Odisha border as the Maoists' | Sakshi
Sakshi News home page

ఏఓబీలో ఎర్రదండు

Published Sun, Aug 20 2017 1:30 AM | Last Updated on Tue, Oct 9 2018 2:53 PM

ఏఓబీలో ఎర్రదండు - Sakshi

ఏఓబీలో ఎర్రదండు

⇔  మావోయిస్టుల కంచుకోటగా ఆంధ్రా ఒడిశా సరిహద్దు
⇔  జిల్లాలోనూ బలం పుంజుకునేందుకు వ్యూహం
⇔  వరుస దెబ్బలను తట్టుకుని బలంపెంచుకునే ఎత్తులు
⇔  ఆధునిక సాంకేతికత అందిపుచ్చుకుని అడుగులు
భద్రత విషయంలోనూ మారిన వ్యూహం


చుట్టూ పచ్చదనం పరుచుకున్న విశాలమైన            పర్వతాలు.. వాటిమధ్యలో దట్టమైన అడవులు...  ఇవీ మావోయిస్టుల మనుగడకు స్థావరాలు. ఎదురు దెబ్బలు తింటున్నా... మరింత ఎత్తుకు ఎదగాలనే లక్ష్యం. ఏజెన్సీలో పట్టు నిలుపుకోవాలన్న వ్యూహం. గిరిజనుల్ని తమ దారికి తెచ్చుకునే యత్నం. ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలనే ఆశయం.         ఆ నేతల్లో కొనసాగుతూనే ఉంది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ... అప్పుడప్పుడు తమకు నిత్య శత్రువులైన రక్షణ దళాలకు సవాల్‌ విసురుతూ... పడుతూ... లేస్తూ... ఉద్యమానికి ఊపిరి పోస్తున్న ఎంతోమంది వారిలో స్ఫూర్తి నింపుతున్నారు. ఆంధ్రా ఒడిశా సరిహద్దుకు సన్నిహితులుగా...           విలక్షణ జీవనం గడిపే సాయుధ దళాలుగా...              అందరికీ ఆసక్తిగొలిపే మావోయిస్టుల జీవన శైలిపై ప్రత్యేక కథనం.

సాక్షి ప్రతినిధి, విజయనగరం: పచ్చని అడవిలో అడపా దడపా తుపాకీ గుళ్ల మోత మోగుతుంది. అరుణ కిరణాలు ఖాకీల తూటాలకు నేలకొరుగుతున్నాయి. కొందరిని అంతమొందిస్తే ఉద్యమం ఆగిపోదనీ... ఎన్‌కౌంటర్‌లు ఎన్ని జరిగినా... మరింత ఉత్తేజంతో ముందుకు సాగుతుందనీ... చాటి చెప్పేందుకు మావోయిస్టు అగ్రనేతలు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లో ప్రాణాలు కోల్పోయిన విప్లవ వీరుల వారసులుగా తుపాకీ చేతపట్టి దళం వైపు అడుగులు వేయమంటూ గిరిజనులకు పిలుపునిస్తూనే ఉన్నారు. జిల్లాలోని సాలూరు, మక్కువ, పాచిపెంట, కొమరాడ, గుమ్మలక్ష్మీపురం వంటి మండలాలను ఆనుకుని ఉన్న ఏఓబీ సరిహద్దు అటవీ ప్రాం తం నివురుగప్పిన నిప్పులా... మావోల కంచుకోటగా... నిత్యం ఏదో ఒక సంఘటనతో కలవరపడుతూనే ఉంటోంది.

అప్పుడప్పుడు ఎక్కడో ఒక చోట...
ఏఓబీ కేంద్రంగా ఏజెన్సీలో దళం దశాబ్దాలుగా ఉద్యమం సాగిస్తోంది. ప్రారంభంలో ఉన్నట్లు ప్రస్తుత పరిస్థితులు లేవు. ప్రజా కోర్టులో గిరిజనుడిని చంపేందుకు యత్నిస్తే... దళ సభ్యులపైనే దాడి చేసి గిరిజనులే ఇద్దరిని హతమార్చడం వంటి సంఘటనలు ఆ ఉద్యమాన్ని ప్రశ్నార్థకం చేశా యి. మరోవైపు దళ సభ్యుల లొంగుబాట్లు కుంగదీశాయి. ఒకప్పుడు విజయనగరం జిల్లా సరిహద్దు మండలాల్లో విస్తృతంగా కొనసాగిన మావోయిస్టు కార్యకలాపాలు క్రమంగా కనుమరుగయ్యాయి. అలాగని పూర్తిగా సమసి పోలేదు. అప్పుడప్పుడు... ఏదో ఒక సందర్భంలో తామున్నామంటూ ఏదో ఒక సంఘటనతో ఉనికిని చాటుకుంటున్నారు. పోలీసులకు సవాల్‌ విసురుతూ ముందుకు సాగుతున్నారు.

ఆదినుంచీ వ్యూహాత్మక భద్రత
మావోయిస్టుల కార్యకలాపాలన్నీ ఆశ్యర్యంగా, ఆసక్తిగా ఉంటాయి. ముఖ్యంగా వారి భద్రతా విధానాలు. ఏఓబీకి కేంద్ర కమిటీ సభ్యులు వచ్చినప్పుడు, పోలీసులు తమ శిబిరాలపై దాడులు చేసినప్పుడు మావోయిస్టులు మూడంచెల భద్రత విధానాన్ని అనుసరిస్తుంటారు. అయితే దానిలో లోపాలపై ముఖ్య నేతలు కొంత కాలం క్రితం సమీక్ష చేశా రు. ఒకప్పుడు మావోయిస్టులు ఏ ప్రాంతానికి వచ్చినా ఒకే చోట ఉండే వారు. దీనిని వారి బాషలో డెన్‌గా పిలుస్తారు. డెన్‌కు నలువైపులా నలుగురు సెంట్రీలను మాత్రమే ఉంచేవారు. దీనివల్ల పోలీసులు వారి స్థావరాలపై సులువుగా దాడులు చేసేవారు. ఈ సారి దానికి భిన్నంగా వ్యూహాన్ని రూపొందిస్తున్నారు. కొత్త వ్యూహం ప్రకారం..  డెన్‌లో కొందరు ఉంటే దాదాపు 25 మంది వరకు రక్షణ సెంట్రీల మాదిరిగా నాలుగు వైపులా ఉంటారు. తూర్పుగోదావరి–విశాఖ సరిహద్దు ప్రాంతంలో ఛత్తీస్‌గఢ్, ఈస్టు డివిజన్‌కు చెందిన దళ సభ్యులకు దీనిపై శిక్షణ కూడా ఇస్తున్నారు.

సరికొత్త సమాచార విధానం
సాధారణంగా మావోయిస్టులు సమాచార మార్పిడికి సంప్రదాయ పద్ధతులనే ఎక్కువగా ఆచరిస్తుంటారు. ముఖ్యంగా కోడ్‌ భాషలోనే వారి ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతుం టాయి. కొరియర్ల ద్వారా కోడ్‌ భాషలో సమాచారం పంపుకో వడం వల్ల పోలీసులకు చిక్కినా విషయం బయటకు రాదు. ప్రస్తుతం ఆధునిక సాంకేతిక సమాచార వ్యవస్థ అందుబాటులోకి వచ్చి కోడ్‌ భాషకు బదులు వాకీ టాకీలు, వైర్‌లెస్‌ పరికరాలు, స్మార్ట్‌ఫోన్లు వినియోగిస్తున్నారు. సెల్‌ ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా మావోయిస్టుల స్థావరాలనూ పోలీసులు సులభంగా కనిపెట్టగలుగుతున్నారు. ఈ మధ్య కాలంలో మారుమూల అటవీ ప్రాంతాల్లోని మావోయిస్టులకు పట్టున్న ప్రాంతాల్లో కూంబింగ్‌ జరగడానికి ఇదే కారణం. ఒకప్పుడు మీడియాకు సమాచారం చెప్పాలంటే విలేకరులను అడవిలోకి తీసుకువెళ్లి మాట్లాడే వారు. ఇప్పుడు సీడీలు చేసి మరీ పంపిస్తున్నారు. కరపత్రాలు, బ్యానర్ల విషయంలోనూ ఆధునిక ప్రింటింగ్‌ పద్ధతులను వాడుతున్నారు.

దళపతిగా చలపతి
అనంతపురం జిల్లాకు చెందిన రామచంద్రారెడ్డి అలియాస్‌ చలపతి ఈస్ట్‌ డివిజన్‌ కార్యదర్శిగా ఉండేవారు. ఆయనే ఇప్పుడు మావోయిస్టు పార్టీకి ఏఓబీలో దళపతి అయ్యారు. ప్రస్తుతం ఆయన ఏఓబీ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. మావోయిస్టు నేతలు కుడుముల రవి, బాకూరు వెంకటరమణ, చలపతి ఉన్నంతకాలమే ఏఓబీతో పాటు జిల్లాలో మావోయిస్టు ఉద్యమం ఉంటుందని అధికారులు చెబుతుండేవారు. వారు ముగ్గురూ లేకపోతే 90శాతం తుడిచిపెట్టుకుపోయి నామమాత్రంగా మిగులుతుందనేవారు. ఈ ముగ్గురిలో రవి, వెంకటరమణ ఇప్పుడు ప్రాణాలతో లేరు. ఇక మిగిలింది చలపతి మాత్రమే. ఇటీవలే జాంబ్రిని ఎన్‌కౌంటర్‌ చేసిన పోలీసులు చలపతిని టార్గెట్‌ చేశారు. డిప్యూటీ కమాండర్‌ వంతల మల్లేష్‌ లొంగుబాటుతో పోలీసుల దృష్టి కూడా ఈ ప్రాంతం నుంచి పక్కకు మళ్లడంతో చలపతి ఈ ప్రాంతాన్ని షెల్టర్‌ జోన్‌గా మార్చుకున్నాడని తెలుసుకున్న పోలీసులు చేసిన దాడిలో అతను తప్పించుకున్నాడున్నారు.

సాంకేతిక పరిజ్ఞానంపై పెరుగుతున్న పట్టు
మారుతున్న కాలానికి అనుగుణంగా మావోయిస్టులు కూడా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్నారు. ఏఓబీలో చెడ్డా భూషణం గురించి తెలియని వారుండరు. ఆయన ఉద్యమంలో ఉన్నంత వరకూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువగా ఉండేది. అందుబాటులో ఉన్న ఏ ఎలక్ట్రానిక్‌ పరికరాన్ని వదలకుండా వినియోగించేవారు. ఆధునిక ఆయుధాలనూ వాడేవారు. ఆయన జైలుకెళ్లిన తరువాత ఇప్పుడు కుడుముల రవి, చలపతి వంటి వారు ఆ స్థానాన్ని భర్తీ చేస్తున్నారు. ఉద్యమ బలోపేతానికి జరిగే సభలు, సమావేశాలకు గిరిజనులను, యువతను సమీకరించేందుకు ఆధునిక పరిజ్ఞానాన్ని రవి ఎక్కవగా వినియోగిస్తారంట. చలపతి తన భార్యతో సెల్ఫీలు దిగి ల్యాప్‌టాప్‌లో భద్రపరుచుకోవడం తెలిసిందే. దాని ద్వారానే ఆయన ఎలా ఉంటారో కూడా ప్రపంచానికి తెలిసింది సెల్ఫీ వల్లనే.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement