
రాజధానిపై అంతా మీ నిర్ణయమేనా?: వైఎస్ జగన్
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై బుధవారం శాసనసభ దద్దరిల్లింది. సభలో ఎలాంటి చర్చా లేకుండానే రాజధానిపై ముఖ్యమంత్రి ప్రకటన చేస్తారన్న అంశంపై ప్రధాన ప్రతిపక్షం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయంపై ఇప్పటికే 304 నిబంధన కింద నోటీసు ఇచ్చామని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి గుర్తు చేశారు. దీనిపై ఎప్పుడు చర్చిస్తారో.. ఎంత సమయం ఇస్తారో చెప్పాలని ఆయన కోరారు. రాజధానిపై ముందుగా చర్చ జరగాలని, ఆ తర్వాతే రాజధానిపై ప్రకటన చేయాలని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటన చేసిన తర్వాత ఇంకా చర్చించేదేముందని ఆయన అన్నారు. సభలో ఎలాంటి చర్చ జరగకుండా రాజధానిపై ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించారు. సీఎం ప్రకటన చేసిన తర్వాత ఇక చర్చించి ఏ ప్రయోజనమని ఆయన నిలదీశారు. దీనిపై మరోసారి ఎదురుదాడికి దిగిన ప్రభుత్వం.. అనవసర రాద్దాంతం వద్దని అభిప్రాయపడింది. దీంతో రాజధాని అంశంపై చర్చకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టింది. స్పీకర్ పోడియం చుట్టుముట్టి నిరసన తెలియచేసింది. సభా కార్యక్రమాలకు అంతరాయం కలగటంతో స్పీకర్ సమావేశాలను పదినిమిషాలు పాటు వాయిదా వేశారు.
ప్రకటన తర్వాతే చర్చ:
రాజధానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటన తర్వాతే సభలో చర్చ ఉంటుందని మంత్రి అచ్చెన్నాయుడు ప్రభుత్వం తరపున ప్రకటించారు. ప్రకటన తర్వాత ఎన్ని గంటలు మాట్లాడతారో మట్లాడండి అంటూ చెప్పుకొచ్చారు. పత్రికల్లో వచ్చిన కథనాలను సభలో ప్రస్తావించి విలువైన సమయాన్ని వృధా చేయటం సరికాదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభా సమక్షంలోనే రాజధానిపై ప్రకటన చేస్తారన్నారు.