వెలగపూడిలోనే బడ్జెట్ సమావేశాలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలను వెలగపూడిలోనే నిర్వహించనున్నారు. మార్చి 6 నుంచి మార్చి 31వరకు, లేదా ఏప్రిల్ తొలి వారం వరకు సమావేశాలు కొనసాగుతాయి. బడ్జెట్ రూపకల్పనపై నేడు విజయవాడలో సీఎం చంద్రబాబునాయుడు సమీక్షించారు. ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, ఆర్థికశాఖ ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. కాగా బడ్జెట్ సమావేశాలనే కాకుండా రానున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలన్నిటినీ అమరావతిలోనే నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.
మార్చి 6న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తారు. 13న ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఆర్ధిక వ్యయ ప్రణాళిక ఆధారంగా బడ్జెట్ రూపొందించినట్లు తెలుస్తోంది. కొత్త పథకాలకు కేటాయింపులు ఉన్నట్లు కనిపించడం లేదని సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అప్పుల్లో ఉన్నందున ఇటీవల కొన్ని శాఖల్లో చెల్లింపులు కూడా నిలిచిపోయిన విషయం తెలిసిందే.
సమస్యలను అధిగమించాం: చంద్రబాబు
అధికారులతో సమీక్ష అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ రెండేళ్లలో ఆదాయం పెంచుకోగలిగామన్నారు. ఇబ్బందులున్నా విన్నూత్నంగా ఆలోచించి సమస్యల్ని అధిగమించిగలిగామన్నారు. ప్రభుత్వ ప్రయోజనాలన్నిటికీ ఆధార్ అనుసంధానం చేయడం వల్ల లెక్కల్లో కచ్చితత్వం, పారదర్శకత వచ్చిందన్నారు. ఎన్నికల హామికి కట్టుబడి రైతులకు రుణాల ఉపశమనం కల్పించినట్టు తెలిపారు. ఉపకార వేతనాల అందజేతలో సాంకేతిక విధానాలు అనుసరించామన్నారు. వేసవిలో కూడా విద్యుత్ కొరత లేకుండా చేశామన్నారు. ఈసారి వర్షపాతం తక్కువగా ఉందని, రిజర్వాయర‍్లలో నీళ్లు లేవన్నారు. విద్యదుత్పత్తిపై దృష్టి పెట్టకపోయినా ఈ రంగంలో ఇబ్బంది లేదన్నారు. చిత్తూరు జిల్లాలో 35 శాతం వర్షపాతం తక్కువగా నమోదు అయిందన్నారు. పట్టిసీమ పూర్తి చేయడం వలన కృష్ణా డెల్టాలకు నీరివ్వగలిగామని, అది రాయలసీమకు కలిసొచ్చిందన్నారు.