8మంది వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ | andhra pradesh assembly: eight ysrcp mlas suspended | Sakshi
Sakshi News home page

8మంది వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

Published Fri, Mar 20 2015 4:23 AM | Last Updated on Sat, Aug 18 2018 8:54 PM

8మంది వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ - Sakshi

8మంది వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

సభలోకి రాకుండా 3 రోజుల పాటు వేటు
స్పీకర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన మార్షల్స్
చీఫ్ మార్షల్‌తో సభ్యుల వాగ్వాదం
వెతికి వెతికి పట్టుకున్న మార్షల్స్
అసెంబ్లీ కార్యదర్శి సాయంతో సభ్యుల గుర్తింపు
వైఎస్సార్‌సీపీ సభ్యుల పెనుగులాట
నినాదాలతో హోరెత్తిన సభ
టీవీ ప్రసారాలు నిలిపివేత.. ఈడ్చుకెళ్లిన మార్షల్స్
మీడియా పాయింట్ వద్ద కూడా మాట్లాడనివ్వకుండా దౌర్జన్యం
సస్పెండైన సభ్యుల పట్ల మార్షల్స్ అనుచిత ప్రవర్తన


సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ గురువారం యుద్ధక్షేత్రాన్ని తలపించింది. విపక్ష నేతకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని పోడియం వద్ద నిరసనకు దిగిన వైఎస్సార్ సీపీ సభ్యులపై 3 రోజుల పాటు సస్పెన్షన్ వేటు పడింది. సభలో ఏకైక ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 8 మంది సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. శాసనసభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బడ్జెట్‌పై చర్చ సందర్భంగా రైతుల రుణమాఫీ అంశంపై మాట్లాడుతుండగా.. ‘యు కెనాట్ స్పీక్(మీరు మాట్లాడలేరు)’ అంటూ స్పీకర్ కోడెల శివప్రసాదరావు నియంత్రించారు.

తమ నాయకుడికి మాట్లాడే అవకాశమివ్వాలని కోరుతూ వైఎస్సార్ సీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలపటంతో సభను వాయిదా వేశారు. తిరిగి 11.58కి సభ ప్రారంభమవుతూనే వైఎస్సార్ సీపీ సభ్యులను సస్పెండ్ చేయాలని సూచిస్తూ శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు ప్రతిపాదించిన తీర్మానాన్ని స్పీకర్ అనుమతించి ఆమోదించారు. 8 మంది విపక్ష సభ్యులను ఈ నెల 23 వరకు సమావేశాల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. వారిని వెంటనే సభ నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. దీంతో విపక్ష సభ్యులంతా సభ మధ్యలోకి చేరుకుని తీవ్ర నిరసన తెలిపారు. తమ పార్టీ సభ్యుల సస్పెన్షన్ అన్యాయం, అక్రమమని నినదించారు. ఈ వివాదం కొనసాగుతుండగానే స్పీకర్ సభలోకి మార్షల్స్‌ను రప్పించారు.
 
మార్షల్స్‌తో సభ్యుల గెంటివేత
సస్పెండైన సభ్యుల్ని ‘పట్టుకునేందుకు’ అన్నట్టుగా మూడు విభాగాలకు చెందిన దాదాపు 60 మందికిపైగా మార్షల్స్ స్పీకర్ ఆదేశాలతో 3 ద్వారాల నుంచి సభలో ప్రవేశించారు. స్పీకర్ స్థానం వెనుకవైపు నుంచి కొందరు రాగా, సీఎం ప్రవేశించే మార్గం వైపు నుంచి, ప్రతిపక్ష నేత వచ్చే ద్వారం వైపు నుంచి మరికొందరు మార్షల్స్ సభలోకి చేరుకున్నారు. వస్తూనే విపక్ష సభ్యుల వైపు ఉన్న ప్రవేశ మార్గం తలుపులు తెరిచారు. స్పీకర్ పోడియం ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను చుట్టుముట్టారు. కొందరు మార్షల్స్ హారంగా ఏర్పడగా మరికొందరు ఎమ్మెల్యేలను ‘వేటాడే’ పనిలో పడ్డారు.

వారికి సస్పెండైన సభ్యులెవరో తెలియకపోవడంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. దీంతో శాసనసభ కార్యదర్శి కె.సత్యనారాయణ చీఫ్ మార్షల్ గణేష్‌ను సభలోకి రప్పించారు. ఆయన సభ్యులను గుర్తించగా మార్షల్స్ వారిని పట్టుకునే పనిలో పడ్డారు. ఈ సమయంలో వాగ్వాదాలు, పెనుగులాటలు, అరుపులు, నినాదాలతో సభ హోరెత్తింది. మార్షల్స్ కమెండోల మాదిరిగా తొలుత గడికోట శ్రీకాంత్‌రెడ్డిని చుట్టుముట్టారు. అదే సమయంలో అసెంబ్లీ  ప్రత్యక్ష ప్రసారాలను నిలిపేశారు. మార్షల్స్ గో బ్యాక్ అనే నినాదాలు మిన్నంటగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని ఒడిసి పట్టుకున్నారు.

ఆయన పెనుగులాటకు దిగటంతో వెనక్కు తగ్గిన మార్షల్స్ పక్కనే ఉన్న చిర్ల జగ్గిరెడ్డిని 8 మంది మార్షల్స్ కాళ్లు, చేతులు గట్టిగా పట్టుకుని చేతుల మీద వేసుకుని బయటకు బిరాబిరా లాక్కెళ్లారు. ఈ దశలో నినాదాలు హోరెత్తుతుండగా చెవిరెడ్డి, కొడాలి నాని, పి.రామకృష్ణారెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, ముత్యాలనాయు డు, చాంద్‌బాషాను బయటకు లాక్కుపోయారు. సస్పెండైన మరో సభ్యుడు శివప్రసాదరెడ్డికోసం కొద్దిసేపు వెదికి, అనంతరం గుర్తించి బయటకు తరలించారు. సభ్యుల సస్పెన్షన్ ఘట్టం ముగియగానే 11.20కి అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాలను పునరుద్ధరించారు.
 
సస్పెన్షన్‌కు గురైన వైఎస్సార్ సీపీ సభ్యులు
1. జి.శ్రీకాంత్‌రెడ్డి (రాయచోటి)
2. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి (చంద్రగిరి)
3. చాంద్ బాషా (కదిరి)
4. ముత్యాలనాయుడు (మాడుగుల)
5. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (మాచర్ల)
6. కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(గుడివాడ)
7. శివప్రసాదరెడ్డి (ప్రొద్దుటూరు)
8. చిర్ల జగ్గిరెడ్డి (కొత్తపేట)
 
సభ బయటా దౌర్జన్యమే
సభ నుంచి సస్పెండైన ఎమ్మెల్యేల పట్ల శాసనసభ ఆవరణలోనూ మార్షల్స్ అనుచితంగా ప్రవర్తించారు. జరిగిన అన్యాయాన్ని ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజల దృష్టికి తెచ్చేందుకు మీడియా పాయింట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన వైఎస్సార్‌సీపీ సభ్యులను పోలీసులు అడ్డుకున్నారు. మీడియా పాయింట్‌లోకి వెళ్లడానికి వీల్లేదని, సస్పెండైన వారిని అసెంబ్లీ బయట విడిచి పెట్టాలని కార్యదర్శి ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలోఉండకూడదంటూ ఒత్తిడి చేశారు. ఇదేం పద్ధతంటూ ప్రశ్నించిన సభ్యులపై జులుం ప్రదర్శించారు. మాట్లాడే ప్రయత్నం చేసిన సభ్యులను బలవంతంగా గుంజుకెళ్లారు. ప్రతిఘటించటంతో ఒక్కో సభ్యుడిని ఐదారుగురు మార్షల్స్ కలిసి బలవంతంగా ఈడ్చుకుని వెళ్లటంతో తోపులాట జరిగింది.

ఒక్కో సభ్యుడిని అసెంబ్లీ ప్రధాన ద్వారం బయటకు లాక్కెళ్లారు. సభ్యులు తీవ్ర అభ్యంతరం చెబుతున్నా విడిచిపెట్టలేదు. తమ హక్కులను హరించడానికి మీరెవరని ఎమ్మెల్యేలు కొడాలి నాని, అత్తార్ చాంద్‌బాషా, ముత్యాల నాయుడు ప్రశ్నించడంతో గేటు బయట వదిలిపెట్టారు. ఈ క్రమంలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని ఎత్తుకెళ్లి గేటు నంబర్ 2 వద్ద రోడ్డుపై పడేయటంతో ఆయన సొమ్మసిల్లారు. దీంతో కంగుతిన్న మార్షల్స్ పోలీసు వాహనంలోంచి నీళ్ల బాటిల్ తెచ్చి మొహంపై చల్లారు. చెవిరెడ్డిని పుట్‌పాత్‌పై కూర్చోపెట్టి మంచినీళ్లు తాగించారు. అనంతరం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీ ప్రాంగణంలోని మహ్మాత్మాగాంధీ విగ్రహం ఎదుట ఆందోళనకు దిగారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement