కుడి, ఎడమలకే పెద్దపీట
సుజన, నారాయణలకు అన్నిటా అగ్ర తాంబూలం
బాబు సర్కారులో సన్నిహితులదే హవా
ఏ నిర్ణయమైనా వారితో చర్చించిన తర్వాతే.. అనేక కమిటీల్లో ఆ ఇద్దరికే చోటు
ఆ తర్వాత రమేష్, కంభంపాటి, పరకాల, అభీష్ట, కుటుంబరావుల కీలక పాత్ర
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రతి విషయంలోనూ ఇప్పుడు ప్రధానంగా ఇద్దరు నేతలపైనే ఆధారపడుతున్నారు. అటు పార్టీ, ఇటు ప్రభుత్వ పరమైన వ్యవహారాల్లో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఆ ఇద్దరు నేతలే కీలకంగా మారారు. పార్టీ రాజ్యసభ సభ్యుడు వై.సత్యనారాయణచౌదరి (సుజనాచౌదరి), మునిసిపల్ వ్యవహారాల శాఖ మంత్రి పి.నారాయణలతో సంప్రదించకుండా చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకోవడం లేదన్న విషయాన్ని జరుగుతున్న పరిణామాలు స్పష్టంచేస్తున్నాయి.
ప్రభుత్వంలో వీరి ప్రాధాన్యత విపరీతంగా పెరిగింది. ఇటీవల సంభవించిన హుద్‌హుద్ తుపాను సహాయక కార్యక్రమాల పర్యవేక్షణ బాధ్యత కూడా నారాయణకే అప్పగించారు. ఈ ఇద్దరితో పాటు సి.ఎం.రమేష్, సమాచార సలహాదారు పరకాల ప్రభాకర్, సీఎం కార్యాలయంలో ఓఎస్‌డీగా నియమితుడైన అభీష్ట, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధిగా నియమితుడైన కంభంపాటి రామ్మోహన్‌రావులు బాబుకు అత్యంత సన్నిహితంగా కొనసాగుతున్నారు.
ప్రత్యక్ష ఎన్నికలతో నిమిత్తం లేని బడా నేతలు...
సుజనాచౌదరి, సి.ఎం.రమేష్, నారాయణలు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న కాలంలో చంద్రబాబుకు అండగా ఉన్నారు. సుజనాచౌదరి పలుమార్లు అమెరికా సందర్శించి అక్కడి తెలుగువారి నుంచి ఎన్నికల నిధులు సేకరించారు. సంపన్న వ్యాపారులైన ఈ ముగ్గురూ బాబు కుమారుడు నారా లోకేష్‌తో నిత్య సంబంధాలు పెట్టుకుంటారు. పార్టీలో కానీ, ప్రభుత్వంలో కానీ కీలకమైన నిర్ణయాలు తీసుకునే సమావేశాల్లో సీఎంతో పాటు ఈ నలుగురూ తప్పనిసరిగా ఉంటారు.
రాజధాని కానీ.. నిధులు కానీ.. సుజనానే కీలకం!
ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలన్న విషయంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణ కమిటీ అధ్యయనం పూర్తి కాకముందే మంత్రి నారాయణ నేతృత్వంలో రాజధాని సలహా కమిటీని చంద్రబాబు ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో సుజనాచౌదరి సభ్యుడు. వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన బాబు.. వనరుల సమీకరణ కోసం సూచనలు, సలహాలు ఇవ్వడానికి అంటూ మరో కమిటీని నియమించారు. దాని బాధ్యతలను సుజనాచౌదరికి అప్పగించారు.
సీఎంతో పారిశ్రామిక వేత్తలను కలిపేదీ వారే..!
ఈ కీలక బృందంలోని సభ్యులెవరు హైదరాబాద్‌లో ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించే ప్రతి సమీక్షా సమావేశంలో పాల్గొంటున్నారు. విదేశీ ప్రతినిధులు ఎవరు ముఖ్యమంత్రిని కలిసినా బృందంలోని నేతల్లో ఎవరో ఒకరు లేకుండా కలుసుకోవడం లేదు. ఇటీవలి కాలంలో జర్మనీ, ఆస్ట్రేలియా, సింగపూర్ వంటి అనేక దేశాలకు చెందిన పారిశ్రామిక ప్రతినిధులతో భేటీలు ఇలానే జరిగాయి.
ప్రభుత్వంలో అంతా పరకాలే..!
ప్రభుత్వ సమాచార సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్ ప్రస్తుతం ప్రభుత్వంలో అంతా తానై వ్యవహరిస్తున్నారు. సీఎం నిర్వహించే సమావేశాల్లో ఆయా శాఖల మంత్రులున్నా లేకున్నా పరకాల మాత్రం భాగస్వాములవుతున్నారు. ఆయన చంద్రబాబుకు తలలో నాలుకలా వ్యవహరిస్తున్నారు.
రమేష్‌ను దూరం పెట్టారా?
రాజ్యసభ సభ్యుడు సి.ఎం.రమేష్ టీడీపీలో కీలక పాత్ర పోషిస్తూ చంద్రబాబు వెన్నంటి ఉంటున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన ను ప్రత్యేకంగా ఏ కమిటీలో నియమించకపోయినప్పటికీ ప్రాధాన్యత ఇస్తున్నారు. పార్టీ పరమైన అంతర్గత పనులను రమేష్‌కు అప్పగిస్తున్నారు. కొద్ది రోజులుగా కొంత దూరం పెట్టారని తెలుస్తోంది.
హస్తిన సంబంధాలన్నీ కంభంపాటికే...
మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహనరావు కూడా ప్రస్తుతం చంద్రబాబు టీంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఢిల్లీలోని అన్ని జాతీయ రాజకీయ పార్టీల నేతలతో సన్నిహిత సంబంధాలున్న క ంభంపాటిని ఏరికోరి చంద్రబాబు ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించుకున్నారు.
కొద్ది రోజుల్లోనే సన్నిహితమైన కుటుంబరావు...
ఆర్ధిక రంగ నిపుణుడు చెరుకూరి కుటుంబరావు కొద్ది కాలంలోనే బాబుకు సన్నిహితుడుగా మారారు. ఆర్ధిక రంగంలో పట్టున్న కుటుంబరావు ఎన్నికలకు ముందు నుంచి బాబుకు పలు అంశాల్లో సలహాలు సూచనలు ఇస్తున్నారు. ఆయన్ను రాష్ట్ర ప్రణాళికా మండలి వైస్ చైర్మన్‌గా నియమించారు.
నారాయణ లేని మంత్రివర్గ కమిటీ ఉండదు..!
పురపాలక శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న నారాయణను ప్రభుత్వం నియమించే ప్రతి మంత్రివర్గ ఉపసంఘంలో సభ్యుడిగా చంద్రబాబు నియమిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాజధాని నిర్మాణ సలహా కమిటీకి నారాయణ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.
రాష్ట్ర రాజధాని గుంటూరు - కృష్ణా జిల్లాల మధ్య ఏర్పాటు చేయాలని నిర్ణయించిన బాబు భూ సమీకరణకు కూడా మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటుచేశారు. అందులో సభ్యుడిగా నియమితుడైన పి.నారాయణ చుట్టే వ్యవహారాలు సాగుతున్నాయి.
తమిళనాడులోని అమ్మ క్యాంటీన్ల తరహాలో ఏపీలో ఏర్పాటు చేయదలచిన అన్న క్యాంటీన్లకు మార్గదర్శకాలకు ఏర్పాటు చేసిన ఉపసంఘంలో కూడా ఆయన సభ్యుడుగా ఉన్నారు.రూ.రెండుకే 20 లీటర్ల మంచినీటిని ఇచ్చే ఎన్‌టీఆర్ సుజల పథకం మార్గదర్శకాల తయారీ కమిటీలో కూడా నారాయణ సభ్యుడుగా ఉన్నారు.