లక్ష ఆత్మలకు ఓట్లు! | Andhra Pradesh Electoral Voters List Have Fake Votes | Sakshi
Sakshi News home page

Published Fri, Nov 30 2018 4:18 AM | Last Updated on Fri, Nov 30 2018 8:09 AM

Andhra Pradesh Electoral Voters List Have Fake Votes - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా చనిపోయిన వారి పేరుతో లక్షకుపైగా ఓట్లు ఉన్నట్లు తేలటం ఆందోళన కలిగిస్తోంది. వీటిని తొలగించకుంటే దొంగఓట్లుగా మారి ప్రజాస్వామ్య ప్రక్రియకు తీవ్ర విఘాతం కలుగుతుందని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. మృతి చెందినవారి ఓట్లను రివిజన్‌ చేసే సమయంలో ఎప్పటికప్పుడు తొలగించాల్సి ఉన్నా క్షేత్రస్థాయి సిబ్బంది పట్టించుకోవడం లేదు. ఫలితంగా చనిపోయిన వారి పేరుతో ఓట్లు ఏళ్ల తరబడి అలాగే కొనసాగుతున్నాయి.

ఇటీవల తెలుగు రాష్ట్రాల్లోని ఓటర్ల జాబితాలపై విస్తృతంగా అధ్యయనం జరిపిన ‘ఓటర్‌ ఎనలటిక్స్‌ స్ట్రాటజీ టీమ్‌’ (వాస్ట్‌) రాష్ట్రంలో చనిపోయిన వారి పేరుతో ఓట్లు లక్షకుపైగా ఉన్నట్లు తేల్చింది. వాస్ట్‌ సంస్థ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిం చుకొని చనిపోయిన వారి పేరిట ఉన్న ఓట్ల సమాచారాన్ని నివేదికలుగా రూపొందించింది. ఆంధ్రప్రదేశ్‌లోని 175 నియోజకవర్గాల్లోనూ ఇలాంటి ఓట్లు భారీగా ఉన్నాయి. ఓటరు పేరును జాబితాలోకి చేర్చినప్పుడు పక్కనే తండ్రి, / భర్త పేరును కూడా నమోదు చేస్తుం టారు. తండ్రి / భర్త చనిపోతే ఆ పేర్ల పక్కనే ‘లేట్‌’ అని పేర్కొంటారు. ఇలా ‘లేట్‌’ అని ఉన్న పేర్లతో కూడా ఓట్లు కొనసాగుతుండడం విశేషం. ‘లేట్‌’ అని పేర్కొంటూ చనిపోయినట్లుగా నిర్ధారించిన వ్యక్తుల పేర్లు అదే నియోజకవర్గం లేదా మరో నియోజకవర్గంలోని ఓటర్ల జాబితాలో దర్శనమిస్తున్నాయి. 

నకిలీ ఓటర్లు అరకోటికిపైనే..
దేశంలో ఎక్కడా లేనంతగా రాష్ట్రంలో అరకోటికిపైగా నకిలీ ఓట్లు ఉన్నట్లు ఇప్పటికే ‘వాస్ట్‌’ నిర్వహించిన సర్వేలో వెలుగు చూడటం తెలిసిందే. ఏపీలోని మొత్తం 3.6 కోట్ల ఓట్లలో ఏకంగా 52.67 లక్షల నకిలీ ఓట్లు నమోద య్యాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో స్పష్టమవుతోంది. కేవలం ఒకటి రెండు శాతం ఓట్ల వ్యత్యాసంతోనే పార్టీల జయాపజయాలు మారిపోతున్న నేపథ్యంలో లక్షల సంఖ్యలో దొంగ ఓట్లు ఉండటం కలవరం కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో నకిలీ ఓట్లను గుర్తించి ఏరివేసేందుకు ఎన్నికల సంఘం చొరవ చూపాలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. 

పసిగుడ్డులకూ ఓటు హక్కు
బతికి ఉన్న వారి పేరిట నాలుగైదు ఓట్లు నమోదు కావడం ఒక ఎత్తు కాగా ఏడాది కూడా నిండని చంటిబిడ్డల పేరిట కూడా ఓటరు కార్డులుండడం విస్మయం కలిగిస్తోంది. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా కొందరు ఓటర్ల వయసు ఏకంగా 352 ఏళ్లు కూడా ఉండడంపై నివ్వెరపోతున్నారు. ఇలాంటి వింతలు ఎన్నికల సంఘం రూపొందించిన ఓటరు జాబితాను పరిశీలిస్తే కోకొల్లలుగా దర్శనమిస్తున్నాయి. అధికార పార్టీ నేతలు క్షేత్రస్థాయి సిబ్బందితో కలసి ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శలున్నాయి. స్థానికంగా పరిశీలన లేకుండా ఓటరుగా నమోదు చేస్తుండటం, సరైన సమాచారం లేకున్నా జాబితాలోకి చేర్చడం లాంటివి చోటు చేసుకుంటున్నాయి.

ద్వంద్వ ఓటర్లు 18 లక్షలకుపైనే
మరోవైపు ఏపీతో పాటు తెలంగాణలోనూ ఓటు హక్కు కలిగిన వారు 18,50,511 మంది ఉన్నట్లు వెల్లడైంది. ద్వంద్వ ఓట్ల వల్ల ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోంది. ఎన్నికల సమయంలో ఇవి దొంగ ఓట్లుగా మారిపోతున్నాయి. రాష్ట్రంలోని మొత్తం ఓట్లలో ద్వంద్వ ఓట్లు ఏకంగా 5.14 శాతంగా ఉండటం విస్తుగొలుపుతోంది. వీరంతా తెలంగాణాతోపాటు ఏపీలోనూ ఓటు హక్కు వినియోగించుకోవడం ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రాష్ట్రంలో అసలైన ఓటర్ల మనోభీష్టాలతో నిమిత్తం లేకుండా ద్వంద్వ ఓట్లు ఎన్నికల ఫలితాలను శాసించేలా మారుతున్నాయి. నకిలీ ఓట్లు ఎన్నికల వ్యవస్థకే పెను సవాల్‌గా మారుతున్నాయని ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సర్వే పేరుతో విపక్షం ఓట్లు తొలగిస్తున్న టీడీపీ బృందాలు..
ఎన్నికల సర్వే పేరుతో రాష్ట్రంలో సంచరిస్తున్న కొన్ని బృందాలు ప్రత్యర్థి పార్టీకి చెందిన ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. ట్యాబ్‌లు, ఇతర అధునాతన సాంకేతిక పరికరాలతో ప్రతిపక్ష వైఎస్సార్‌ సీపీకి పట్టున్న ప్రాంతాల్లో సర్వే పేరిట ఈ బృందాలను మోహరిస్తున్నారు. అభిప్రాయాలు తెలుసుకునేందుకు అంటూ ప్రశ్నలు అడుగుతూ చివర్లో ఓటరు ఐడీ నెంబర్, మొబైల్‌ నెంబర్‌ను సేకరిస్తున్నారు. ఈ నెంబర్‌ను నకిలీ బృందాలు ట్యాబ్‌ల్లో అప్‌లోడ్‌ చేసిన కొద్దిసేపటికే తమ ఓటు రద్దు అయినట్లు సమాచారం అందటంతో ఓటర్లు నివ్వెరపోతున్నారు. ఇలా ప్రతి నియోజకవర్గంలో వేలాది మంది ఓట్లు గల్లంతు అవుతున్నాయి. వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించడమే ఈ బృందాల లక్ష్యమని స్పష్టమవుతోంది. ఈ బృందాల్లోని యువకుల వద్ద  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఎన్టీఆర్‌ ఫొటోలున్న టీడీపీ సభ్యత్వ గుర్తింపు కార్డులుండడం గమనార్హం. 

ఆ ఓట్లను తొలగించాలి..
పలు నియోజకవర్గాల్లో ఓటర్లకు సంబంధించి తండ్రి/భర్త వివరాల్లో ‘లేట్‌’ అని పేర్కొంటున్నా అవే పేర్లతో అవే జిల్లాల్లోని ఇతర నియోజకవర్గాల్లో ఓట్లు కొనసాగుతున్నాయని ‘ఓటర్‌ ఎనలటిక్స్‌ స్ట్రాటజీ టీమ్‌’ హెడ్‌ తుమ్మల లోకేశ్వరరెడ్డి పేర్కొన్నారు. ఇలా ‘లేట్‌’ పేర్లతో కొనసాగుతున్న ఓట్లు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఉన్నాయని, వీటిని పరిశీలించి తొలగించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ పేర్లను తొలగించకుంటే ఇవన్నీ చివరకు దొంగ ఓట్లుగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ఓటరు ఒకరే.. పలుచోట్ల ఓటుహక్కు

  • విశాఖకే చెందిన  దాడి కృష్ణవేణి (ఐడీ ఎక్స్‌బీ02166460) తండ్రి దాడి శ్రీనివాసరావు లేట్‌ అని జాబితాలో పేరు ఉంది. అయితే ఈ దాడి శ్రీనివాసరావుకు ‘ఏపీ060320090382’ నెంబర్‌తో ఓటు మరోచోట కొనసాగుతోంది.
  • విశాఖలోని తాటిచెట్లపాలేనికి చెందిన మహ్మద్‌ బాషా మదీనా అనే మహిళకు ‘సీకే0936484’ ఐడీతో ఓటుహక్కు ఉంది. ఆమె తండ్రి/భర్త అబ్దుల్‌ కరీమ్‌ చనిపోయినట్లుగా ‘లేట్‌’ అని పేర్కొన్నారు. అయితే అబ్దుల్‌కరీమ్‌ పేరిట టీజీఎం0282012’ ఐడీ నెంబర్‌తో మరోచోట ఓటరు జాబితాలో ఓటు హక్కు కొనసాగుతోంది.
  • ఇదే నియోజకవర్గంలో ఎల్లపు అప్పారావు అనే వ్యక్తి చనిపోయినట్లుగా ఒక జాబితాలో ‘లేట్‌’ అని గుర్తించగా మరో జాబితాలో టీజీఎం0343855 నెంబర్‌తో ఓటు హక్కు కొనసాగుతుండడం విశేషం.
  • గుంటూరులో అమీరున్‌ షేక్‌ భర్త సుభాని షేక్‌ చనిపోయినట్లుగా ఆమె ఓటరు వివరాల్లో ‘లేట్‌’ అని నమోదు చేశారు. అదే సుభాని షేక్‌కు బాపట్ల నియోజకవర్గం ఇందిరాగాంధీనగర్‌ ఓటరు జాబితాలో ఎస్‌ఎస్‌వై0496000 ఐడీతో ఓటు హక్కు కొనసాగుతోంది.
  • బాపట్ల నియోజకవర్గంలోని అక్ష గండికోట (ఎస్‌ఎస్‌వై0644741) తండ్రి శ్రీనివాసరావు చనిపోయినట్లుగా నమోదై ఉండగా ఆయన పేరు యాజలిలో (ఎస్‌ఎస్‌వై426767) ఓటరు జాబితాలో ఉండటం గమనార్హం.
  • విజయనగరం జిల్లాకు చెందిన రమణ రొంగలి (యూసీజే0861352) తండ్రి అప్పలనాయుడు రొంగలి చనిపోయినట్లు ఓటరు జాబితాలో ఉంది. అయితే ఇదే వ్యక్తి పేరిట గజపతినగరంలో ఓటు నమోదై ఉంది.
  • పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన మాధవి చేకూరి (ఓటర్‌ ఐడీ ఐఎంహెచ్‌1020437) పేరుతో ఉన్న ఓటరు తండ్రి సీతారామారాజు చేకూరి లేట్‌ అని జాబితాలో ఉంది. అయితే ఇదే  సీతారామరాజు చేకూరికి ఆచంట నియోజకవర్గంలో  ‘ఏపీ 100640504516’ ఐడీ నెంబర్‌తో ఓటు హక్కు ఉండడం విశేషం.
  • చింతలపూడి నియోజకవర్గంలోని సత్యదేవి కాజ అనే ఓటరు (ఐడీ డబ్ల్యూఎక్స్‌డబ్ల్యూ 1113943) భర్త సత్యనారాయణ కాజ చనిపోయినట్లు ‘లేట్‌ ’ అని జాబితాలో పేర్కొన్నారు. అదే వ్యక్తి పేరుతో ఆచంటలో ఐడీ నెంబర్‌ టీవై00648206తో ఓటర్ల జాబితాలో ఓటు హక్కు కొనసాగుతోంది.
  • విశాఖపట్నానికి చెందిన  వెంకటరమణ కొల్లి (ఓటరు ఐడీ నెంబర్‌ జెడ్‌జెయ్యు1234731) ఓటరు తండ్రి కొల్లి దేముడు ‘లేట్‌’’ అని ఓటరు జాబితాలో ఉంది. చనిపోయినట్లున్నగా చూపిస్తున్న ఈ కొల్లి దేముడికి అనకాపల్లి నియోజకవర్గంలో ఓటరు ఐడీ నెంబర్‌ ‘జీఎం0035071’తో ఓటరు జాబితాలో ఓటు కొనసాగుతుండడం విశేషం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement