
గుంటూరులోని లాడ్జిలో పట్టుబడిన స్పా సంస్థ ప్రతినిధులు , సర్వే కోసం స్పా కంపెనీ అందజేసిన ఐడీ కార్డు
సాక్షి, గుంటూరు/మంగళగిరి/గుంటూరు ఈస్ట్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల ఓట్లు గల్లంతు చేసే ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా జోరుగా సాగుతోంది. సర్వేల పేరుతో కొందరు యువకులు బృందాలుగా వైఎస్సార్‌సీపీకి పట్టున్న నియోజకవర్గాల్లో సంచరిస్తూ వారి ఓట్లను మాయం చేస్తున్నారు. ఈ విధంగా సర్వే చేస్తున్న 12 మందిని మంగళవారం గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా ఆధ్వర్యంలో పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు బాలాజీ నగర్‌కు చెందిన పి.వెంకటేశ్వర్లు నివాసం వద్దకు మంగళవారం సా.5 గంటల ప్రాంతంలో ఓ యువకుడు వచ్చాడు. సర్వే పేరుతో వెంకటేశ్వర్లు ఓటర్ ఐడీ నంబర్, ఫోన్ నంబర్, ఏ పార్టీకి ఓటు వేస్తావు అంటూ వివరాలు సేకరించడం మొదలుపెట్టాడు.
ఈ ప్రశ్నలన్నీ ఎందుకు అడుగుతున్నావని వెంకటేశ్వర్లు ఆ యువకుడిని ప్రశ్నించగా స్పా (సెంటర్ ఫర్ సోషియో పొలిటికల్ ఎనాలసిస్) అనే సంస్థ ద్వారా 2019 ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీకి ఓటేయబోతున్నారో అనే అంశంపై ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నామని ఆ యువకుడు సమాధానం ఇచ్చాడు. ప్రజాభిప్రాయ సేకరణ చేసే వారికి ఓటర్ ఐడీ నంబర్‌తో ఏం పని ఉందని వెంకటేశ్వర్లు ప్రశ్నించగా ఆ యువకుడు తడబడుతూ సమాధానం చెప్పాడు. దీంతో అనుమానం వచ్చిన స్థానికులు ఆ యువకుడిని గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా కార్యాలయానికి తీసుకువెళ్లారు. ఎమ్మెల్యే అతనిని ఆరా తీయగా తనతోపాటు ఇంకా 11 మంది ఉన్నారని, వారందరూ కొత్తపేటలోని నటరాజ లాడ్జిలో ఉన్నారని చెప్పాడు. దీంతో మిగిలిన యువకుల వద్దకు వెళ్లి వారినీ విచారించారు. ఇదంతా బెంగళూరు కేంద్రంగా జరుగుతున్నట్లు వారు చెప్పారు. కాగా, పోలీసులకు పట్టుబడిన స్పా బృందం 76 మందితో వాట్సాప్ గ్రూప్ కూడా నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వాట్సాప్ గ్రూప్‌లో ఉన్న వారిలో చాలామంది ప్రొఫైల్ పిక్‌లలో టీడీపీ ఫొటోలు, లోకేష్‌తో దిగిన ఫొటోలు ఉండటం గమనార్హం. మరోవైపు.. ఇదే విధంగా ఈ నెల 17న ఇదే జిల్లా కృష్ణాయపాలెంలో కూడా ఇలాగే సర్వే నిర్వహించారు.
అన్ని నియోజకవర్గాల్లో సర్వే
సాధారణంగా సర్వే నిర్వహించే వారు కేవలం వ్యక్తి పేరు.. ఏ నియోజకవర్గం.. ఎవరికి ఓటు వేస్తారు అనే అంశాలపై మాత్రమే ప్రజలను అడిగి తెలుసుకుంటారు. అయితే, ఈ సంస్థ సభ్యులు నిర్వహించే సర్వే మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఓటరు పేరు, మొబైల్ నంబర్‌తో పాటు ఓటర్ ఐడీ నంబర్, ఏమైనా ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరిందా అనే అంశాలను ఆరా తీస్తున్నారు. ఈ సంస్థ తరఫున అన్ని నియోజకవర్గాల్లో సర్వే నిర్వహిస్తున్నట్టు వారు తెలిపారు.
వైఎస్సార్ సీపీ ఓటర్లే లక్ష్యం..
స్పా సంస్థ సభ్యులను విచారించగా.. అధికశాతం వైఎస్సార్‌సీపీ ఓటర్లే లక్ష్యంగా ఈ సర్వే నిర్వహించారని తెలుస్తోంది. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో దాదాపు 25 పోలింగ్ కేంద్రాల పరిధిలో మంగళవారం వీరు సర్వే నిర్వహించినట్లు సమాచారం. వీరు వివరాలు సేకరించిన అరగంట లోపే తమ ఓటు రద్దయిందని పలువురు బాధితులు తెలిపారు. సర్వేల పేరుతో ఓట్లు గల్లంతు చేస్తున్నారని అనుమానం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ విషయాన్ని ఎమ్మెల్యే ముస్తఫా కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు సర్వేకు సంబంధించిన సూపర్‌వైజర్లు ఉమామహేశ్, రవి సహా 10 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు.
వివరాలిచ్చాక చూస్తే ఓట్లు గల్లంతయ్యాయి
సోమవారం ఇద్దరు యువకులు మా ఇంటికి వచ్చి కార్పొరేషన్ అధికారులు పంపించారని చెప్పి నమ్మించారు. ఓటర్ల జాబితా సవరణ చేస్తున్నామంటూ మా ఇంట్లోని ఓటర్ల వివరాలు అడిగారు. చివరగా వారి చేతిలోని ట్యాబ్‌లో ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారో ఆ గుర్తుపై వేలిముద్ర వేయాలన్నారు. నేను, మా అమ్మ వెంకట లక్ష్మమ్మ.. వైఎస్సార్‌సీపీ గుర్తు అయిన ఫ్యాన్‌పై వేలిముద్రలు వేశాం. వారి ప్రవర్తనపై అనుమానం వచ్చి గట్టిగా ప్రశ్నించడంతో పారిపోయారు. మంగళవారం ఓటర్ల జాబితా పరిశీలించగా నా ఓటు, మా అమ్మ ఓటు గల్లంతయ్యాయి.
– సానికొమ్ము వెంకటేశ్వరరెడ్డి, ఎల్‌ఆర్ కాలనీ 6వ లైను, గుంటూరు
వెంటనే ఓట్లు సరిచూసుకోండి
ఓటర్లందరూ తమ ఓట్లను జాబితాలో సరిచూసుకోవాలి. తొలగించి ఉంటే వెంటనే నమోదు చేయించుకోవాలి. రానున్న ఎన్నికలలో విజయం సాధించలేమనే టీడీపీ ప్రభుత్వం అడ్డదారులు తొక్కుతోంది. ఓట్లను తొలగించారని నిర్ధారణ జరిగితే ఎన్నికల కమిషన్ దృష్టికి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం.
– ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కే), ఎమ్మెల్యే, మంగళగిరి
36వేల ఓట్ల గల్లంతు
గుంటూరు నగరంలో వైఎస్సార్‌సీపీకి చెందిన 36వేల ఓట్లు తొలగించారు. నాలుగు నెలలుగా కష్టపడి మేం ఓటర్లను చేర్పిస్తుంటే.. సర్వేల పేరుతో టీడీపీ వాటిని తొలగిస్తోంది. సర్వేలు చేసే వారికి ఓటర్ ఐడీ నంబర్‌లు, ఇతర వివరాలతో ఏం పని? ఇది ముమ్మాటికీ వైఎస్సార్‌సీపీ ఓట్లు తొలగించడానికి చేస్తున్న పనే.
– మహ్మద్ ముస్తఫా, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే
పావుగంటలో ఓటు గల్లంతు
స్పా ప్రతినిధులమంటూ మంగళవారం కొందరు నా వద్దకు వచ్చి స్థానిక సమస్యలు అడిగారు. అనంతరం ఓటు ఎవరికి వేస్తున్నారో తెలపాలంటూ ప్రశ్నించారు. జనసేనకు వేస్తానని చెప్పా. అనంతరం వారి వద్ద ఉన్న టాబ్‌పై నా వేలి ముద్ర తీసుకున్నారు. నా ఓటు ఐడీ కార్డు నంబరు అడిగారు. వారి ప్రవర్తనపై అనుమానం వచ్చి ఎలక్షన్ కమిషన్ టోల్ ఫ్రీ నెంబర్ 1905కు ఫోన్‌చేయగా 15 నిమిషాల క్రితం నా ఓటు తొలగించబడిందని సమాధానం వచ్చింది.
– తోట కార్తీక్, బాలాజీనగర్, 9వ లైను, గుంటూరు
Comments
Please login to add a commentAdd a comment