
ఓటర్లను మింగుతున్న జాబితాలు
దొంగ ఓట్లను అరికట్టి, స్వేచ్ఛగా, జవాబుదారీతనంతో, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడానికి ఓటర్ల జాబితాలు అత్యంత ఆవశ్యకం. కానీ ఈ ఎన్నికలలో ఓటర్ల జాబితాల విషయంలోనే ఎన్నికల సంఘం ఘాటు విమర్శలను ఎదుర్కొనవలసి వచ్చింది.
‘ఓటు పౌరులందరి హక్కు’ అంటూ ఎన్నికల సంఘం ఇచ్చిన ప్రకటనలలో హాస్యనటుడు బ్రహ్మానందం కనిపిం చారు. కానీ ఆయనే ఆ హక్కును వినియోగించుకోలేకపోయారు. కారణం- ఓటర్ల జాబితాలో పేరు గల్లంతయింది. అది ఆ హాస్యనటుడి విషయంలో జరిగిన విషాదం మాత్రమే కాదు, దేశం నిండా అలాంటి ఫిర్యాదులే.
ఈ ఎన్నికలు అనేక కోణాల నుంచి కొత్త చరిత్రను లిఖిం చాయి. రికార్డు స్థాయిలో 66.38 శాతం ఓటర్లు తమ హక్కు ను వినియోగించుకున్నారు. ఇందిర హత్య తరువాత 1984 - 85 నాటి ఎన్నికలలో పోలైన 64.01 శాతమే ఇంతవరకు పెద్ద రికార్డు. ఆ రికార్డు బద్దలయింది. తొమ్మిది దశలలో, రెండు మాసాల పాటు ఎన్నికల తతంగం కొనసాగడం మీద కొన్ని విమర్శలు వచ్చినా, ఇంత సమర్ధంగా ఎన్నికలు జరగ డం బహుశా ఇదే ప్రథమం. ఎన్నికల వ్యయంతో పాటు, సో షల్ మీడియా పాత్ర కూడా విస్తరించింది. రాజకీయ పార్టీలు 200 మిలియన్ ఓటర్లను ఆ మీడియా ద్వారానే పలకరించా యి. వీటితో పాటు, జాబితాల నుంచి ఓటర్ల పేర్లు గల్లంతు కావడంలోనూ ఈ ఎన్నికలు రికార్డు సృష్టించాయి.
ప్రస్తుతం 700 మిలియన్ ఓటర్లతో నిజంగానే భారత్ పెద్ద ప్రజాస్వామిక దేశంగా గౌరవం పొందుతోంది. ఎన్నికల ప్రాధాన్యాన్ని గమనించిన రాజ్యాంగ నిర్మాతలు జనవరి 25వ తేదీని జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించారు. ఎన్నికల నిర్వహణ మొత్తానికి కేంద్ర బిందువు ఓటర్ల జాబి తాల రూపకల్పన. ఈ క్రమంలో ఎన్నికల ప్రక్రియను మరిం త బలోపేతం చేయడానికి ప్రవేశపెట్టినదే- ఎలక్టోరల్ ఫో టో ఐడెంటిటీ కార్డ్ (ఎపిక్). దొంగ ఓట్లను అరికట్టి, స్వేచ్ఛ గా, జవాబుదారీతనంతో, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడానికి పటిష్ట ఓటర్ల జాబితాలు అత్యంత ఆవశ్యకం. కానీ ఈ ఎన్నికలలో ఓటర్ల జాబితాల విషయంలోనే ఎన్నికల సంఘం ఘాటు విమర్శలను ఎదుర్కొనవలసి వచ్చింది. ముంబై, పుణే నగరాలలోనే ఐదు లక్షల పేర్లు గల్లంతు కావడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో ఐదు ప్రజాప్రయోజన వ్యా జ్యాలు దాఖలైనాయంటేనే తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల కమిషనర్ హెచ్‌ఎస్ బ్రహ్మ సయితం ఈ గల్లంతు గారడీని చూసి విస్తుపోయారు. క్షమాపణలు చెప్పారు.
ఎన్నికల జాబితాల నుంచి ఎలాంటి వ్యక్తుల పేర్లు మా యమైనాయో గమనించి దేశం కూడా విస్తుపోయింది. అన్నా బృందం సభ్యుడు, ఓటు హక్కు ప్రాధాన్యాన్ని విశేషంగా ప్రచారం చేసినవాడు అరవింద్ కేజ్రీవాల్. ఆయన ఓటు హక్కు వినియోగించుకోకుండా గోవాలో ప్రచారానికి వెళ్లిపోవడం విమర్శలకు దారి తీసింది. అయితే ఘాజియాబాద్ (ఉత్తరప్రదేశ్)లోని ఇందిరాపురం ప్రాంతంలో ఓటు వేయడానికి వె ళ్లిన కేజ్రీవాల్ పేరు జాబితాలో గల్లంతయిన సంగతి తెలిసే గోవా వె ళ్లారు. చాలామందికి ఓటరు గుర్తింపు కార్డులు ఉన్నా, జాబితాలలో పేర్లు లేవు. ముంబైలో ప్రఖ్యాత న్యా యవాది రామ్ జఠ్మలానీ, బీఎస్‌యీ చైర్మన్ ఆశిష్ కుమార్ చౌహాన్, హెచ్‌డీఎఫ్‌సీ చైర్మన్ దీపక్ పరేఖ్, సినీ ప్రముఖుడు అమోల్ పాలేకర్ దంపతుల పేర్లు హుష్ కాకి అయ్యాయి. ముంబై, పుణే, నాగపూర్‌లది ఒకే రకం అనుభవం. దీని మీదే మహారాష్ట్ర హైకోర్టు ధర్మాసనం స్పందిస్తూ, జాబితాలను తక్షణమే సరిచేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఓటర్ల జాబితా నుంచి పేర్లు ఎందుకు తొలగిస్తారో అం తు పట్టని రీతిలో ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల ఓట్లున్న అదృష్టవంతులు వెంటనే జరిగే సాధారణ ఎన్నికలలో ఓటు వేయలేక నిరాశ పడవచ్చు. ఒడిశాలో ఇదే జరిగింది. అలాగే కొద్దికాలం క్రితమే జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో ఓట్లు వేసిన వారు లోక్‌సభ ఎన్నికలలో ఆ అదృష్టానికి నోచుకోలేకపోయారు. ఢిల్లీ పరిధిలో 13.58 లక్షల ఓటర్ల పేర్లు జాబితాల నుంచి తొలగించారని 23-8-‘13న అప్పటి న్యా యశాఖ మంత్రి కపిల్ సిబల్ రాజ్యసభలో ప్రకటించారు. ఇది ఎవరినైనా విస్తుపోయేటట్టు చేయగలదు.
అన్ని ఓట్లు తొలగించడానికి ఎవరైనా ఏ కారణం చూడగలరు, తీవ్ర నిర్లక్ష్యాన్ని తప్ప. 1989లో కాశ్మీర్ నుంచి వచ్చిన పండిట్ల ఓట్లు లక్ష వరకు ఉండేవి. ఇప్పుడు పదిహేను వేలకు చేరాయి. అసలు స్థానిక, అసెంబ్లీ, లోక్‌సభ - ఏ ఎన్నికలకైనా ఓటర్లు వారే. మాయంతా జాబితాల తయారీ దగ్గరే. రాజకీయ పక్షాల, ముఖ్యంగా స్థానిక నేతల కుట్ర ఇందులో కొట్టిపారేయ లేనిదే. ఓటర్ల జాబితాల తయారీలో దోషాల రేటు సగటున నలభై శాతమని కర్ణాటకలో రెండు నియోజకవర్గాలలో సర్వే చేసిన ఒక స్వచ్ఛంద సంస్థ తేల్చింది. ఎలాంటి తనిఖీ లేకుండానే పేర్లు తొలగింపు యథేచ్ఛగా జరిగిపోతోందని అనిపిస్తుంది. దీని మీద కొత్త పార్లమెంట్ పటిష్టమైన చట్టం చేసి, సరిచేయడం అవసరం.
- డాక్టర్ గోపరాజు నారాయణరావు