సాక్షి, అమరావతి: గత కొన్ని రోజులుగా కరోనా నిర్ధారణ పరీక్షల్లో రాష్ట్రం దూసుకువెళుతోంది. దేశంలోనే అత్యధిక కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. దేశంలో పదిలక్షల మంది జనాభాకు 418 మందికి టెస్టులు, రాష్ట్రంలో 1, 147 టెస్టులు చేస్తున్నారు. ఇప్పటివరకు ఆంధ్ర ప్రదేశ్‌లో 61, 266 టెస్టులు చేశారు. దీంతో పది లక్షల జనాభాకు సగటున వెయ్యి టెస్టుల మార్కు దాటిన ఒకే రాష్ట్రంగా ఏపీ నిలిచింది. గడిచిన 24 గంటల్లోనే 6,928 నమూనాలను నిర్ధారించగలిగింది. రాజస్థాన్ పది లక్షల జనాభాకు సగటున 910 టెస్టులతో రెండో స్థానంలో 836 టెస్టులతో తమిళనాడు మూడో స్థానంలో ఉన్నాయి.
రాష్ట్రంలో మొదటి స్థానంలో విశాఖ జిల్లా: ఇక రాష్ట్రంలో టెస్టుల పరంగా విశాఖ జిల్లా మొదటి స్థానంలో ఉంది. ఈ జిల్లాలో ఇప్పటి వరకు 8,141 టెస్టులు చేశారు. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 1,806 టెస్టులు చేశారు. జిల్లాల వారీగా పరీక్షల సంఖ్య ఇలా ఉంది..
కొత్తగా 61 కేసులు
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,000 మార్కును అధిగమించింది. కొత్తగా శనివారం 61 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శనివారం విడుదల చేసిన బులిటెన్‌లో తెలిపింది. కృష్ణా జిల్లాలో అత్యధికంగా 25 కేసులు, కర్నూలులో 14, అనంతపురం జిల్లాలో 5, వైఎస్సార్ కడప, నెల్లూరు జిల్లాలో 4 చొప్పున, తూర్పుగోదావరి, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాలో 3 కేసులు చొప్పున నమోదయ్యాయి. ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాని శ్రీకాకుళం జిల్లాలో తొలిసారిగా మూడు కేసులు నమోదు కావడం గమనార్హం. అలాగే, కర్నూలు జిల్లాలో మొత్తం కేసులు 275కు, గుంటూరులో 209, కృష్ణాలో 127కు చేరుకున్నాయి. మరోవైపు.. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉ.9 గంటల వరకు మొత్తం 6,928 శాంపిల్స్ పరీక్షించగా అందులో 61 పాజిటివ్ కేసులు వచ్చాయి.
ఇప్పటివరకు రాష్ట్రంలో 61,266 మంది శాంపిల్స్‌ను పరిశీలించగా 1,016 పాజిటివ్‌గా వచ్చాయి. ఇదిలా ఉంటే.. కోవిడ్ వైరస్ నుంచి తాజాగా కోలుకుని మరో 26 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్లు అధికారులు ఆ బులిటెన్‌లో పేర్కొన్నారు. ఇందులో ప్రకాశం జిల్లా నుంచి 11 మంది, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాల్లో నలుగురు చొప్పున, కర్నూలులో ముగ్గురు, అనంతపురం, నెల్లూరు జిల్లాల నుంచి ఇద్దరేసి చొప్పున డిశ్చార్జ్ అయ్యారు. వీరితో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 171కి చేరింది. ఇదే సమయంలో కర్నూలు, కృష్ణా జిల్లాలో ఒకరు చొప్పున మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 31కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ పాజిటివ్ కేసుల సంఖ్య 814గా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment