ఇసుక లెక్క..ఇక పక్కా
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ర్యాంపుల నుంచి ఇష్టారాజ్యంగా ఇసుకను కొల్లగొడుతున్న అక్రమార్కులకు చెక్ పెట్టేందుకు జిల్లా యంత్రాంగం శ్రీకారం చుడుతోంది. రాష్ట్రంలోనే తొలిసారిగా జిల్లాలోని ఇసుక ర్యాంపుల్లో ఆడిటింగ్ చేపట్టాలని నిర్ణయించింది. ఇసుక రీచ్‌ల నిర్వహణను డ్వాక్రా సంఘాలకు.. వాటి పర్యవేక్షణ బాధ్యతలను డీఆర్‌డీఏ, రెవెన్యూ, పోలీస్ అధికారులకు ప్రభుత్వం అప్పగించిన విషయం విదితమే. గడచిన నెల రోజుల్లో జిల్లావ్యాప్తంగా 22 ఇసుక రీచ్‌లు ప్రారంభమయ్యాయి. సాయంత్రం 6 గంటల వరకే డ్వాక్రా సంఘాల నిర్వహణలో ఉంటున్న రీచ్‌లు రాత్రివేళ మాత్రం పూర్తిగా తెలుగుదేశం పార్టీ నేతలు, ఎమ్మెల్యే అనుచరుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. వారంతా నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు చేపట్టి తరలించేస్తున్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలు, ఓ స్థానిక ప్రజాప్రతినిధి అనుచరులు సాగిస్తున్న దౌర్జన్యకాండకు అటు పోలీసు, రెవెన్యూ అధికారులు సైతం ఏమీ చేయలేని దుస్థితి నెలకొంది.
ఇటీవల నబీపేట ఇసుక ర్యాంపు వద్ద తలెత్తిన వివాదంలో డ్వాక్రా మహిళలను బెదిరించిన ఘటన ఇసుక మాఫియాకు టీడీపీ నేతల అండ ఏస్థాయిలో ఉందనే విషయాన్ని స్పష్టం చేసింది. ఈ నేపథ్యమో.. మరో కారణమో తెలీదు కానీ జిల్లాలోని 22 ఇసుక ర్యాంపుల లావాదేవీలపై ఆడిటింగ్ చేపట్టాలని జిల్లా అధికారులు నిర్ణయించారు. రీచ్‌లు ప్రారంభించిన నాటినుంచి ఇప్పటివరకు ఎన్ని క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకాలు జరిపారు, ఎంత సరఫరా చేశారు, ప్రభుత్వానికి ఎంత ఆదాయం సమకూరిందనే అంశాలను అధికారులు పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తారు.
వాస్తవానికి ఆయా అంశాలతో ఆడిటింగ్ విభాగానికి ఎటువంటి సంబంధం లేదు. మునుపెన్నడూ ఇసుక రీచ్‌ల నిర్వహణ, ఆదాయంపై ఆడిటింగ్ చేసిన దాఖలాలే లేవు. అయితే ఇసుక రీచ్‌ల నిర్వహణ అధ్వానంగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆడిటింగ్ చేపట్టాలని కలెక్టర్ కె.భాస్కర్, జేసీ టి.బాబూరావునాయుడు నిర్ణయించారని తెలుస్తోంది. ఆడిటింగ్ పక్కాగా జరిగితే రీచ్‌లలో అనుమతుల్లేకుండా ఎన్ని క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వారో తేలుతుందని అంటున్నారు. అదేవిధంగా ఇప్పటివరకు ఏయే ర్యాంపుల నుంచి ఎంత ఇసుక అక్రమంగా బయటకు వెళ్లిందనే లెక్క కూడా తేలుతుందని చెబుతున్నారు. ఇదిలావుండగా, అధికారం దన్నుతో పేట్రేగిపోతున్న ఇసుక మాఫియా తాజా ఆడిటింగ్‌తోనైనా అక్రమాలకు ఫుల్‌స్టాప్ పెడుతుందా లేక ఆడిటింగ్ అధికారులను కూడా తమదారిలోకి తెచ్చుకుని దందాను కొనసాగిస్తుందా అనేది వేచిచూడాలి.