బదిలీల గుబులు
సాక్షి, గుంటూరు: ఇప్పుడు ప్రభుత్వోద్యోగుల్లో బదిలీల గుబులు మొదలైంది. కొత్తగా తెలుగుదేశం పా ర్టీ అధికారంలోకి రానున్న నేపథ్యంలో తమకు అనుకూలురైనవారిని అందుబాటులోకి తెచ్చుకోవడం, తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారనుకున్నవారిని సాగనంపేందు కు అప్పుడే యత్నాలు మొదలయ్యాయి. ఇప్పటికే దీనికి సంబంధించి కొత్తగా ఎన్నికైన టీడీపీ ఎమ్మెల్యేలు తమ సొంత జాబితాలు రూపొందించుకుంటున్నట్టు తెలుస్తోంది. దీనిపై ఉద్యోగుల్లో ఉత్కంఠ మొదలైంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ ప్రాంత ఉద్యోగులు ఎలాగూ ఆ ప్రాంతానికి వెళ్లక తప్పదు. ఇందుకోసం ఇప్పటికే వారు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
జూన్ మొదటివారం వరకూ బదిలీలపై నిషేధం ఉండటంతో ఈ లోగానే అధికార పార్టీ నేతల్ని ప్రసన్నం చేసుకునే పనిలో ఈ జిల్లా అధికారులు బిజీ బిజీగా ఉన్నారు. ముఖ్య పోస్టుల కోసం పైరవీలు ప్రారంభించారు. ముఖ్యంగా రెవెన్యూ, పోలీస్, ఎక్సైజ్, సంక్షేమ శాఖల అధికారులు ఫోకల్ పోస్టుల కోసం అధికార పార్టీ నేతల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. మరో వైపు టీడీపీ నాయకులు కూడా చాప కింద నీరులా తమకు అనుకూలురైన అధికారుల్ని ముఖ్య స్థానాల్లో నియమించుకునేందుకు జాబితా తయారు చేసుకుంటున్నారు. జిల్లా పాలనలో నిష్పాక్షికంగా వ్యవహరించిన అధికారులు బదిలీపై వెళ్ళేందుకు మానసికంగా సిద్ధపడుతున్నారు.
తమ మార్కు పాలనకోసమే... పదేళ్ళు అధికారానికి దూరమైన టీడీపీకి ఇప్పుడు అధికారం చేజిక్కడంతో పాలనలో తమ మార్కు కనిపించేలా చూసుకునేందుకు తహతహలాడుతోంది. ఎన్నికల సమయంలో జిల్లాలో పలువురు తహశీల్దార్లు, ఎంపీడీవోలు ఇతర జిల్లాలకు బదిలీపై వెళ్ళారు. ఇప్పుడు వారంతా ఈ జిల్లాలో మళ్ళీ పోస్టుల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో టీడీపీలో గెలుపొందిన వారిలో సీనియర్లు అధికంగా ఉన్నారు. వీరి నడుమ అదే స్థాయిలో వైరుధ్యాలు ఉన్నాయి. అధికారుల బదిలీల విషయంలోనూ వారి మధ్య పొరపొచ్చాలు పొడచూపే అవకాశం లేకపోలేదు.
గతంలో తన సిఫార్సులు పట్టించుకోలేదని... ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నుంచి వలస వచ్చిన ఓ ముఖ్య నేత తాను చెప్పిన పనులేవీ పట్టించుకోలేదని ఓ ఉన్నతాధికారిపై గుర్రుగా ఉన్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజుల్లోపే ఆ అధికారిపై బదిలీ వేటు వేయాలని కృతనిశ్చయంతో ఉన్నారు. అదే విధంగా ఓ పోలీసు ఉన్నతాధికారి వైఎస్సార్ సీపీకి అనుకూలంగా వ్యవహరించారని, ఆయన్ను సాగనంపాలని పట్టుదలతో టీడీపీ నేతలున్నారు. ఇప్పటికే ఎక్సైజ్ శాఖలో ఓ అధికారి వైఎస్సార్ సీపీకి అనుకూలంగా వ్యవహరించారనే అనుమానంతో సదరు అధికారిపై సస్పెన్షన్ వేటు వేశారని అధికార వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద టీడీపీ నేతల జాబితా కసరత్తుపై ఉద్యోగుల్లో కలవరం మొదలైంది.