
పవర్ పోయేలోగా పనికానిచేద్దాం
అనర్హత కంపెనీలకు అడ్డగోలు రాయితీలు
పెట్టుబడులకు మించి రాయితీ కల్పిస్తున్న రాష్ట్ర సర్కారు
పెప్సీ, మహీంద్రా కంపెనీలపై అలవిమాలిన ప్రేమ
నిబంధనలను తుంగలోకి తొక్కుతున్న వైనం
‘మ్యాంగో జ్యూస్’ సాకుతో పెప్సీకి లబ్ధి చేకూర్చేందుకు రెడీ
మహీంద్రా కంపెనీ పొరుగు రాష్ట్రంలో చెల్లించే వ్యాట్‌ను భరించేందుకు సంసిద్ధత
ఎస్‌ఐపీబీ ద్వారా లేదంటే నేరుగా ఎంవోయూ ద్వారా రాయితీల ప్రకటనకు రంగం సిద్ధం
అనుకూలంగా ప్రతిపాదనలు పంపాలంటూ
అధికారులపై ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లు
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు రాష్ట్ర విభజన సెగలు... మరోవైపు పదవి ఎప్పుడు ఊడుతుందో తెలియని పరిస్థితి! ఈ పరిస్థితుల్లో అన్ని పనులూ కానిచ్చేద్దామని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించుకున్నట్టుంది. ఒక చేత్తో అనర్హత జాబితాలోని కంపెనీకి రాయితీలు ఇచ్చేందుకు సిద్ధపడుతున్న ప్రభుత్వం... మరో చేత్తో ఇతర రాష్ట్రాల్లో విక్రయించే ట్రాక్టర్లకు కూడా వ్యాట్ రాయితీని ఇచ్చేందుకు ఉవ్విళ్లూరుతోంది. ఇందుకు ఎన్ని అడ్డదారులనైనా తొక్కేందుకు వెనుకాడటం లేదు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) నేతృత్వంలోని రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ (ఎస్‌ఐపీసీ)తో సంబంధం లేకుండా అవగాహన ఒప్పందం (ఎంవోయూ) రూపంలోనో.. సీఎం నేతృత్వంలోని రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్‌ఐపీబీ) ద్వారానో పని కానిచ్చేందుకు పథక రచన కొనసాగుతోంది. ఈ మేరకు ప్రతిపాదనలు పంపాలంటూ పరిశ్రమల శాఖ అధికారులపై ప్రభుత్వ పెద్దలు ఒత్తిళ్లు తెస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా కోట్లాది రూపాయల ఈ రాయితీ వ్యవహారంలో భారీగా డబ్బులు చేతులు మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పెప్సీకి ‘రెడ్’ కార్పెట్..
చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీ సెజ్‌లో రూ.400 కోట్లతో ఏర్పాటు చేయనున్న యూనిట్‌కు అర్హత లేకున్నా రాయితీలు ఇచ్చేందుకు వేగంగా ప్రతిపాదనలు నడుస్తున్నాయి. వాస్తవానికి కూల్ డ్రింక్స్ తయారీ యూనిట్... పారిశ్రామిక విధానం ప్రకారం అనర్హత జాబితాలో ఉంది. అయితే మ్యాంగో జ్యూస్ కూడా ఇక్కడ తయారు చేయనున్నారనే సాకుతో అర్హత లేకున్నా రాయితీలు ఇచ్చేందుకు ప్రభుత్వ పెద్దలు సిద్ధపడుతున్నారు. రెండు రకాల ఉత్పత్తులను ఒకే ప్లాంటులో సంస్థ ఉత్పత్తి చేస్తుంటే.. రాయితీకి అర్హత కలిగిన ఉత్పత్తి... మొత్తం ఉత్పత్తిలో 89 శాతం ఉండాలి. అనర్హత కలిగిన ఉత్పత్తి మొత్తం ఉత్పత్తిలో 11 శాతానికి మించకూడదు. అయితే ఈ పెప్సీ కంపెనీ ఉత్పత్తుల్లో అర్హత కలిగిన వస్తువు ఉత్పత్తి (ఫ్రూట్ జ్యూస్) కేవలం 11 శాతం ఉండగా... అనర్హత కలిగిన వస్తువు (కూల్ డ్రింక్స్) ఉత్పత్తి ఏకంగా 89 శాతంగా ఉంది. ఈ నేపథ్యంలో పారిశ్రామిక విధానం 2010-15 మార్గదర్శకాల ప్రకారం పెప్సీకి రాయితీలు ఇచ్చే అవకాశమే లేదు. అందుకే నేరుగా ఎస్‌ఐపీబీ ద్వారా లేదంటే ఎంవోయూ రూపంలో పని కానిచ్చేందుకు ప్రభుత్వ పెద్దలు నిర్ణయించుకున్నారు. ఇందుకు అనుగుణంగా పరిశ్రమల శాఖ అధికారులపై ప్రభుత్వ పెద్దలు తీవ్ర ఒత్తిళ్లు తెస్తున్నట్టు సమాచారం. వాస్తవానికి యూనిట్‌కు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (ఏపీపీసీబీ) అనుమతి ఇవ్వడంలోనే తతంగం నడిచిందని సమాచారం. శ్రీసిటీ సెజ్‌లో గ్రీన్ కేటగిరీ పరిశ్రమలకే అనుమతి ఇవ్వాల్సి ఉంది. కానీ పెప్సీ యూనిట్ రెడ్ కేటగిరీ (కాలుష్యకారక పరిశ్రమ) కిందకు వస్తుంది. అందుకే మొదట్లో యూనిట్ ఏర్పాటుకు పీసీబీ అనుమతి ఇవ్వలేదని సమాచారం. అయితే ప్రభుత్వ పెద్దల జోక్యంతో అనుమతి ఇచ్చినట్టు తెలుస్తోంది.
మహీంద్రా కంపెనీకి జీ హుజూర్..
మెదక్ జిల్లాలోని జహీరాబాద్ వద్ద రూ.350 కోట్ల పెట్టుబడితో మహీంద్రా కంపెనీ ఏర్పాటు చేస్తున్న ట్రాక్టర్ల తయారీ యూనిట్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అదనపు రాయితీలు మంజూరు చేసింది. 100 శాతం వ్యాట్ ఇచ్చేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు కూడా విడుదల చేసింది. పారిశ్రామిక విధానం 2010-15 ప్రకారం కేవలం 50 శాతం వ్యాట్ రాయితీ మాత్రమే ఇవ్వాల్సి ఉంది. అదనంగా 50 శాతం వ్యాట్ రాయితీ ఇచ్చినా సంతృప్తి చెందని ఆ కంపెనీ.. ఇప్పుడు ఇన్‌పుట్ వ్యాట్ రాయితీ ఇవ్వాలని కోరుతోంది. పారిశ్రామిక విధానం ప్రకారం రాష్ట్రంలో కేవలం ఔట్‌పుట్ ట్యాక్స్ రాయితీ విధానం మాత్రమే అమల్లో ఉండగా.. ప్రభుత్వం మాత్రం ఇన్‌పుట్ ట్యాక్స్ (విడిభాగాలపై వసూలు చేసే వ్యాట్)ను 14.5 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది. ఈ 5 శాతం ట్యాక్స్‌ను కూడా తిరిగి రాయితీ రూపంలో వెనక్కి ఇవ్వాలని ఆ కంపెనీ అంటోంది. ఈ యూనిట్‌లో తయారైన ట్రాక్టర్లను పక్క రాష్ట్రాల్లోనే ఎక్కువగా విక్రయించనున్నట్టు తెలిసింది. ఈ లెక్కన ఆ కంపెనీ వ్యాట్‌ను మనకు కాకుండా పక్క రాష్ట్రాల్లో చెల్లిస్తుంది. ఆ కంపెనీ కోరుతున్న ప్రతిపాదనకు ఒప్పుకుంటే ఇలా ఇతర రాష్ట్రాల్లో చెల్లించే వ్యాట్‌ను కూడా మన రాష్ట్ర ఖజానా నుంచే చెల్లించాల్సి వస్తుంది. ఇది రాష్ట్ర ఖజానాకు తీవ్ర నష్టమని ఇప్పటికే పరిశ్రమల శాఖ అధికారులు స్పష్టం చేశారు. అయినా ససేమిరా అంటూ ఇన్‌పుట్ వ్యాట్ ఇచ్చేందుకు ప్రతిపాదనలు పంపాలంటూ అధికారులపై ప్రభుత్వ ముఖ్య నేత ఒత్తిడి తెస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మార్గదర్శకాలను తుంగలో తొక్కుతూ..
ఏదైనా పరిశ్రమకు రాయితీ ఇవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) నేతృత్వంలోని రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ (ఎస్‌ఐపీసీ) ముందు పరిశ్రమల శాఖ ప్రతిపాదనను ఉంచుతుంది. ఈ కమిటీలో ఆర్థికశాఖతోపాటు వాణిజ్య, ఇంధన, రెవెన్యూ, మున్సిపల్ శాఖలతో పాటు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శులు కూడా ఉంటారు. పారిశ్రామిక విధానం మేరకు ఏయే పరిశ్రమలకు ఎంత రాయితీలు ఇవ్వాలనే విషయాన్ని పరిశీలించి అందుకు అనుగుణంగా ఎస్‌ఐపీసీ నిర్ణయం తీసుకుంటుంది. అనంతరం సీఎం నేతృత్వంలోని రాష్టస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్‌ఐపీబీ) ముందు ఎస్‌ఐపీసీ ప్రతిపాదనలు ఉంచుతారు. ఎస్‌ఐపీబీలో వివిధ శాఖల ముఖ్యకార్యదర్శులతో పాటు ఆయా శాఖల మంత్రులు కూడా భాగస్వాములు అవుతారు. ఎస్‌ఐపీసీతో పాటు ఎస్‌ఐపీబీ ఆమోదం లభిస్తేనే ఆ పరిశ్రమకు రాయితీలను మంజూరు చేస్తూ పరిశ్రమల శాఖ ఉత్తర్వులు జారీచేస్తుంది. అయితే పెప్సీ, మహీంద్రా అండ్ మహీంద్రా విషయాల్లో ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహారం నడుస్తోంది.
పెట్టుబడి మించిన రాయితీలా..?
పరిశ్రమ నెలకొల్పితే పారిశ్రామిక విధానం ప్రకారం పలు రాయితీలను కల్పిస్తారు. ఇందులో 100 స్టాంపు డ్యూటీ రాయితీతో పాటు యూనిట్ విద్యుత్‌కు రూపాయి చొప్పున రాయితీ, వ్యాట్‌లో రాయితీ, భూమి వినియోగ మార్పిడి పన్నులో 25 శాతం రాయితీ మొదలైనవి ఇస్తారు. పెప్సీ కంపెనీ విషయాన్ని తీసుకుంటే ఏకంగా 100 శాతం వ్యాట్ రాయితీని ఐదేళ్లల్లో ఇచ్చేందుకు అవకాశం ఉందని తెలుస్తోంది. అంటే పెప్సీ కంపెనీ ఏర్పాటుకు వెచ్చించిన మొత్తం పెట్టుబడి రూ.400 కోట్లు కేవలం వ్యాట్ రాయితీ రూపంలోనే తిరిగి వస్తుంది. దీనికి మిగతా విద్యుత్, స్టాంపు డ్యూటీ మొదలైన రాయితీలు అదనం. అంటే అర్హత లేని ఓ కంపెనీకి ఏకంగా పెట్టుబడికి మించిన మొత్తాన్ని రాయితీల రూపంలో తిరిగి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధపడుతోందన్నమాట!!