
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల కార్యాచరణను రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం హైకోర్టుకు అందజేసింది. మార్చి 3లోపు అన్ని స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేస్తామని హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో ఎన్నికల సంఘం కార్యదర్శి పేర్కొన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను జనవరి 17 నుంచి ఫిబ్రవరి 15 మధ్యలో పూర్తి చేస్తామని తెలిపారు. పంచాయతీ ఎన్నికలను ఫిబ్రవరి 8 నుంచి మార్చి 3 మధ్యలో నిర్వహిస్తామని వెల్లడించారు. జనవరి 10న ఎన్నికల సన్నాహాలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని.. అదే రోజు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఆర్థిక శాఖ, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శులతో సమావేశం అవుతామన్నారు. జనవరి 13న రాజకీయ పార్టీలతో భేటీ కానున్నట్టు తెలిపారు. అఫిడవిట్‌ను పరిశీలించిన హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికలకు అనుమతి ఇచ్చింది. (చదవండి: జెడ్పీ రిజర్వేషన్లు.. 6 స్థానాలు మహిళలకే)
ఈసీ అఫిడవిట్‌లోని అంశాలు..
- జనవరి 17న ఎంపీపీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్
- ఫిబ్రవరి 15లోగా ఎంపీపీ, జెడ్పీటీసీ ఎన్నికలు పూర్తి
- ఫిబ్రవరి 8న పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్
- మార్చి 3లోగా పంచాయతీ ఎన్నికలు పూర్తి
- జనవరి 10న ఉన్నతాధికారులతో ఈసీ సమావేశం
- జనవరి 13న రాజకీయ పార్టీలతో ఈసీ భేటీ