
సాక్షి, అమరావతి: స్థానిక ఎన్నికల్లో ఒకే అభ్యర్థి బరిలో ఉన్న చోట ‘నోటా’కు ఏ మాత్రం అవకాశం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఒకే అభ్యర్థి బరిలో ఉంటే ఆ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించాల్సిందేనని తెలిపింది. ఎన్నికలు జరిగినప్పుడు మాత్రమే ‘నోటా’ను ఉపయోగించుకోవచ్చునంది. ఒకే అభ్యర్థి ఎన్నికల బరిలో ఉన్నప్పుడు ‘నోటా’ను వినియోగించుకోవడానికి నిబంధనలు అనుమతించడం లేదని స్పష్టం చేసింది.
ఈ విషయంలో తగిన నిబంధనలు రూపొందించేందుకు వీలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాలని పిటిషనర్‌కు వెసులుబాటునిచ్చింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులిచ్చింది. స్థానిక ఎన్నికల్లో ఒకే అభ్యర్థి పోటీలో ఉన్న చోట నోటాను వినియోగించుకునే అవకాశాన్ని ఓటర్లకు ఇవ్వాలంటూ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన బీవీ భద్ర నాగశేషయ్య, మరొకరు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు.